పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ! | The coalition government committed a terrible betrayal to Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ!

Published Sun, Dec 1 2024 4:25 AM | Last Updated on Sun, Dec 1 2024 4:25 AM

The coalition government committed a terrible betrayal to Polavaram

నిజాలను కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీ సర్కారుపైన బాబు సర్కార్‌ నిందలు

పీఐబీ ప్రతిపాదనకు భిన్నంగా ఈ ఏడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తుకే నీటిని నిల్వ చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన

ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసిన కేంద్ర కేబినెట్‌ 

ఇంత ద్రోహం జరుగుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న మీ పార్టీ నేత రామ్మోహన్‌నాయుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?

దీన్నిబట్టి 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేయడానికి కూటమి ప్రభుత్వం అంగీకరించినట్లు కాదా?

సాక్షి, అమరావతి: కనీస నీటి మట్టం (ఎండీడీఎల్‌) 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడం ద్వారా జీవనాడి పోలవ­రానికి తీరని ద్రోహం చేసిన కూటమి సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యా­ధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంఅడ్డగోలుగా బుకాయిస్తోంది. తమకు అలవాటైన రీతిలో అలవోకగా అబ­ద్ధాలను వల్లె వేస్తూ తాము చేసిన ద్రోహాన్ని వైఎస్సార్‌సీపీ సర్కారుపై నెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్ర­య­త్ని­స్తోంది. అడ్డగోలుగా అబద్ధాలను వల్లె వేస్తోంది. వాస్తవాలు ఇవిగో..

ప్రభుత్వం
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది... మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది... అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. పోలవరం ఎత్తును తగ్గించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే!

వాస్తవం
పోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) రూ.55,548.87 కోట్లుగా ఖరారు చేసిందని.. దాన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ(ఆర్‌సీసీ) రూ.47,725.75 కోట్లుగా లెక్కకట్టిందని పీఐబీ నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి(వ్యయ విభాగం) అధ్యక్షతన నిర్వహించిన కమిటీ చర్చల్లో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 

ప్రాజెక్టు రెండో దశలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌­(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం, అనుబంధ పనులు పూర్తి చేయడం... 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పించడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 29న పీఐబీ కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.

ఈ నివేదికపై మార్చి 6న కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తుందని తెలుసుకున్న అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులు ఇస్తే వైఎస్సార్‌సీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం అజెండాలో పోలవరంపై పీఐబీ ఇచ్చిన నివేదికను చేర్చలేదు. పీఐబీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.

45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇవ్వాలనే అంశం ఆర్థిక శాఖ ప్రతిపాదనలో లేదు. దీనిపై నాటి సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభు­త్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. మరి జీవనాడి పోలవరానికి ద్రోహం చేసిందెవరు? కూటమి ప్రభుత్వమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?

ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టును తొలి దశ, రెండో దశ అంటూ దశ­లవారీగా పూర్తి చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వమేనని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని పీపీఏ కుండబద్ధలు కొట్టింది.

వాస్తవం
విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకుంది. ఈ క్రమంలో తాగు­నీటి విభాగం వ్యయం రూ.4,068 కోట్లు, జలవిద్యుదు­త్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు ఇవ్వబోమని.. కేవలం నీటిపారుదల విభాగానికి అదీ 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చేసిన ప్రతి­పాదనకు నాడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు మాత్రమే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది.

అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీతో సమావేశమై.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరా­వాస కల్పనకే రూ.33,168.24 కోట్లు వ్యయం అవుతుందని.. అలాంట­ప్పుడు రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని... తాజా ధరల మేరకు నిధులిచ్చి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. తాగునీటి విభా­గం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని, రెండు ఒకటే­నని.. తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇవ్వాలని కోరారు. 

ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ.. వైఎస్‌ జగన్‌ ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు సూచించారు. దీంతో 2021 జూలై 8న తాగునీటి వ్యయ విభాగాన్ని నీటిపారుదల విభాగంలో కలి­పేందుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ అంగీకరిస్తూ.. ప్రాజె­క్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఏదైనా ఓ ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాది కనీస నీటిమట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత క్రమంగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని 1986 మే 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ.. పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీట­ర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించింది. 

ఇదే అంశాన్ని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ సమాధానంగా చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామంది. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం పీపీఏ చెప్పిన దాన్ని వక్రీకరించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ అడ్డగోలుగా అబద్ధాలు వల్లె వేసింది.

ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. డయాఫ్రం వాల్‌ దెబ్బ­తినడానికి ఆ ప్రభుత్వం పాపమే కారణం. ప్రాజె­క్టును పూర్తి చేయాలన్న ఆలోచనే వైఎస్‌ జగన్‌కు లేదు.

వాస్తవం
టీడీపీ హయాంలో స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌.. ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో పునాది డయాఫ్రం వాల్‌ పనులను  2016 డిసెంబర్‌లో ఒకేసారి చేపట్టారని.. 2017 జూలై నాటికి 1,006 మీట­ర్లు.. 2018 జూన్‌ నాటికి 390.6 మీటర్లు పూర్తి చేశారని.. 2017లో గోదావరి వరదలు డయా­ఫ్రం వాల్‌ మీదుగా ప్రవహించడం వల్ల కోతకు గురైందని.. 2018లో వరద ఉధృతికి మరింత దెబ్బతిందని తేల్చిచెబుతూ అంతర్జాతీయ నిపు­ణుల కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా నిమ్మలా? 

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశా­లను వదిలే­యడం వల్ల.. ఆ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు­చేసు­కోవడానికి చంద్రబాబు ప్రభుత్వ పాపాలు కారణం కాదా? కరోనా ప్రతికూల పరిస్థితు­ల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా వైఎస్‌ జగన్‌ మళ్లించారు.

కోతకు గురైన దిగువ కాఫర్‌ డ్యాంను, ప్రధాన డ్యాం గ్యాప్‌–1లో డయా­ఫ్రం వాల్, గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యాంలను పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ అను­సం­ధానాలను.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేశారు. డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేల్చితే శరవేగంగా ప్రధాన డ్యాంను పూర్తి చేస్తామని కేంద్రాన్ని వైఎస్‌ జగన్‌ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో డయా­ఫ్రం వాల్‌ భవిత­వ్యంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ నిపు­ణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో జీవనాడి పోలవరాన్ని జీవచ్ఛవంగా చేసిందెవరు? జీవనాడిగా మార్చిందెవరు?

ప్రభుత్వం
పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు 2021లోనే జగన్‌ ప్రభుత్వం ప్ర­తిపాదించింది. దీనిపై మేం అప్పట్లో శాసనసభ లోపలా.. బయటా పోరాటం చేశాం.

వాస్తవం
పోలవరం స్పిల్‌ వేను ఇప్పటికే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించామని.. కావాలంటే టేపు తీసుకొని వచ్చి కొలుచుకోవాలని అప్పట్లో శాసనసభలో నాటి సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. ప్రధాన డ్యాంను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించాలనే ప్రతిపాదన లేనే లేదని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో అటు రాజ్యసభ.. ఇటు లోక్‌సభలో నాటి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సహాయ మంత్రులు రాతపూర్వకంగా కుండబద్ధలు కొట్టారు.

రాజ్యసభలో నాటి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ 2023 మార్చి 27న అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నామని కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 2023 డిసెంబరు 7న అప్పటి ఎంపీ కె.రామ్మోహన్‌­నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి బిశ్వేశ్వర్‌ తు­డు స్పష్టం చేశారు. 

దీన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరో­పణల్లో వీసమెత్తు నిజం లేదన్నది వాస్తవం కాదా? అప్పట్లో బాబు చేసిన అసత్య ప్రచారాన్నే ఇప్పుడు కేంద్రం ఆయుధంగా మార్చుకుని నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement