సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి.
మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాల్లో ఇలా..
ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్‌మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.
కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది.
రోడ్డెక్కిన రైతులు
వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు.
ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల
వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు.
పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం
కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment