thunder
-
ఇక పిడుగుల మోతతో వానలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం (అగ్రికల్చర్): రాష్ట్రంలో పిడుగులు మోత మోగించనున్నాయి. రానున్న ఐదు రోజులు ఇవి దడ పుట్టించనున్నాయి. రెండు మూడు మినహా మిగిలిన జిల్లాల్లో పిడుగులు ప్రభావం చూపనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ. మధ్య ఉన్న గాలుల కోత, షీర్ జోన్ కొనసాగుతున్నాయి. ఫలితంగా బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో వానలు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయంది. ‘అనంత’లో వర్షాలుజిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఉరవకొండలో 29.6 మి.మీ, పామిడిలో 20.4 మి.మీ, వజ్రకరూరులో 20.2 మి.మీ, గార్లదిన్నెలో 20 మి.మీ. చొప్పున వర్షపాతాలు నమోదయ్యాయి. పెద్దవడుగూరు, శింగనమల, గుంతకల్లు, యాడికి, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, నార్పల తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి
జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి. కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు. పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్‌ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది. -
హైదరాబాద్‌లో కుండపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సోమవారం సాయంత్రం జడివాన వణికించింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.2, చార్మి నార్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో నాలుగైదు సెంటీమీటర్ల వరకు పడింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. నాలాలు, మ్యాన్‌హోల్‌లు పొంగి పొర్లాయి. దీంతో నగరమంతా ట్రాఫిక్ స్తంభించి పోయింది. వాహనదారులు గంటల కొద్దీ అవస్థ పడ్డారు. అబిడ్స్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు ఎగిరిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. లంగర్‌హౌజ్ ప్రాంతంలో ఒక మసీదుపై పిడుగు పడటంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. పైన ఉన్న గుమ్మం కింద పడిపోయింది. వర్షంతో అప్రమత్త మైన అధికార యంత్రాంగం.. ప్రజలెవరూ అవస రమైతే తప్ప బయటికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. నేడూ భారీ వర్షాలు.. అతిభారీ వర్షాలు: మహబూబాబాద్, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ అధికంగా భారీ వర్షాలు, ములుగు, భద్రాద్రికొత్తగూడెం,నల్లగొండ,ఖమ్మం,సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురవచ్చు. మోస్తరు నుంచి భారీ వర్షాలు:జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవచ్చు. -
ఆకాశాన్ని చీల్చి, రోడ్డును తాకి, అగ్నిగోళంలా మారి.. వణికిస్తున్న పిడుగు వీడియో!
సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు ప్రకృతి విపత్తు ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక రోడ్డుపై కారు వెళుతూ ఉంటుంది. ఇంతలో ఆకాశాన్ని చీల్చుకుంటూ, ఒక పిడుగు భూమిని తాకుతుంది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన దృశ్యం భీతావహంగా ఉంది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీవర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ పలు ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు పలు అవస్థలకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పిడుగుల ప్రమాదం కూడా పొంచివుంటోంది. పిడుగులు పడి పలువురు మృతిచెందుతున్న సంఘటనలు కూడా విరివిగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. కారుపై అదారుసార్లు పిడుగు పడినట్లు కనిపిస్తుంది. ఈ పిడుగు ఎంతో శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. దీనిని చూసినవారు భయానికి లోనవుతున్నారు. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ భయంకరమైన పిడుగుపాటు వీడియోను సోషల్‌మీడియా సైట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ భయానక వీడియో @explosionvidz పేరున గల ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ అయ్యింది. దీనికి క్యాప్షన్‌గా స్లో మో ఫుటేజ్ ఆఫ్ ఏ లైటింగ్ స్ట్రైక్ అని రాశారు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 39.7 వేల వ్యూస్ వచ్చాయి. కాగా ఈ పిడుగుపాటు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. Slow mo footage of a lightning strike⚡️ pic.twitter.com/rT1Bu3IoB9 — Explosion Videos (@explosionvidz) July 16, 2023 ఇది కూడా చదవండి: సిరులు కురిపించే బొద్దింకల పెంపకం..హాట్‌హాట్‌గా అమ్మడవుతున్న కాక్రోచ్ స్నాక్స్! -
మళ్లీ అకాల వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన
వరంగల్/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్‌లో అతలాకుతలం.. శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఓ జిన్నింగ్ మిల్లు రేకులు లేచిపోయాయి. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో.. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. -
Telangana: మరో రెండు రోజులు వడగళ్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ పది మినహా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతాయని వెల్లడించింది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలంలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 18.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2.97 సెంటీమీటర్ల సగటు వర్షపాతం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.47 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 5.76, వరంగల్ జిల్లాలో 5.08, కరీంనగర్ జిల్లాలో 4.42, మంచిర్యాల జిల్లాలో 4.0, జగిత్యాల జిల్లాలో 4.0 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న ద్రోణి– వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/పెళ్లకూరు(తిరుపతి జిల్లా)/ ఒంగోలు: తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ఎవరూ చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. కాగా, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పునబాక గ్రామ సమీపంలోని ఓ పొలంలో నాట్లు వేస్తున్న కృష్ణా జిల్లా రామాపురం గ్రామానికి చెందిన జల్ల వీరలంకయ్య(49) పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. అలాగే అదే మండలంలో రెండు ఆవులు, ఓ దూడ మృతి చెందాయి. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం మిరియంపల్లి గ్రామానికి చెందిన రైతు రావెళ్ల పుల్లయ్య (73) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండంలో పిడుగుపడి 15 గొర్రెలు చనిపోయాయి. -
Telangana: రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ విద ర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 37.0 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
వదలని వానలు.. మరో మూడురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీగాను వర్షాలు పడుతున్నాయి. అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8 సెంటీమీటర్లు, యలమంచిలిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీమీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
భారీ వర్షాలు.. పిడుగులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్ :ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 7.5, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం అల్లూరులో 7 సెం.మీ., సీతంపేట (పార్వతీపురం మన్యం) 6.8, అనకాపల్లి జిల్లా గోలుగొండలో 6.5, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో 5.8, ఏలూరు జిల్లా పోలవరం మండలం లక్ష్మీనారాయణదేవీపేటలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పూర్వపు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షాల కారణంగా పలుచోట్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలులు సంభవించాయి. ఈ స్థాయిలో వడగళ్ల వాన కురవడం ఇక్కడ ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వర్షంవల్ల ఉమ్మడి తూర్పుగోదావరిలోని మెట్ట, డెల్టా రైతులకు మేలు జరిగిందని భావిస్తున్నారు. గోదావరి డెల్టాలో రబీ సాగుకు శివారు, మెరక ప్రాంతాలకు నీటి సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్న సమయంలో భారీ వర్షం కురవడం వారికి ఊరటనిచ్చింది. ముఖ్యంగా కోనసీమజిల్లా ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో శివారు రైతులకు వర్షం మేలుచేసింది. కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్ వంటి ఉద్యాన పంటల రైతులు కూడా వర్షంవల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో మామిడి, జీడి మామిడి రైతులకు ఈ వర్షం మేలు చేస్తుంది. మామిడి పిందె గట్టిపడి తమకు ప్రయోజనం కలుగుతుందని మెట్ట ప్రాంతం రైతులు చెబుతున్నారు. వాతావరణం మారే వరకు మొక్కజొన్న కోతలు కోయవద్దని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో శనివారం వీచిన ఈదురు గాలులకు ఒక ఇంటిపై రావిచెట్టు పడి సంధ్య (37) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో రెండు రోజులు వర్షాలు రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతోపాటుగా పిడుగులు పడే అవకాశమున్న నేపథ్యంలో ఉరుములతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు–గొర్రె కాపరులు చెట్లకింద ఉండకూడదని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని భారత వాతావరణ విభాగం అధికారులు కూడా శనివారం రాత్రి నివేదికలో సూచించారు. -
AP: ఆ జిల్లాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. -
మృత్యు పిడుగులు
► పిడుగు పాటుతో నలుగురు మృతి ► చిత్రదుర్గం జిల్లాలో ఘోరాలు సాక్షి, బళ్లారి : చిత్రదుర్గం జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు. చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వాణివిలాస సాగర(మారికణివె) పోటు జలాల్లో ఈత కొట్టేందుకు కురుబరహళ్లి గ్రామానికి చెందిన 9 మంది వెళ్లగా పిడుగు పడటంతో లెక్చరర్ మాలేశ్ నాయక్(30), ఉపాధ్యాయుడు ఛాయాపతి, డ్రైవర్ హరీష్‌లు మృతి చెందారు. దీంతో కురుబరహళ్లి గ్రామం విషాదంలో మునిగి పోయింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో మొళకాల్మూరు తాలూకా బండ్రావి సమీపంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన జంబక్క(35) అనే మహిళ మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మరణించింది. ఈ ఘటనపై మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
మద్దికెర/కొలిమిగుండ్ల(పత్తికొండ, బనగానపల్లె): పిడుగుపాటుతో కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఆదివారం.. ఇద్దరు యువకులు మృతి చెందారు.మద్దికెర గ్రామానికి చెందిన విష్ణు (18).. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృత్యువాత పడ్డాడు. అలాగే కొలిమిగుండ్లకు చెందిన చంద్రశేఖర్(20)..దుస్తులు ఉతికేందుకు వెళ్లి పిడుగుపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతనికి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువతితో జూన్ 4వతేదీన వివాహం జరగాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఊహించని రీతిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మహానందిలో పిడుగుపాటు
- ముగ్గురికి గాయాలు - పార్వతీపురం తాటిచెట్టుపై మంటలు మహానంది: శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన వారి వివాహ వేడుకల సందర్భంగా నాగనంది సదనం వద్ద వంటలు చేస్తున్న సమయంలో పిడుగుపాటు సంభవించడంతో గంగవరానికి చెందిన పడకండ్ల బ్రహ్మం, కురిచేడుకు చెందిన రామాంజి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగుపాటు కారణంగా అక్కడే ఉన్న చెట్టుపై మంటలు చెలరేగాయి. -
పెనుగాలి బీభత్సం
- ఆలూరు నియోజకవర్గంలో గాలివాన - ఆస్పరి ప్రాంతంలో అల్లకల్లోలం - కూలిపోయిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు - ఎగిరిపోయిన గుడిసెల పైకప్పులు - చీకట్లో మగ్గిపోయిన గ్రామాలు ఆస్పరి: మండల పరిధిలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఆయా గ్రామాల వారు తీవ్ర అవస్థలు పడ్డారు. భయంకరమైన ఉరుములు, మెరుపులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడికక్కడ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అందకారం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం ఆస్పరిలో 6 , నగరూరులో 12, బనవనూరులో 17 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ట్రాన్స్‌కోకు రూ. 70 వేల నష్టం వాటిల్లింది. నగరూరు, బనవనూరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల వారు అందకారంలో మగ్గిపోయారు. బనవరూరులో సుంకన్న, మచ్చన్న గారి సుంకన్న, ఖాజా, మరో 10 మంది గుడిసెలు, వారపాకులకు వేసిన రేకులు గాలికి ఎగిరిపోయాయి. బనవనూరులో లక్ష్మన్న బోరు కింద ఎకరన్నరలో సాగు చేసిన వరి పైరు గాలి కారణంగా నేలవాలింది. చేతికొచ్చే దశలో పంట ఇలా నేలపాలవడంతో లక్ష్మన్న అవేదన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో చాలా చెట్లు నెలకొరిగాయి. ఆదివారం కూడా పెనుగాలు కొనసాగాయి. ఉరుములు, మెరుపులు విపరీతంగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా సాహసించలేకపోయారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఏఈ సురేష్ బాబు చెప్పారు. బనవనూరుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, నగరూరు పరిధిలో స్తంభాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. -
పిడుగుపడి అక్కడికక్కెడే మృతి
దుద్యాల(కొత్తపల్లి): పిడుగుపడడంతో పొలం పనిచేస్తున్న రైతు అక్కడికక్కెడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం.. దుద్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు(52).. తన భార్య శేషమ్మను వెంటబెట్టుకుని గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి వద్ద పొలంలో చెత్త కుప్పలకు నిప్పంటించడానికి వెళ్లాడు. అకాలంగా కురిసిన వర్షంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కెడే మృతి చెందాడు. పొలం ఆవలి గట్టు వద్ద ఉండే భార్య ఈ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ శివశంకర్‌నాయక్.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరుముల శబ్దానికి మృతి
హాలహర్వి: మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో ఉరుముల శబ్దానికి మల్లయ్య (50) అనే మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం మల్లయ్య పొలంలో పని చేస్తుండగా భయంకరమైన గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆ శబ్దాలకు భయపడి పొలంలోనే గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన మల్లయ్య ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. కుమారుడు వీరేశ్ పొలానికి వెళ్లి గాలించగా తండ్రి మృతి చెంది ఉండడం కంట పడింది. ఉరుములు మెరుపుల శబ్దానికి భయపడడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పిడుగు నుంచి కాపాడుకునే విధానం చెబుతుండగానే..
పిడుగు నుంచి కాపాడుకునే విధానం చెబుతుండగానే.. పాఠశాల భవనంపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణశాస్త్రులపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానోపాధ్యాయిని హైమావతి పిడుగుబారి నుంచి తప్పించుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ చేయిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద శబ్దంతో పాఠశాల భవనంపై పిడుగుపడింది. దీంతో కొద్దిసేపు ఆందోళనకు గురైన పిల్లలు, పాఠశాల సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పిడుగు పాటుకు భవనం శ్లాబ్ ఓ వైపు రెండు అడుగులమేర ఊడిపోయింది. శ్లాబ్ నుంచి పెచ్చులు రాలి విద్యుత్మీటర్పై పడడంతో అది పేలిపోగా, విద్యుత్‌తీగలు, ఫ్యాన్లు కాలిపోయాయి. పాఠశాల భవనంపై పిడుగుపడినట్టు తెలుసుకున్న గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లల యోగక్షేమాలపై ఆరా తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని మండల విద్యాశాఖాధికారి యాగాటి దుర్గారావు, తహసీల్దార్ బి.సత్యనారాయణలు సందర్శించారు. -
కూలీ బతుకులపై పిడుగు
♦ పిడుగుపాటుకు గురై ఇద్దరి మహిళల మృతి ♦ అపస్మారక స్థితిలో ఉన్న మరొక మహిళ బూర్జ/సరుబుజ్జిలి(ఆమదాలవలస రూరల్): ఆమదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో శనివారం సాయంత్రం పొలం పనులు చేస్తున్న వీరిని పిడుగులు బలి తీసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. బూర్జ మండలంలోని ఏ.పి.పేట(అప్పలపేట) గ్రామానికి సమీపంలోని పొలాల్లో శనివారం సాయంత్రం పిడుగుపడడంతో గ్రామానికి చెందిన రేవాడ చిన్నమ్మడు(45) మృతి చెందింది. మరొక మహిళ నట్ల చిన్నమ్మడు అపస్మారక స్థితిలో ఉంది. ఆ గ్రామానికి చెందిన 15 మంది ఒక పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భయంకరమైన శబ్ధంతో కూడిన పిడుగు పడటంతో వారందరూ చెల్లా చెదురయ్యారు. ఇద్దరు మాత్రం అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే స్థానికులు వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవాడ చిన్నమ్మడు మృతి చెందింది. ఆమె మృతితో భర్త, కుమార్తె, బంధువులు ఆస్పత్రిలో భోరున విలపిస్తున్నారు. నట్ల చిన్నమ్మడు పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఇద్దరి కుటుంబాలు నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. పొలంకెళ్లి తిరిగివస్తూ.... సరుబుజ్జిలి మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన బురిడి అనసూయమ్మ(50) పిడుగుపాటుకుగురై మృతి చెందింది. స్థానికులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొలంలో కలుపుతీతకు వెళ్లి తిరిగివస్తున్న తరుణంలో గ్రామానికి సమీపంలోని కోనేరు గట్టువద్ద పిడుగుపాటుకు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త సత్యం, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనసూయమ్మ హఠాన్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబాన్ని సర్పంచ్ మునకాల సూర్యారావు పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయంకు కృషిచేస్తానని చెప్పారు. -
పిడుగులు.. ఉరుములు
చెరువుకిందిపల్లె(వల్లూరు): చెరువుకిందిపల్లెలో శుక్రవారం ఉదయం పిడుగు పడింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామంలో ఉదయం ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో ఉద్ధృతంగా మారింది. ఆ సమయంలో గ్రామంలో పై భాగాన గల వీధిలో ఉన్న పుత్తా నారాయణరెడ్డి అనే వ్యక్తి నివాస గృహంపై పిడుగు పడింది. భవనం పైన గల పిట్ట గోడపై పడడంతో గోడ దెబ్బతినింది. ఈ ప్రభావంతో మంటలు రేగాయి. ఆ వీధిలో వున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో వున్న గృహాల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, మిక్సీలు పాడైపోయాయి. -
పిడుగుపాటుకు గోడ ధ్వంసం
సీరోలు(కురవి) : మండలంలోని సీరోలు పోలీస్ క్వార్టర్స్‌పై సోమవారం రాత్రి పిడుగు పడింది. దీంతో భవనం పైగోడ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ నివాస సముదాయంలో పది కుటుంబాలు ఉంటున్నాయి. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో తాము భయభ్రాంతులకు గురయ్యామని పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పిడుగుపాటు భవనంపై అంతస్తుకే పరిమితం కావడంతో పెను ప్రమాదం తప్పింది. -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
♦ పలుచోట్ల మూగజీవాలూ మృత్యువాత ♦ సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు పిడుగుపాటుకు సోమవారం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. శంషాబాద్ మండలం పెద్దతూప్రకు చెందిన నల్లోల్ల జగన్నాథం కుమారుడు శ్రీకాంత్ (18), చేవెళ్ల మండలం పామెనకు చెందిన వడ్డే అనంతయ్య కుమారుడు నవీన్ (15), మొయినాబాద్ మండలం తోలుకట్టకు చెందిన కోమటి నర్సింహ(48) మృతి చెందిన వారిలో ఉన్నారు. జిల్లాలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. శంషాబాద్ రూరల్/చేవెళ్ల రూరల్/మొయినాబాద్ : జిల్లాలోని వేర్వేరు ప్రాం తాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మండలం పెద్దతూప్ర గ్రామానికి చెందిన నల్లొల్ల జగన్నాథం కొడుకు శ్రీకాంత్ (18), నల్లొల్ల నర్సింహ కుమారుడు లోకేష్ సోమవారం గేదెలు మేపడానికి పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగుపడడంతో గేదెలు మేపుతున్న శ్రీకాంత్, లోకేష్ తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోకేష్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన వడ్డే అనంతయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు వడ్డే నవీన్ (15) 10వ తరగతి చదువుతున్నాడు. కాగా.. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో నవీన్ సోమవారం తండ్రితో పాటు పశువులను మేపేం దుకు పొలానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో వర్షం పడింది. దీంతో తం డ్రీకొడుకులు దగ్గరనే ఉన్న చెట్టు వద్దకువెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడు గు పడడంతో నవీన్ అక్కడిక క్కడే మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతిచెందడంతో అనంతయ్య బోరున విలపించాడు. అదేవిధంగా చేవెళ్లలో ఎం పీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాలీహౌస్ వద్ద ఉన్న తుమ్మ చెట్టుపై ఈ పిడుగు పడింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామానికి చెందిన రైతు కోమటి నర్సింహ (48) వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పొలంలో పంటికూరు విత్తనాలు చల్లేందుకు కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి వెళ్లాడు. పొలం వద్దకు చేరుకోగానే.. వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగుపడింది. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు వెళుతునేన శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డాడు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాద్దెలు మృతి కందుకూరు : పిడుగు పాటుకు గురై రెండు మూగజీవాలు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని ముచ్చర్లలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి గ్రామంలో వర్షంతో పాటు పిడుగుపడింది. దీంతో గ్రామానికి చెందిన గార్లపాటి అంజయ్యకు చెందిన గేదెతో పాటు చేగూరి బాషయ్యకు చెందిన దూడ పిడుగు పాటుకు గురై మృతిచెందాయి. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. కోరుట్ల మండలం చిన్న మెట్పల్లిలో పిడుగు పడడంతో పొలంలో పనులు చేస్తున్న బండ్ల లింగమ్మ (39) మృతి చెందింది. మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ గ్రామంలో అంబాల సంజీవ్ అనే వ్యవసాయ కూలీ పొలంలో ముందు స్ప్రే చేస్తున్న సమయంలో పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం పిడుగు పాటుతో మరణించిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. -
పిడుగుపాటుకి ఇద్దరి మృతి
ఆదివారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన ఆదె కమలాకర్ (23) ఆదివారం మధ్యాహ్నం పిడుగు పాటుకు గురై మరణించాడు. మధ్యాహ్నం పొలంనుంచి ఇంటికి వస్తుండగా అతనిపై పిడుగుపడింది. దాంతో కమలాకర్ అక్కడేకక్కడే మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం తేంగల్ గ్రామానికి చెందిన రాణి పిడుగు పాటుకు గురై మృతి చెందింది. మధ్యాహ్నం అత్తాకోడళ్లు.. సాయమ్మ, రాణి పొలంలో పనిచేస్తుండగా.. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారు సమీపంలోని చెట్టుకిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో.. రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సాయమ్మ తీవ్రంగా గాయపడింది. ఇరుగు పొరుగు రైతులు సాయమ్మను భీంగల్ ఆస్పత్రికి తరలించారు. మరో వైపు నల్లగొండ జిల్లా దేవర కొండ మండలం ఎర్రభాగ్య తాండా వద్ద పిడుగు పడి 12 మేకలు మృతిచెందాయి.