central railway budget
-
కేటాయింపులేవీ.. మహాప్రభు..
అనుకున్నదే అయింది. కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండిచెయ్యి లభించింది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలున్నా ఈ సారీ కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీలు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. సమస్యలపై వారు కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి. జిల్లాకు కొత్తగా ఒక్క రైలు కూడా మంజూరు కాలేదు. కొత్త రైల్వే లైన్.. విస్తరణ ఊసేలేదు. పాత ప్రాజెక్టులకు నిధులూ రాలేదు. ఏళ్ల నుంచి ఉన్న ప్రజల ‘రైళ్ల హాల్టింగ్’.. రైళ్ల పొడిగింపు.. పునరుద్ధరణ డిమాండ్లు ఈ సారీ నెరవేరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడడం.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలో రావడంతో పాలకులు జిల్లాపై కరుణ చూపుతారని అనుకున్న జిల్లావాసులకు మళ్లీ నిరాశే మిగిలింది. మమతాబెనర్జీ, బన్సల్, మల్లిఖార్జున ఖర్గేల మాదిరిగానే సురేశ్ ప్రభు తన బడ్జెట్లో జిల్లాపై వివక్ష చూపారు. గురువారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి రైల్వే బడ్జెట్ రూపొందించారు. మరుగుదొడ్ల ఆధునికీకరణ.. పరిశుభ్రత.. భద్రత.. మెరుగైన సేవ లే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రయాణికులపై ఈసారి మాత్రం చార్జీల భారం మోపలేదు. - సాక్షి, మంచిర్యాల - రైల్వే బడ్జెట్లో జిల్లాకు రిక్తహస్తం - ఎంపీల ప్రతిపాదనలు బుట్టదాఖలు - ‘రైళ్ల హాల్టింగ్స్’ చేయించుకోలేకపోయిన ఎంపీలు - కొత్త ట్రాక్‌లు లేవు.. కొత్త రైళ్లూ లేవు.. - పాత ప్రాజెక్టులకు నిధులు స్వల్పం - ప్రయాణికుల భద్రత .. సేవలకు పెద్దపీట సాక్షి, మంచిర్యాల : ‘తూర్పు’ ప్రాంతంలో కొనసాగుతున్న మూడో రైలు మార్గం నిర్మాణ పనులకు బడ్జెట్లో రూ.83 కోట్లు కేటాయించారు. పెద్దంపేట-మంచిర్యాల పనుల కోసం రూ.58 కోట్లు, రాఘవపురం-మందమర్రి పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. మంచిర్యాల-రవీంద్రఖని, బెల్లంపల్లి-రేచిని రోడ్డు, సిర్పూర్ కాగజ్‌నగర్ పరిధిలోని 77వ లెవల్ క్రాసింగ్ వద్ద మధ్య ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్-ముథ్కేడ్ వరకు (160కి.మీ) గేజ్ మార్పిడి కోసం రూ.కోటి కేటాయించారు. రూ.2,020 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఖాజీపేట-బల్లార్షా (202 కి.మీ)వరకు మూడో లైన్ నిర్మాణ పనులకు బడ్జెట్లో రూ.46 కోట్లు కేటాయించారు. వెక్కిరిస్తున్న ప్రాజెక్టులు.. 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వే లైను నిర్మాణానికి నిధులు మంజూరై.. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఈ బడ్జెట్లో కనీసం మార్గం ప్రస్తావన కూడా రాలేదు. దీంతో పశ్చిమ జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు సుదూర తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు 2013లో మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గాన్ని ప్రకటించారు. ఈ సారి కేంద్రం బడ్జెట్లో ఈ మార్గాన్ని విస్మరించింది. 2012 రైల్వే బడ్జెట్లో మైసూర్-హౌరా వయా గోండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును మంజూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం కనికరిస్తుందనుకుంటే సురేశ్ ప్రభూ అసలు ఈ మార్గం ప్రస్తావనే తేలేదు. 2010-11 రైల్వే బడ్జెట్లో మంచిర్యాల రైల్వేస్టేషన్లో డిస్పెన్సరీ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆదిలాబాద్, బాసర స్టేషన్లలో జనరల్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పుడూ చోటు దక్కలేదు. జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గడ్చందూర్కు రైల్వే మార్గం కలగానే మిగిలిపోయింది. సికింద్రాబాద్-బాసర డబుల్‌లైన్ నిరా్మాణం ఊసేలేదు. మంచిర్యాలలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం.. ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు, రేచినిరోడ్డు, బాసర రెల్వేస్టేషనో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ బడ్జెట్లో వాటి నిర్మాణ ఊసేలేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రయాణికుల భద్రతకు భరోసా.. కేంద్ర మంత్రి ప్రభు.. తన బడ్జెట్లో ప్రయాణికుల భద్రతకు భరోసా ఇచ్చారు. మెరుగైన సేవలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రమాదాలు జరగకుండా.. కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఐఐటీ కాన్పూర్, ఇస్రోల సహాయంతో హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా భద్రతా కోసం 182 టోల్‌ఫ్రీ నెంబర్, మార్చి ఒకటో తేదీ నుంచి ప్రయాణికుల కోసం 138 హెల్ప్‌లైన్ ఏర్పాటు, రైళ్ల రాకపోకలు.. సమయ పాలన సమాచారం తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ వ్యవస్థ, 120 రోజుల ముందే టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే అవకాశం, ప్రధాన స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు, తక్కువ ధరకే ప్రయణికులకు తాగునీరు, ప్రయాణికులు రద్దీగా ఉన్న చోట అదనపు బోగీలు.. మహిళా బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అంధుల సౌకర్యార్థం బోగీల ఏర్పాటు, డెబిట్ కార్డుతో సేవలు పొందే వసతి, కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ‘స్వచ్ఛ రైలు’ అమలుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్టీలు, బొగ్గు రవాణాకు కొత్త లైన్ల నిర్మాణం చేపడుతామన్న ప్రభు అందులో జిల్లాకు ఒక్క లైను కూడా మంజూరు చేయలేదు. దేశవ్యాప్తంగా 152 రైల్వే స్టేషన్లు ఆధునికీకరిస్తామని చెప్పిన మంత్రి జిల్లాలో ఒక్క స్టేషన్నూ ఆ జాబితాలో చేర్చలేదు. -
నిధులు ప్లీజ్
రాష్ట్రంలో సాగుతున్న, పెండింగ్‌లో ఉన్న రైల్వే పథకాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇదివరకు ప్రకటించిన రైల్వే పథకాల తీరుతెన్నులు, ప్రకటనకే పరిమితమైన వివరాలను ఆయన ఏకరువుపెడుతూ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అరుునా కేటాయింపులు పెరగాలని విన్నవించారు. ⇒ రైల్వే మంత్రికి సీఎం లేఖాస్త్రం ⇒ రైల్వే పథకాల ఏకరువు ⇒ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి సాక్షి, చెన్నై: ప్రతి ఏటా కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో ఒక పథకాన్ని, రెండుమూడు రైళ్లను ప్రకటిస్తోంది. అయితే అవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రకటించి న పథకాలకు నిధులు మంజూరు కాలేదు. కొత్త పథకాలకు నిధుల ఊసేలేదు. మరెన్నో రైల్వే పథకాలు ప్రకటించినా, నిధు ల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.ఈ సారైనా తమిళనాడు మీద కరుణ చూపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న ఆశాభావంతో ముందుస్తుగా రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభాకర్ప్రభుకు రాష్ర్టంలోని రైల్వే పథకాల తీరుతెన్నుల్ని వివరించేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. బడ్జెట్లో తమకు ప్రాధాన్యత కల్పించే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు, ఇక్కడ నత్తనడకన సాగుతున్న పథకాలను మంత్రి దృష్టికి శుక్రవారం లేఖాస్త్రంతో తీసుకెళ్తూ నిధులు..ప్లీజ్ అని అభ్యర్థించే పనిలో పడ్డారు. నిధులివ్వండి: తమ అధినేత్రి, అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న ప్రభుత్వ విజన్ -2023 గురించి తన లేఖలో కేంద్ర రైల్వే మంత్రికి సురేష్‌ప్రభాకర్ ప్రభుకు సీఎం పన్నీరు సెల్వం వివరించారు. పదిహేను లక్షల కోట్లతో సాగుతున్న విజన్ కళసాకారంలో రైల్వే పాత్ర కూడా కీలకమన్నారు. తమిళనాడులో లక్షా 88 వేల 400 కోట్ల మేరకు రైల్వే పథకాలకు నిధులు అవశ్యంగా వివరిస్తూ గతంలో పీఎం నరేంద్ర మోదీకి తమ అమ్మ రాసిన లేఖను గుర్తుచేశారు. ప్రధానంగా రానున్న బడ్జెట్లో పది రైల్వే పథకాలకు ముందస్తుగా ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ‘చెన్నై - కన్యాకుమారి మధ్య రెండో రైల్వే మార్గం పనులు, శ్రీ పెరంబదూరు - గిండి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై - తూత్తుకుడి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై-మదురై -కన్యాకుమారి మధ్య, మదురై-కోయంబత్తూరు, కోయంబత్తూ రు - చెన్నై, చెన్నై -బెంగళూరుల మధ్య హై స్పీడ్ రైలు సేవలు, చెన్నై-బెంగళూ రు మధ్య రైల్వే కారిడార్, ఆవడి - గూడువాంజేరి మధ్య రైల్వే మార్గం, ఆవడి - ఎన్నూర్ హార్బర్‌కు రైల్వే మార్గం’ ఏర్పాటు గురించి విశదీకరించారు. రైల్వే పథకాలు ⇒ గతంలో ప్రకటించిన పథకాలను వివరి స్తూ, నిధుల్ని సంమృద్ధిగా కేటాయించాల ని విజ్ఞప్తి చేశారు. ఆ పథకాలలో కొన్ని... ⇒ మొరాపూర్ -ధర్మపురి మధ్య కొత్త రైల్వే మార్గం ⇒ చెన్నై నుంచి విల్లివాక్కం మధ్య ఐదు, ఆరో లైన్లు , విల్లివాక్కం- కాట్పాడి మధ్య కొత్త రైల్వే మార్గం ⇒ చిదంబరం నుంచి అరియలూరు మీదుగా ఆత్తూరుకు కొత్త మార్గం ⇒ తిరువనంత పురం నుంచి కన్యాకుమారి, జోలార్ పేట నుంచి కాట్పాడి - అరక్కోణం మధ్య రెండో మార్గం పనులు, బోడి నాయకనూరు కొట్టాయం వరకు పనుల పొడిగింపుల గురించి వివరించారు. ⇒ రేణిగుంట-అరక్కోణం రెండో మార్గం, అత్తి పట్టు - గుమ్మిడిపూండి మధ్య మూడు, నాలుగో లైన్లు, జోళార్ పేట నుంచి కృష్ణగిరి మీదుగా హోసూరుకు, మైలాడుతురై - తరంగం బాడి మీదుగా తిరునల్లారు - కారైకాల్‌కు, రామనాధపురం - కన్యాకుమారి మీదుగా తూత్తుకుడి - తిరుచెందురుకు, కారైక్కుడి నుంచి తూత్తుకుడికి, కారైక్కాల్ - శీర్గాలి, సేలం- అరియలూరుల మధ్య కొత్త లైన్లకు నిధుల్ని అభ్యర్థించారు. అలాగే, ఇరుగుర్ -పొండనూర్, తిరువనంత పురం - నాగర్ కోవిల్ల మధ్య రెండు మార్గం. తదితర పనుల్ని వివరిస్తూ ఈ బడ్జెట్లో నిధుల్ని కేటాయించి, పనులు ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
ఆశ.. నిరాశ..
సాక్షి, మంచిర్యాల : కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. కొత్తలైన్ల ప్రస్తావన, రైళ్ల నిలుపుదల విషయంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించినా.. వినతి పత్రాలు సమర్పించినా కేంద్రం కనికరించడం లేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, రైళ్ల విస్తరణ, రైల్వే లైన్ల నిర్మాణం, ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలతోపాటు కనీస వసతులు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పశ్చిమ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బాసర, తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూర్‌లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే నెలకు రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేటాయిస్తోన్న నిధులు స్వల్పమే. రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్బోర్లు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రతీసారి జిల్లాకు సంబంధించిన ఎంపీలు ప్రతిపాదనలు పంపించడం.. అవి బుట్టదాఖలు కావడం మామూలైంది. గత ఫిబ్రవరి 26న రైల్వే కేంద్ర మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ జిల్లా వాసులను నిరాశకు గురి చేసింది. సూపర్ ఫాస్ట్, టికెట్ రద్దు చార్జీలు, తాత్కాల్ టికెట్ ధరలు పెంచి ప్రయాణీకులపై అదనంగా భారం మోపింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనెల 12న రైల్వేబడ్జెట్‌ను రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందో చూడాలి. జిల్లావాసుల డిమాండ్లు.. తూర్పు జిల్లా ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల రైల్వేస్టేషన్లో కేరళ, సంఘమిత్ర, స్వర్ణజయంతి, హిమసాగర్, రామేశ్వరం, నవయుగ ఎక్స్‌ప్రెస్‌ల నిలుపుదల, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు బోగీలు, ఏసీ బోగీల ఏర్పాటు కాలేదు. చెన్నై - జోద్పూర్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనూరు రాజస్థాన్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-గాంధీనగర్ ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలి. మంచిర్యాల-జద్గల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఉంది. షిరిడి నుంచి బల్లార్ష వరకు నడుస్తున్న రైలును బెల్లంపల్లి వరకు పొడిగించాలి. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడిపించాలని, హైదరాబాద్-న్యూఢిల్లీ దూరంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నవజీవన్, గ్రాండ్ ట్రక్ రైళ్లను స్టేషన్లో నిలుపుదల చేయాలనే డిమాండ్ ఉంది. బెల్లంపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ఏర్పాటు చేస్తానని ఎంపీ వివేక్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని ఏకైక మందమర్రి రైల్వేస్టేషన్లో తెలంగాణ, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని రైల్వే జీఎంకు వినతి పత్రాలిచ్చినా ఫలితం లేదు. రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వయా వరంగల్ మీదుగా విజయవాడ వరకు వెళ్లేందుకు జనతా ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. గత ఎన్డీఏ, ప్రస్తుత యూపీఏ హయాంలో అఖిలపక్ష నేతలు ఎన్నిమార్లు వినతి పత్రాలిచ్చినా ప్రయోజనం లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏకైక రెబ్బెన రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలన్న ప్రయాణికుల వినతులు బుట్టదాఖలయ్యాయి. పదేళ్ల క్రితం కాగజ్‌నగర్ వరకు ఉన్న బుషావత్(మహారాష్ట్ర) ప్యాసింజర్‌ను రద్దు చేసి బల్లార్షా వరకు పరిమితం చేశారు. దీంతో కాగజ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్యాసింజర్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. డెహ్రడూన్-చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలనే డిమాండ్ ఉంది. రైలు మార్గం ద్వారా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వె ళ్లేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క రైలు (కృష్ణా ఎక్స్‌ప్రెస్) ఉంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా బాసర, నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తొంది. తొమ్మిదిన్నర గంటలు రైళ్లో ప్రయాణించాల్సి వస్తుంది. బస్సులో వెళ్లినా అంతే సమయం పడుతుంది. నాందేడ్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదిలాబాద్ మీదుగా నడిపించాలన్న డిమాండ్ ఉంది. దక్షిణ భార త దేశంలోనే పేరొందిన బాసరలోని చదువుల తల్లి పుణ్యక్షేత్రానికి రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో హైదరాబాద్ నుంచి బాసర వరకు జ్ఞాన సరస్వతీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించారు. ప్రస్తుతం రద్దయింది. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది. బాసర స్టేషన్లో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ టు బాసర సింగిల్ లైను ఉండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఉంది. కలగానే బ్రిడ్జీల నిర్మాణం జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా సుమారు 30 రైళ్లు వెళ్తుంటాయి. ప్రతిసారి స్టేషన్ సమీపంలోనే ఉన్న హమాలీవాడ ప్రాంతంలోని గేటు వేయడంతో వాహనాలు బారులు తీరుతాయి. గేటువేసి ఉన్నా కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎంసీసీ ఫ్యాక్టరీ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 2010లోనే రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. నిర్మాణానికి రూ.17 కోట్లు అవసరముంటాయని అంచనా వేశారు. అందులో సగం నిధులు రైల్వే శాఖ, సగం డబ్బులు స్థానిక మున్సిపాలిటీ భరించాలని సూచించింది. అన్ని నిధులు ఇవ్వలేమని ఆదిలాబాద్ పురపాలక సంఘం అధికారులు చేతులెత్తేశారు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2006లోనే ప్రతిపాదనలు పంపారురూ. రూ. 17 కోట్లు మంజూరయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న రైల్వే కాంట్రాక్టర్ 80 శాతం పనులు పూర్తి చే శాడు. ఆ తర్వాత బిల్లులు సకాలంలో రావడం లేదంటూ పనులు నిలిపేశాడు. ప్రతిపాదనలకే పరిమితం గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా ఇంత వరకు కనీసం సర్వే కూడా ప్రారంభం కాలేదు. 2010-11 రైల్వే బడ్జెట్లో మంచిర్యాల రైల్వేస్టేషన్లో డిస్పెన్సరీని ప్రతిపాదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డిల మీదుగా హైదరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరయ్యాయి. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఇంత వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు.