Winds
-
షాంఘైలో ‘బెబింకా’ బీభత్సం..స్తంభించిన జనజీవనం
షాంఘై: చైనా ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన షాంఘై నగరాన్ని బెబింకా తుపాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం(సెప్టెంబర్16) ఉదయం బెబింకా తుపాను షాంఘై నగరాన్ని తాకింది. తుపాను నగరాన్ని తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. షాంఘై నగరాన్ని తుపాన్లు తాకడం చాలా అరుదు. నగరాన్ని ఇంత పెద్ద తుపాను తాకడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి.తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్ 3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్ 4 హెచ్చరిక జారీ చేశారు. తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్ రైళ్లను క్యాంసిల్ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఇటీవలే చైనాలో యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి,ప్రాణ నష్టాలు సంభవించాయి. ఇదీ చదవండి.. యూరప్‌లో వరద విలయం -
Delhi-NCR Rain: హీట్‌వేవ్ నుంచి ఊరట.. ఢిల్లీలో భారీ వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మండు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం(ఏప్రిల్23) సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. హీట్‌వేవ్‌తో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా వర్షం పడటంతో చల్లబడింది. వర్షం పడుతున్న దృశ్యాలను ఢిల్లీ వాసులు ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో హీట్‌వేవ్ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ప్రయాణించనుంది. ఈ వాయుగుండం గాలిలోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. తీరానికి దూరంగా వాయుగుండం సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. బలపడిన వాయుగుండం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్ తీసుకుని బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది -
మూడు రోజులు విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం ఒడిశా–ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది. -
బంగ్లా తీరాన్ని తాకిన మోకా
సాక్షి, విశాఖపట్నం: భీకర మోకా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి. సెంట్ మార్టిన్ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపితే హుద్‌హుద్ తరహా పెను విపత్తుకు కారణమయ్యేదని నిపుణులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో కుండపోత.. విద్యుత్ తీగ తెగిపడి కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కుండపోత వానపడింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవగా.. రాత్రి 9 గంటల నుంచి ప్రాంతాల వారీగా భారీ వర్షం పడింది. అర్ధ్థరాత్రి తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. దీనితో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాలాల వెంబడి వరద ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శేరిలింగంపల్లి ఖాజాగూడలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్, సుచిత్ర, సూరారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. అధికార యంత్రాంగం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. నగరంలో వర్షపాతం ఇలా.. (సెంటీమీటర్లలో) ప్రాంతం వర్షపాతం ఖాజాగూడ 6.3 షేక్‌పేట 5.2 జూబ్లీహిల్స్ 4.6 మాదాపూర్ 4.5 సింగిరేణికాలనీ 4.1 అమీర్‌పేట 4.0 ఎంసీఆర్హెచ్ఆర్డీ 3.8 విద్యుత్ తీగ తెగిపడి కానిస్టేబుల్ మృతి భారీ వర్షం, ఈదురుగాలులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ ప్రాంతం మీదుగా బైక్‌పై వెళుతున్న గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ వీరాస్వామి (40)పై ఆ తీగలు పడటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో నివసించే సోలెం వీరాస్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తున్నారు. అప్పటికే బలమైన ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలైంది. ఈ సమయంలో విద్యుత్ తీగ తెగి వీరాస్వామిపై పడింది. షాక్‌కు గురైన ఆయన బైక్‌పై నుంచి కిందపడి అపస్మారక స్థితిలో పడిపోయారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు వీరాస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరాస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం అని.. యూసఫ్‌గూడ బెటాలియన్‌లో మిత్రుడిని కలిసి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. -
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
Andhra Pradesh: వర్షాలు.. పిడుగులు
సాక్షి, అమరావతి/పాతమల్లాయపాలెం (ప్రత్తిపాడు)/అవనిగడ్డ/చల్లపల్లి/ఎటపాక: తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. పిడుగులు పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేదతీరారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు చెప్పారు. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పిడుగుపాటుకు ఆగిన గుండెలు కృష్ణాజిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పట్టాలు కప్పుతుండగా సమీపంలో పిడుగుపడటంతో రైతు మత్తి వెంకటరామయ్య (53) అక్కడికక్కడే మరణించాడు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్‌రోడ్‌లో పిడుగుపాటు శబ్దానికి కె.నాంచారమ్మ (90), కమలా థియేటర్ దగ్గర సైకిల్‌షాపు మస్తాన్ గుండె ఆగి చనిపోయారు. కృత్తివెన్ను మండలం సంగమూడిలో కూనసాని వెంకటేశ్వరరావు(55) పొలంలో పశువులు మేపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. కోడూరు మండలం పిట్టల్లంక, బడేవారిపాలెం, మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో, కోడూరు మండలం బావిశెట్టివారిపాలెంలో పిడుగులు పడి నాలుగు వరికుప్పలు కాలిపోయాయి. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి, ఉల్లిపాలెంలో పిడుగులు పడి రెండు పాడిగేదెలు మృత్యువాతపడ్డాయి. మిర్చిని రక్షించుకునేందుకు వెళ్లి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో అకాల వర్షం మొదలవడంతో కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టాలు కప్పేందుకు స్థానిక దళితవాడకు చెందిన చాట్ల శ్యామ్‌బాబు (50), కొరివి కృపానందం (55) వెళ్లారు. కల్లంలో పట్టాలు కప్పుతుండగా, సమీపంలో పిడుగుపడింది. స్పృహ కోల్పోయిన వారిని స్థానికులు ప్రత్తిపాడులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. -
నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వానలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని వివరించింది. శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి శుక్రవారానికి అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులున్న చోట గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల చొప్పున ఉంటుందని హెచ్చరించింది. కొన్నిచోట్ల వడగళ్లతో కూడిన భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఏపీలో భారీ వర్షాలు ఏపీలో ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
గంటకు 160 కి.మీ వేగంతో ప్రచండ తుపాను గాలులు.. సరదాగా ఎదురెళ్తారా?
తుపానుల సమయంలో వీచే పెను గాలుల హోరు ఏ స్థాయిలో ఉంటుందో మనం అప్పుడప్పుడూ టీవీల్లో చూసే ఉంటాం.. కానీ గంటకు సుమారు 160 కి.మీ. వేగంతో వీచే ప్రచండ గాలుల తీవ్రతను ఎప్పుడైనా అనుభూతి చెందారా? డెన్మార్క్‌లోని యూనివర్స్ సైన్స్ పార్క్ ఔత్సాహికులకు ఈ వెరైటీ అవకాశాన్ని కల్పిస్తోంది! అది కూడా పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే!! ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? కృత్రిమంగా ప్రచండ గాలులను సృష్టించడం ద్వారానేలెండి. ఇందుకోసం సైన్స్ పార్క్‌లో తాజాగా రెండు సిములేటర్లతో కూడిన గ్లాస్ చాంబర్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసి కృత్రిమంగా పెను గాలులను సృష్టిస్తున్నారు. బీట్ ద స్టార్మ్‌గా పిలిచే ఈ చాంబర్లోకి ఐదేళ్ల చిన్నారులు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకు వెళ్లి భారీ గాలులను అనుభూతి చెందొచ్చు. అయితే పిల్లల కోసం 35 కి.మీ. వేగంతో వీచే సాధారణ గాలులను సిములేటర్ల ద్వారా సృష్టిస్తుండగా పెద్దల కోసం 160 కి.మీ. వేగం వరకు కేటగిరీ–2 హరికేన్ గాలులను సృష్టిస్తున్నారు. గాలులు ఇక చాలనుకుంటే ఔత్సాహికులు గ్లాస్ చాంబర్లో ఒకవైపు నుంచి మరోవైపునకు గాలికి ఎదురెళ్లి అక్కడున్న బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
తుపాను గాలికి బయటపడ్డ 5 అస్థి పంజరాలు
రామనాథపురం: యాస్ తుపాను గాలుల తీవ్రతకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక హత్యలా అనేది తేలాల్సి ఉంది. రామనాథపురం జిల్లాలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వలినొక్కం గ్రామం ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా జీవిస్తున్నారు. అయితే తుపాను సందర్భంగా గ్రామ సమీపంలో ఐదు అస్థిపంజరాలను స్థానికులు కనుక్కొన్నారు. ఇటీవల వీచిన గాలుల తీవ్రతకు ఇసుక కొట్టుకుపోయి తొలుత ఒక అస్థి పంజరం కనిపించింది. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ఐదు అస్థిపంజరాలను గ్రామస్తులకు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణకు ఆదేశం సముద్ర తీరంలో వెలుగు చూసి ఐదు మృతదేహాలు స్థానికులవా లేక పొరుగు గ్రామాలకు చెందినవా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్లలో పాత మిస్సింగ్ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్, డీఎన్ఏ ల్యాబ్‌లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్ కదలికలపైనా నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన క్లూలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. -
సూరీడే కాదు గాలీ సుర్రుమంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమన్నాడు. శుక్రవారం నాలుగు చోట్ల తీవ్ర వడగాడ్పులు, పలుచోట్ల వడగాడ్పులు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా ప్రకటిస్తారు. 47 డిగ్రీలు, ఆపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపాలెం మండలం పెంట్లాం, నల్లగొండ జిల్లా అనుములు హాలియా మండలం హాలియా, అదే జిల్లా కనగల్, పెద్దపల్లి జిల్లా మంథనిలలో ఏకంగా 47 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అలాగే ఖమ్మం, కొల్వి, ధర్మపురి, దామరచర్ల, దుమ్ముగూడెం, మొగుళ్లపల్లి, జైనా, జూలూరుపాడు, ఏన్కూరు, పాత ఎల్లాపూర్, సోన్ ఐబీ, మామిడాల, జన్నారం, భోరాజ్, నామాపూర్, బొమ్మిరెడ్డిపల్లె, ఉర్లుగొండల్లో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడ్డారు. అనేకమంది విలవిలలాడిపోయారు. నేడు, రేపు వడగాడ్పులు.. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట.. మొత్తంగా 17 జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. -
వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
-
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, విశాఖ: ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుముదురు వానలు, రాయలసీమలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణం కేంద్రం వివరించింది. దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అంతే కాకుండా ఈనెల 13 నాటికి ఉత్తర బంగాలాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు
-
ఢిల్లీలో చిమ్మచీకట్లు : భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో పట్టపగలు చిమ్మచీకట్లు కమ్మేశాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు, ఇసుక తుపాను కలసి రాజధానిపై దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజధానిలో వాతావరణం చల్లబడింది. కాగా, శనివారం ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ హెచ్చరించింది. పెనుగాలుల ధాటికి నగరంలో పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ద్వారక, అక్బర్ రోడ్, ఛత్తర్పూర్లలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇసుక తుపాన్ కారణంగా విమానసర్వీసులు సైతం నిలిచిపోయాయి. -
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం
సాక్షి, నెట్వర్క్: పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చేతికందొచ్చిన పంటలను నాశనం చేశాయి. రాత్రి వీచిన ఈ గాలులకు కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలను రైతులు నష్టపోయారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో వరి పంట, మొక్కజొన్న భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ.13 కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మామిడికాయలు నేలపాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 464 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 1,352 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా రైతులకు వడగండ్లు వరుసగా నాలుగో రోజూ కడగండ్లనే మిగిల్చాయి. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లోని సుమారు 1,280 ఎకరాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లిబందారం గ్రామానికి చెందిన స్వరూప (37) శనివారం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో గడ్డికోస్తూ స్వరూప తీగలను తాకి మృతిచెందింది. -
తమిళనాడులో భారీ వర్షాలు
సాక్షి, చెన్నై: ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు తూత్తుకుడి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
తాడేపల్లిగూడెం : ఆకాశంలో ఉదయం నుంచీ కారుమబ్బులు.. బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన వాన, హోరుగాలులకు ప్రజలు పులకించిపోయారు. ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకంటూ ఆనందం వ్యక్తం చేశారు. చల్లగాలుల తాకిడిని ఆస్వాదించారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. రోహిణి కార్తె చివరి దశలో కురిసిన భారీవర్షానికి భూమి చల్లబడింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. భీమవరంలో సాయంత్రం ప్రారంభమైన వాన రెండు గంటల పాటు ఏకధాటిన కురిసింది. జంగారెడ్డిగూడెంలో పది నిమిషాలపాటు చిరుగాలితో కూడిన జల్లులు పడ్డాయి. తాడేపల్లిగూడెంలో రెండు గంటల పాటు వాన పడుతూనే ఉంది. కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గంలోని పలుచోట్ల, ఏలూరు నగరంలో వర్షం పడింది. ఉక్కపోతకు ఉపశమనం కలుగ చేసింది. -
150 కి.మీ. వేగంతో పెనుగాలులు
- నగరంపై ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ భారీ వర్షం - 10 సెం.మీ. కుండపోత.. సాక్షి, హైదరాబాద్: ఉరుములేని పిడుగులా మంగళవారం అర్ధరాత్రి విరుచుపడ్డ అకాల వర్షం భాగ్యనగరంలో బీభత్సం సృష్టించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మే నెల 6వ తేదీన కురిసిన భారీ వర్షాన్ని తలపిస్తూ నగర ప్రజలను వణికించింది. గంటలకు 120 నుంచి 150 కి.మీ మేర వీచిన ప్రచండ గాలుల ధాటికి భారీ వృక్షాలు కూడా కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో అంధకారం అలుముకుంది. మూడు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలిపోయాయి. ఒక్కసారిగా నాలాలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం పడరాని పాట్లు పడ్డారు. మొత్తంగా నగరంలో దాదాపు 10 సెం.మీ. వర్షం కురిసింది. గతేడాది మేలో కురిసిన వర్షం(7.9 సెం.మీ.) కంటే ఇదే ఎక్కువ. అతలాకుతలం..: బలమైన గాలులకు నగరం లో 291 చెట్లు కూలిపోయాయి. 56 ప్రాంతాల్లో నీరు నిలిచింది. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విరిగిపడ్డ చెట్లు.. కూలిన హోర్డింగ్‌లతో ప్రజలు భీతావహుల య్యారు. అర్ధరాత్రి వర్షం కురవడంతో భారీ ప్రమాదాలు తప్పాయి. మొత్తంగా అధికారులు వెంటనే స్పందించడం, వివిధ శాఖల సమన్వ యంతో ఈ పరిస్థితి తొందరగానే చక్కబడింది. బాధితులు ట్వీటర్ ద్వారా తమ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. జీహెచ్ఎం సీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెల్లవారున 6 గంటలకే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 32 విద్యుత్ స్తంభాలు కూలిపోగా 24 స్తంభాలను పునరుద్ధరించారు. నెలన్నరపాటు హోర్డింగులపై నిషేధం.. గాలులకు హోర్డింగులు కూలుతుండటంతో నెల నుంచి నెలన్నర పాటు వాటిపై నిషేధం విధించనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఉన్న హోర్డింగ్‌లను తొలగిస్తామని చెప్పారు. గాలులు ఎప్పటివరకు వీస్తాయన్న అంశంలో వాతావరణ శాఖను సంప్రదించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 100, 040–21111111 నంబర్లకు ఫోన్ చేయవచ్చునన్నారు. 1,600 ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేకచోట్ల వడగళ్లు పడడం, తీవ్రమైన గాలి వానలకు 1601 ఎకరాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తెలి పారు. 40 ఎకరాలు మొక్కజొన్న కాగా మిగిలినదంతా వరి పంటేనని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలో 1250, మహబూబ్‌నగర్ 180, వికారాబాద్‌లో 90 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడతాయని, వడగళ్లు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోందని.. దాంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడం, క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడంతో వానలు పడుతున్నాయని వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పినపాక, ఏన్కూరు, తిమ్మాజీపేటలలో 6 సెంటీమీటర్లు.. జూలూరుపాడు, మంచాలలో 5, అశ్వాపురంలో 4, కొందుర్గు, హకీంపేట, గోల్కొండ, కల్వకుర్తి, షాద్‌నగర్, శామీర్పేటల్లో 3, ఇల్లెందు, కొణిజర్ల, కూసుమంచి, అచ్చంపేట, శేరిలింగంపల్లి, యాచారం, చంద్రుగొండ, డోర్నకల్‌లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా దాదాపు రాష్ట్రమంతటా వర్షపాతం నమోదుకావడంతో.. వాతావరణం కాస్తంత చల్లబడింది. బుధవారం ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లలో 42, రామగుండంలో 41, మహబూబ్‌నగర్‌లో 39, ఖమ్మం, భద్రాచలం, హన్మకొండలలో 38, హైదరాబాద్‌లో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కళ్లలో దుమ్ము
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఘాట్ల సమీపంలోని రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పుష్కర యాత్రికుల కళ్లల్లో పడి ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై వేసిన బ్లీచింగ్‌తో పాటు యాత్రికులు, స్థానికులు పడేసిన వర్ధా్యలు గాలలకు పైకిలేచి ముఖాలపై పడుతున్నాయి. ఘాట్ల వద్ద ఇసుక రేణువులు ఎక్కువుగా కళ్లల్లో పడుతుండడంతో యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. భవానీ, పున్నమి ఘాట్ల వద్ద ఈ పరిస్థితి అధికంగా ఉంది. -
తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరుగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఏపీలో ఈదురుగాలులు, వర్షాలు
ముగ్గురి మృతి.. చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం సాక్షి నెట్వర్క్: ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో కృష్ణాజిల్లాలో గోడ దిమ్మె కూలి ఒకరు, పిడుగుపాటుకు మరొకరు, గుంటూరు జిల్లాలో తాటిచెట్టు మీదపడి ఒకరు మృతిచెందారు. పలుచోట్ల చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి వెంబడి హోర్డింగ్‌లు పడిపోయాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయూరు. కంచిలి మండలంలో వీచిన గాలులకు 35 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.