రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం భారీ షాక్
కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు తిప్పి పంపుతూ లేఖ
తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది.
అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం
వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు?
ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది.
ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో
ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment