కాళేశ్వరం బరాజ్‌లపై తుది అంకానికి విచారణ
ముఖ్య నేత ఇంటికి వెళ్లి విచారించే యోచన!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణ చివరి అంకానికి చేరడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులకు త్వరలో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారుల నుంచి వాంగ్మూలంతో పాటు అఫిడవిట్లను స్వీకరించి పరిశీలించింది. ఈ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది.
గడువులోగా అఫిడవిట్ దాఖలు చేయకుండా కమిషన్ ఆదేశాలను ధిక్కరించిన ఓ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి విచారణకు తాజాగా సమన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. కాగా మాజీ ముఖ్యనేత ఒకరు అనారోగ్యంతో ఉన్నారని, విచారణకు హాజరుకాలేరని బీఆర్‌ఎస్ నేత ఒకరు కమిషన్‌కు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. అయితే ఒకవేళ సమన్లు జారీ చేసినా, విచారణకు రానిపక్షంలో కమిషన్ స్వయంగా ఆ నేత నివాసానికి వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇలావుండగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను వచ్చే వారం నుంచి కమిషన్ ప్రారంభించనుంది. 57 మంది సాక్షులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో కమిషన్‌కు సహకరించేందుకు తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని నియమించాలని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్థిక అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment