సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ పది మినహా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వివరించింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు
వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతాయని వెల్లడించింది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలంలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 18.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
2.97 సెంటీమీటర్ల సగటు వర్షపాతం
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.47 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 5.76, వరంగల్ జిల్లాలో 5.08, కరీంనగర్ జిల్లాలో 4.42, మంచిర్యాల జిల్లాలో 4.0, జగిత్యాల జిల్లాలో 4.0 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment