thunders
-
Telangana Rains: రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనావేసింది -
ఇలా చేస్తే పిడుగులు పడవు..విద్యుత్ తీగల కింద.. టవర్ల దగ్గరలో ఉండొద్దు
సాక్షి, అమరావతి: భూమి, మేఘాల మధ్య విద్యుత్ విడుదల వల్ల మెరుపులు ఏర్పడి.. భూమి మీదకు అవి పిడుగులా ప్రసరిస్తుంటాయి. వానలు కురుస్తున్నప్పుడు పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల బారినుంచి సునాయాసంగా రక్షించుకోవచ్చంటున్నారు. విద్యుత్ భద్రత డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి. ప్రతి ఇంటిపైనా ‘పిడుగు వాహకం’ అమర్చాలని ఆమె స్పష్టం చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నిటారుగా నిలబడొద్దు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 1752లో విద్యుత్, మెరుపుల మధ్య సంబంధాన్ని నిరూపించినప్పటి నుంచీ, వాటిని విద్యుత్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పిడుగు నుంచి వచ్చే విద్యుత్ నిల్వ చేయగలిగితే ఒక పిడుగు నుంచి 10 కోట్ల వాట్ల విద్యుత్ పొందవచ్చు. అంత శక్తి వాటిలో ఉంటుంది కాబట్టి కేవలం 50 మైక్రో సెకన్లలో పిడుగు ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 100 పిడుగులు పడుతున్నాయనేది ఓ అంచనా. కాబట్టి పిడుగుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, కారు, బస్సు, రైలులో ఉన్నప్పుడు పిడుగుపాటు నుంచి రక్షణ లభిస్తుంది. పిడుగుల శబ్దం వినిపిస్తూ.. వర్షం పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకి పోకూడదు. పిడుగు ఎత్తైన తాటి, కొబ్బరి వంటి చెట్లను వాహకంగా చేసుకుంటుంది. ఎత్తైనవి లేనిచోట ఇతర చెట్లపై పడుతుంది. చెట్టు మీద పిడుగు పడ్డప్పుడు చెట్టు చుట్టూ తడి నేలపై 50 మీటర్ల వరకు కరెంట్ ప్రసరిస్తుంది. తడిసిన పూరి గుడిసెల పైన, గడ్డివాములపైన కూడా పిడుగు పడుతుంది. వాన పడేటప్పుడు చెట్టు కిందకు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదు. చుట్టూ 500 మీటర్ల వరకు చెట్లు లేనప్పుడు, చెలకల వద్ద నల్లని దట్టమైన మేఘాలు (భూమి నుంచి 2 కి.మీ. ఎత్తు లోపల ఉండే క్యుములోనింబస్ మేఘాలు) వర్షించినప్పుడు నడుస్తున్నా, నిటారుగా నిల్చున్నా పిడుగు మనల్నే వాహకంగా చేసుకుంటుంది. తడిస్తే తడిచామని కింద పాదాలు మాత్రమే నేలకు తాకేలా, ఒకరికొకరు 100 అడుగుల దూరంగా కూర్చుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి సమయంలో గడ్డపార లాంటి లోహపు వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పిడుగుల హెచ్చరికలు ఉన్నపుడు ఆరుబయట ఉండకూడదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భవనాలలో, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలి. ఉరుముల శబ్దం వినిపించిన వెంటనే పిడుగు పడే అవకాశం ఉందని గమనించాలి. అలాగని వెంటనే చెట్టు కిందకు, పొలాల్లోకి, ఆరుబయటకు వెళ్లకూడదు. ‘లైట్నింగ్ కండక్టర్’ కాపాడుతుంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్, 2010లోని 74వ నియమం ప్రకారం.. ప్రతి భవన నిర్మాణంలో పిడుగుపాటు నుంచి రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఎత్తైన భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, విద్యుత్ ఉత్పాదక ప్రాంతాలు, సరఫరా టవర్లు, పంపిణీ కేంద్రాలు, సమాచారానికి వినియోగించే టవర్లకు పిడుగు వాహకం (లైట్నింగ్ కండక్టర్) అమర్చుకోవాలి. ఆట స్థలాలకు సమీపంలోని ఎత్తైన ప్రదేశంలో పిడుగు వాహకం అమర్చటం ద్వారా మైదానాల్లో ఆడుకునే చిన్నారులను పిడుగుల నుంచి రక్షించవచ్చు. 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గర్లో నిలబడకూడదు. పెద్దపెద్ద చెట్ల కింద, సముద్రపు ఒడ్డున నిలబడొద్దు. విద్యుత్ వాడకం ఉన్న ప్రతిచోట ఎర్తింగ్ సిస్టం పాటించాలి. పిడుగుపడే సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించడం కూడా మంచిది కాదు. చదవండి: సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్'..నివేదికలో ఆసక్తికర విషయాలు.. -
Andhra Pradesh: వర్షాలు.. పిడుగులు
సాక్షి, అమరావతి/పాతమల్లాయపాలెం (ప్రత్తిపాడు)/అవనిగడ్డ/చల్లపల్లి/ఎటపాక: తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. పిడుగులు పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేదతీరారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు చెప్పారు. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పిడుగుపాటుకు ఆగిన గుండెలు కృష్ణాజిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పట్టాలు కప్పుతుండగా సమీపంలో పిడుగుపడటంతో రైతు మత్తి వెంకటరామయ్య (53) అక్కడికక్కడే మరణించాడు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్‌రోడ్‌లో పిడుగుపాటు శబ్దానికి కె.నాంచారమ్మ (90), కమలా థియేటర్ దగ్గర సైకిల్‌షాపు మస్తాన్ గుండె ఆగి చనిపోయారు. కృత్తివెన్ను మండలం సంగమూడిలో కూనసాని వెంకటేశ్వరరావు(55) పొలంలో పశువులు మేపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. కోడూరు మండలం పిట్టల్లంక, బడేవారిపాలెం, మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో, కోడూరు మండలం బావిశెట్టివారిపాలెంలో పిడుగులు పడి నాలుగు వరికుప్పలు కాలిపోయాయి. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి, ఉల్లిపాలెంలో పిడుగులు పడి రెండు పాడిగేదెలు మృత్యువాతపడ్డాయి. మిర్చిని రక్షించుకునేందుకు వెళ్లి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో అకాల వర్షం మొదలవడంతో కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టాలు కప్పేందుకు స్థానిక దళితవాడకు చెందిన చాట్ల శ్యామ్‌బాబు (50), కొరివి కృపానందం (55) వెళ్లారు. కల్లంలో పట్టాలు కప్పుతుండగా, సమీపంలో పిడుగుపడింది. స్పృహ కోల్పోయిన వారిని స్థానికులు ప్రత్తిపాడులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. -
AP: ఆ జిల్లాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. -
నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వానలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని వివరించింది. శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి శుక్రవారానికి అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులున్న చోట గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల చొప్పున ఉంటుందని హెచ్చరించింది. కొన్నిచోట్ల వడగళ్లతో కూడిన భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఏపీలో భారీ వర్షాలు ఏపీలో ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
‘టౌటే’ అలజడి: చెట్టు కిందకు చేరి.. పిడుగుపాటుకు గురై..
సాక్షి, నెట్వర్క్: టౌటే తుపాను ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తడంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటుకు సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. వర్షం, ఈదురుగాలులకు కొన్నిచోట్ల కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి. పలు పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. చెట్టు కిందకు చేరి.. పిడుగుపాటుకు గురై.. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన భయ్యా వెంకన్న తన మిరపతోటలో కాయలు ఏరడానికి ఆదివారం పదిమంది కూలీలను తీసుకెళ్లాడు. వీరంతా మిరపకాయలు ఏరుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పక్కనే ఉన్న వేపచెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో కారింగుల ఉమ (36), వీరబోయిన భిక్షం (80) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పేర్ల నీలమ్మ, ఉప్పుల నాగమ్మ, భయ్యా లింగమ్మ, భయ్యా సిద్ధును సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో.. ఆత్మకూర్ (ఎస్) మండలం మిడ్తనపల్లికి చెందిన బయ్య రాములమ్మ తన ముగ్గురు కుమారులు, కోడళ్లు, కూతురు, వారి పిల్లలతో కలిసి తమ మిరపతోటలో కాయలు ఏరుతుండగా ఉదయం 11 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడటంతో రాములమ్మ, ఆమె రెండో కోడలు లక్ష్మి తీవ్ర గాయాలై స్పృహతప్పి పడిపోయారు. వీరిని కుటుంబసభ్యులు సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. -
కుండపోత
తాడేపల్లిగూడెం/రూరల్ : ఒక్కో చినుకు బాకులా భూమిని ఢీకొట్టింది. దీనికి తోడు పిడుగుల శబ్దం హోరెత్తింది. చినుకు నేలను తాకినప్పుడల్లా శబ్దం పుడుతుందా అన్నట్టుగా పిడుగుల శబ్దానికి భూమి దద్దరిల్లింది. మెరుపులు, ఉరుములతో కూడిన వాన గంటసేపు జిల్లాలోని పలు ప్రాంతాలపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. మంగళ వారం మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు ప్రారంభమైన వాన 6 గంటల వరకూ ఏకధాటిగా బాదింది. ఎక్కడి జనం అక్కడ స్తంభించిపోయారు. వరుణుడి దండయాత్ర ఆగిపోయాక ఏది రోడ్డో.. ఏది కాలువో తెలుసుకోలేని అయోమయ స్థితి. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా వానపడింది. గూడెంలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మరో రెండు రోజులు వానలే..
చేవెళ్ల, ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం 35 వేల ఎకరాల్లో పంట నష్టం మూడు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున, మహేశ్వరం, జడ్చర్లలో 6, సిరిసిల్లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డైంది. గోల్కొండలో 2.4, బేగంపేట్‌లో 1.4, హకీంపేట్‌లో 1.9, సరూర్‌నగర్‌లో 1.7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉద్యాన పంటలకు నష్టం.. వర్షాల కారణంగా 35 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 6 వేల ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో అరటి తోటలకు, కూరగాయలు.. ఇతరత్రా పంటలకు నష్టం సంభవించినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తెలి పారు. పూర్తిస్థాయి సమాచారం తమకు అందలేదని, కల్లాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.