సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం నిధులివ్వడంపై కేంద్రం మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈ ఏడాది జనవరి 24న అధికారుల కమిటీ చర్చించిన అంశాలను ప్రస్తావించి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు తన కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నియమించిన రాష్ట్ర అధికారుల కమిటీతో చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కమిటీని పీఎంవో ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో కేంద్ర అధికారుల కమిటీతో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగింది. నేడు జరిగే సమావేశం సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని, సమస్యల పరిష్కారం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధానితో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రధానాంశాలు ఇవీ
► పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలి.
► సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలి. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
► భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు డీబీటీ (నేరుగా నగదు బదిలీ) పద్ధతిలో పరిహారాన్ని అందించాలి.
► రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలి.
► 2014–15కి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి ఈ నిధులను రావాల్సి ఉంది.
► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే రేషన్ వ్యయాన్ని భరిస్తోంది. ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్ కూడా సూచించింది.
► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి.
► హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి.
► ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది.
► రాష్ట్రంలో 26 జిల్లాలకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరో 12 కాలేజీలకు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలి.
► కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి.
అలుపెరగని పోరాటం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వడంతోపాటు విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పలు దఫాలు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులతో సమావేశమై సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ ఏడాది జనవరి 3న ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర అధికారులతో కమిటీని నియమించాలని పీఎంవోను ప్రధాని ఆదేశించారు. జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో జల్ శక్తి శాఖ, పౌరసరఫరాల శాఖ తదితర శాఖల కార్యదర్శులతో పీఎంవో కమిటీ ఏర్పాటు కాగా అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, జలవనరులు, హోంశాఖ, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు తదితరులతో సీఎంవో కూడా కమిటీని నియమించింది. కమిటీ తొలుత జనవరి 24న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో ఆయా అంశాలను మరోసారి ప్రస్తావించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment