హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో తాజా మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు.
విచారణలో భాగంగా.. కాళేశ్వరం కమిషన్ ముందుకు 18 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. ఈ ఇరిగేషన్ అధికారులు మధ్యాహ్నాంలోపే నేరుగా కమిషన్ కార్యాలయానికి వెళ్తారని, కమిషన్ అడిగిన వివరాలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు.
నిన్నటి విచారణకు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్‌ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్‌సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు.
మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది.
జూన్‌లోపు పూర్తి కాదు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు.
‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల భేటీ
జస్టిస్ పీసీ ఘోష్‌తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
54 ఫిర్యాదులు:జస్టిస్ పీసీ ఘోష్
కాళేశ్వరం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్‌కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment