
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో పట్టపగలు చిమ్మచీకట్లు కమ్మేశాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు, ఇసుక తుపాను కలసి రాజధానిపై దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజధానిలో వాతావరణం చల్లబడింది. కాగా, శనివారం ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ హెచ్చరించింది.
పెనుగాలుల ధాటికి నగరంలో పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ద్వారక, అక్బర్ రోడ్, ఛత్తర్‌పూర్‌లలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇసుక తుపాన్ కారణంగా విమానసర్వీసులు సైతం నిలిచిపోయాయి.