హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కమిషన్ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్ చంద్రఘోష్ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.
కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.
ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్ ముందు చెప్పారు.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్‌స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment