సాక్షి, అమరావతి/పాతమల్లాయపాలెం (ప్రత్తిపాడు)/అవనిగడ్డ/చల్లపల్లి/ఎటపాక: తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. పిడుగులు పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేదతీరారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు చెప్పారు. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
పిడుగుపాటుకు ఆగిన గుండెలు
కృష్ణాజిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పట్టాలు కప్పుతుండగా సమీపంలో పిడుగుపడటంతో రైతు మత్తి వెంకటరామయ్య (53) అక్కడికక్కడే మరణించాడు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్‌రోడ్‌లో పిడుగుపాటు శబ్దానికి కె.నాంచారమ్మ (90), కమలా థియేటర్ దగ్గర సైకిల్‌షాపు మస్తాన్ గుండె ఆగి చనిపోయారు.
కృత్తివెన్ను మండలం సంగమూడిలో కూనసాని వెంకటేశ్వరరావు(55) పొలంలో పశువులు మేపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. కోడూరు మండలం పిట్టల్లంక, బడేవారిపాలెం, మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో, కోడూరు మండలం బావిశెట్టివారిపాలెంలో పిడుగులు పడి నాలుగు వరికుప్పలు కాలిపోయాయి. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి, ఉల్లిపాలెంలో పిడుగులు పడి రెండు పాడిగేదెలు మృత్యువాతపడ్డాయి.
మిర్చిని రక్షించుకునేందుకు వెళ్లి..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో అకాల వర్షం మొదలవడంతో కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టాలు కప్పేందుకు స్థానిక దళితవాడకు చెందిన చాట్ల శ్యామ్‌బాబు (50), కొరివి కృపానందం (55) వెళ్లారు. కల్లంలో పట్టాలు కప్పుతుండగా, సమీపంలో పిడుగుపడింది. స్పృహ కోల్పోయిన వారిని స్థానికులు ప్రత్తిపాడులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment