బాసర ఆలయ గోపురంపై పిడుగు
- పాక్షికంగా ధ్వంసమైన గోపురం
బాసర(ఆదిలాబాద్): బాసరలోని సరస్వతీ ఆలయ గోపురంపై పిడుగు పడింది. దీంతో గోపురం పాక్షికంగా ధ్వంసమైంది. సిమెంట్ పెచ్చులు ఊడి పడ్డాయి. బుధవారం సాయంత్రం వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా తూర్పు భాగాన ఉన్న రాజగోపురంపై భారీ శబ్దంతో పిడుగు పడింది. సమీపంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఏఈవో అశోక్, ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ పిడుగు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణ మధ్య స్థానాచార్యుడు, ప్రధానాచార్యుడు ఆలయంలో శాంతిపూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి జలంతో తూర్పు రాజగోపురంపై నీళ్లు చల్లారు.
ప్రకృతి వైపరీత్యం: సంజీవ్
బాసర ఆలయంలో పిడుగు పడడం ప్రకృతి వైపరీత్యం. ఇలాంటి ఘటనలు సాధారణమే. పిడుగు పడ్డ తర్వాత అమ్మవారి ఆలయంలో శాంతిపూజ నిర్వహించాం.
ఆందోళన అక్కర్లేదు: ప్రవీణ్ పాఠక్
రాజగోపురంపై పడిన పిడుగుపాటుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనలు సహజమే. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.