బైపాస్‌లో వెళ్లిన బడ్జెట్‌ రైలు | Railways ignores Andhra Pradeshs demand in Railway Budget | Sakshi
Sakshi News home page

బైపాస్‌లో వెళ్లిన బడ్జెట్‌ రైలు

Published Wed, Feb 5 2025 5:43 AM | Last Updated on Wed, Feb 5 2025 5:50 AM

Railways ignores Andhra Pradeshs demand in Railway Budget

కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి మొండిచేయి

రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్‌ సిగ్నల్‌ 

నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఘోర వైఫల్యం  

పాత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్న కేంద్ర రైల్వే మంత్రి  

ఈ లెక్కన ఏపీకి కొత్త ప్రాజెక్టుల్లేవన్నది సుస్పష్టం 

2025–26 కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు రూ.9,417 కోట్లే  

సాక్షి, అమరావతి: ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్‌.. రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్‌ సిగ్నలే చూపించింది. బడ్జెట్‌ రైలు రాష్ట్రాన్ని బైపాస్‌ చేసుకుంటూ వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో తీసుకువచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాలా శూన్యం. ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్‌డీయేకు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నప్పటికీ, రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు. 2025–26 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆయన చాలా తెలివిగా 2009–10 వార్షిక బడ్జెట్‌ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయ పరిచింది. 

పదేళ్ల క్రితం నాటి బడ్జెట్‌ కేటాయింపులతో పోలుస్తూ ప్రసుత్త బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని మరుగున పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం. రైల్వే బడ్జెట్‌పై ఆ శాఖ పింక్‌ బుక్‌ను విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది.   

పాత పాటే.. కొత్త ప్రాజెక్టులు లేవు 
ప్రస్తుతానికి అయితే పాత ప్రాజెక్టుల పాటనే కొత్తగా పాడారని రైల్వే కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా వెల్లడించనే లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం గమనార్హం. వాస్తవానికి అమృత్‌ భారత్‌ పథకం కింద ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే మంత్రి పునరుద్ఘాటించారు. 

ఇక విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను రూ.1,132.43 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఆ నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా రెండేళ్ల క్రితమే ప్రారంభమై కొనసాగుతున్నాయి. అవేమీ కొత్త ప్రాజెక్టులు కానే కావు. ఇప్పటికే 130 కి.మీ.మేర కవచ్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, మరో 1,700 కి.మీ.మేర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

దీన్నిబట్టి కవచ్‌ ప్రాజెక్టు పరిధిని కొత్తగా ఏమీ విస్తరించే ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లే. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అందుకే ఈ రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఏపీ మీదుగా ఇప్పటికే ఎనిమిది వందే భారత్‌ రైళ్లు నిర్వహిస్తున్నామని చెబుతూ త్వరలో మరిన్ని వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెడతామన్నారు.   

కొత్త డిమాండ్లు పూర్తిగా బేఖాతరు 
దీర్ఘకాలికంగా ఉన్న ప్రాజెక్టులకే నిధుల కేటాయింపున­కు చేతులు రాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త రై­ల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూ­ర్‌ డెడి­కే­టెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ ఏర్పాటు, విజయవాడ–గూడూరు మ­ద్య నాలుగో లైన్‌ నిర్మాణం, కడప–బెంగళూరు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.  

సీఎం చంద్రబాబు ఏం సాధించినట్లు?
» కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్‌డీయే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25 బడ్జెట్‌లో రైల్వేలో రాష్ట్రానికి కేవలం రూ.9,138 కోట్లు కేటాయించారు. దాంతో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే ఆ నిధులు సరిపోయాయి. 

పోనీ.. 2025–26 బడ్జెట్‌లో అయినా భారీగా నిధులు సాధిస్తారేమోనని ఆశించిన వారికి అడియాశే మిగిలింది. గత బడ్జెట్‌ కంటే కేవలం రూ.279 కోట్లే అధికంగా రాబట్టగలిగారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే సరిపోతాయి.   
» కాకినాడ – పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగ్గరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించనే లేదు. 
» అమరావతి రైల్వే లైన్‌ గురించి కేంద్ర ప్రభు­త్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణానికి ఆమోదించినట్లు గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించినా, నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వ లేదు. 
» అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ) రైల్వేలైన్‌పై కూడా కేంద్రం ముఖం చాటేసింది. 
» కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్‌–అంకోలా రైల్వే లైన్ల గురించి పట్టించుకోలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement