జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కొలిక్కి..
ఇప్పటివరకు గుర్తించిన అంశాలు, అవకతవకలపై 204 పేజీలతో నివేదిక
నేటి నుంచి మలి విడత క్రాస్ ఎగ్జామినేషన్ షురూ
తొలిరోజు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పిలుపు.. అనంతరం నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించనున్న కమిషన్
వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్‌లను విచారించే చాన్స్
బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచా రణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. నివేది కలో దాదాపుగా 12 అధ్యయనాల వివరాలున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలోని ఫైళ్లను అధ్యయనం చేయడంతోపాటు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
బరాజ్‌ల నిర్మా ణంతోపాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్టుగా కమిషన్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించడానికి బరాజ్‌ల అంచనాలను ఏటేటా పెంచడంతోపాటు జరగని పనులకు కూడా రూ.కోట్లలో బిల్లులు జారీ చేసినట్టుగా ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బరాజ్‌లకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని.. మరికొందరు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరిలో రెండు పర్యాయాలు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నద్ధమైనట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రామకృష్ణారావుకు క్రాస్ ఎగ్జామినేషన్..
ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికిపైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్.. మంగళవారం నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ప్రశ్నించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయనను విచారించనుంది. బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాష్, బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులనూ ఇదే విడతలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్, ఈటలకు పిలుపు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల, ఆర్థిక మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ వచ్చే నెలలో క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. వారికి సమన్లు జారీ చేయడానికి ముందే బలమైన ఆధారాలను సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. చివరగా కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా కమిషన్ విచారణను ముగించి, ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే యోచనతో ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment