ఆశ.. నిరాశ.. | not support to district in central railway budget | Sakshi
Sakshi News home page

ఆశ.. నిరాశ..

Published Mon, Feb 10 2014 2:46 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

not support to district in central railway budget

సాక్షి, మంచిర్యాల : కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. కొత్తలైన్ల ప్రస్తావన, రైళ్ల నిలుపుదల విషయంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించినా.. వినతి పత్రాలు సమర్పించినా కేంద్రం కనికరించడం లేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, రైళ్ల విస్తరణ, రైల్వే లైన్ల నిర్మాణం, ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలతోపాటు కనీస వసతులు కల్పించడంలో కేంద్రం విఫలమైంది.

పశ్చిమ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బాసర, తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూర్‌లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే నెలకు రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేటాయిస్తోన్న నిధులు స్వల్పమే. రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్‌బోర్లు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

 ప్రతీసారి జిల్లాకు సంబంధించిన ఎంపీలు ప్రతిపాదనలు పంపించడం.. అవి బుట్టదాఖలు కావడం మామూలైంది. గత ఫిబ్రవరి 26న రైల్వే కేంద్ర మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ జిల్లా వాసులను నిరాశకు గురి చేసింది. సూపర్ ఫాస్ట్, టికెట్ రద్దు చార్జీలు, తాత్కాల్ టికెట్ ధరలు పెంచి ప్రయాణీకులపై అదనంగా భారం మోపింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనెల 12న రైల్వేబడ్జెట్‌ను రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందో చూడాలి.

 జిల్లావాసుల డిమాండ్లు..
     తూర్పు జిల్లా ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో కేరళ, సంఘమిత్ర, స్వర్ణజయంతి, హిమసాగర్, రామేశ్వరం, నవయుగ ఎక్స్‌ప్రెస్‌ల నిలుపుదల, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు బోగీలు, ఏసీ బోగీల ఏర్పాటు కాలేదు. చెన్నై - జోద్‌పూర్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనూరు రాజస్థాన్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-గాంధీనగర్ ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో నిలుపుదల చేయాలి. మంచిర్యాల-జద్గల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఉంది.

     షిరిడి నుంచి బల్లార్ష వరకు నడుస్తున్న రైలును బెల్లంపల్లి వరకు పొడిగించాలి. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడిపించాలని, హైదరాబాద్-న్యూఢిల్లీ దూరంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నవజీవన్, గ్రాండ్ ట్రక్ రైళ్లను స్టేషన్‌లో నిలుపుదల చేయాలనే డిమాండ్ ఉంది. బెల్లంపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ఏర్పాటు చేస్తానని ఎంపీ వివేక్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.

     చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని ఏకైక మందమర్రి రైల్వేస్టేషన్‌లో తెలంగాణ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని రైల్వే జీఎంకు వినతి పత్రాలిచ్చినా ఫలితం లేదు. రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వయా వరంగల్ మీదుగా విజయవాడ వరకు వెళ్లేందుకు జనతా ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. గత ఎన్డీఏ, ప్రస్తుత యూపీఏ హయాంలో అఖిలపక్ష నేతలు ఎన్నిమార్లు వినతి పత్రాలిచ్చినా ప్రయోజనం లేదు.

     ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏకైక రెబ్బెన రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలన్న ప్రయాణికుల వినతులు బుట్టదాఖలయ్యాయి.

 పదేళ్ల క్రితం కాగజ్‌నగర్ వరకు ఉన్న బుషావత్(మహారాష్ట్ర) ప్యాసింజర్‌ను రద్దు చేసి బల్లార్షా వరకు పరిమితం చేశారు. దీంతో కాగజ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్యాసింజర్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. డెహ్రడూన్-చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలనే డిమాండ్ ఉంది.

 రైలు మార్గం ద్వారా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వె ళ్లేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క రైలు (కృష్ణా ఎక్స్‌ప్రెస్) ఉంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా బాసర, నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తొంది. తొమ్మిదిన్నర గంటలు రైళ్లో ప్రయాణించాల్సి వస్తుంది. బస్సులో వెళ్లినా అంతే సమయం పడుతుంది. నాందేడ్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదిలాబాద్ మీదుగా నడిపించాలన్న డిమాండ్ ఉంది.

 దక్షిణ భార త దేశంలోనే పేరొందిన బాసరలోని చదువుల తల్లి పుణ్యక్షేత్రానికి రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో హైదరాబాద్ నుంచి బాసర వరకు జ్ఞాన సరస్వతీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించారు. ప్రస్తుతం రద్దయింది. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది. బాసర స్టేషన్లో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ టు బాసర సింగిల్ లైను ఉండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఉంది.

 కలగానే బ్రిడ్జీల నిర్మాణం
 జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా సుమారు 30 రైళ్లు వెళ్తుంటాయి. ప్రతిసారి స్టేషన్ సమీపంలోనే ఉన్న హమాలీవాడ ప్రాంతంలోని గేటు వేయడంతో వాహనాలు బారులు తీరుతాయి. గేటువేసి ఉన్నా కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎంసీసీ ఫ్యాక్టరీ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.

 ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 2010లోనే రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. నిర్మాణానికి రూ.17 కోట్లు అవసరముంటాయని అంచనా వేశారు. అందులో సగం నిధులు రైల్వే శాఖ, సగం డబ్బులు స్థానిక మున్సిపాలిటీ భరించాలని సూచించింది. అన్ని నిధులు ఇవ్వలేమని ఆదిలాబాద్ పురపాలక సంఘం అధికారులు చేతులెత్తేశారు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది.

 కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2006లోనే ప్రతిపాదనలు పంపారురూ. రూ. 17 కోట్లు మంజూరయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న రైల్వే కాంట్రాక్టర్ 80 శాతం పనులు పూర్తి చే శాడు. ఆ తర్వాత బిల్లులు సకాలంలో రావడం లేదంటూ పనులు నిలిపేశాడు.

 ప్రతిపాదనలకే పరిమితం
గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా ఇంత వరకు కనీసం సర్వే కూడా ప్రారంభం కాలేదు.

 2010-11 రైల్వే బడ్జెట్‌లో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో డిస్పెన్సరీని ప్రతిపాదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు.
 ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డిల మీదుగా హైదరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరయ్యాయి. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఇంత వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement