భద్రాద్రి వద్ద నిండుకుండలా గోదావరి
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వద్ద 4.50 లక్షల క్యూసెక్కుల మేర వరద ఉధృతి కొనసాగింది. దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద సైతం స్థానిక వాగుల నుంచి నీరు వస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగి జలాశయం నిండు కుండను తలపిస్తోంది.
ప్రస్తుతం మేడిగడ్డలో 4.51 టీఎంసీలు, అన్నారంలో 9.25 టీఎంసీలు, సుందిళ్లలో 6 టీఎంసీల మేర నిల్వలున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి 51,864 క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో 4 గేట్లు తెరిచి 39,809 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. కడెం నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా ప్రస్తుతం 6.23 టీఎంసీల నిల్వ ఉంది. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లిలోకి 48,861 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వ 20 టీఎంసీలకుగాను 13 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 7.3 టీఎంసీలకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment