రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.
నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది.
కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్‌ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు.
క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్‌లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
కమిషన్ విచారణ తీరిది..
» బరాజ్‌ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు.
» బరాజ్‌ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్‌ల నిర్మాణం జరిగితే.. వరంగల్‌లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్‌ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు.
» బరాజ్‌ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు.
»డిజైన్ల ప్రకారం బరాజ్‌ల పునాదుల కింద షీట్‌పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు.
» బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు.
» కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment