మరో రెండు రోజులు వానలే..
చేవెళ్ల, ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల వర్షం
హైదరాబాద్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం
35 వేల ఎకరాల్లో పంట నష్టం
మూడు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున, మహేశ్వరం, జడ్చర్లలో 6, సిరిసిల్లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డైంది. గోల్కొండలో 2.4, బేగంపేట్‌లో 1.4, హకీంపేట్‌లో 1.9, సరూర్‌నగర్‌లో 1.7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉద్యాన పంటలకు నష్టం..
వర్షాల కారణంగా 35 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 6 వేల ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో అరటి తోటలకు, కూరగాయలు.. ఇతరత్రా పంటలకు నష్టం సంభవించినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తెలి పారు. పూర్తిస్థాయి సమాచారం తమకు అందలేదని, కల్లాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.