crops Loss
-
ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు'
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుండి వచ్చిన ఎడారి మిడతల వల్ల గత రెండు వారాలుగా ఉత్తర భారత దేశంలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపొయారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ మిడతలు వస్తాయోమో అన్న ఆందోళన నెలకొన్న సందర్భంగా మిడతలకు సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం. మనకు సాధారణంగా కనబడే మిడతలకు, ఎడారి మిడతలకు తేడా ఏమిటి? వీటిని గుర్తించటం ఎలాగో తెలుసుకుందాం.. ♦ విశాఖపట్టణం జిల్లా నుంచి వచ్ఛిన ఫొటోల ఆధారంగా, కేరళలో కొన్నిప్రాంతాలలో కనిపించిన మిడతలు ‘కాఫీ తోటలను ఆశించే మిడతలు’గా, అలానే పిఠాపురం ప్రాంతం నుంచి వచ్చిన ఫొటోల ఆధారంగా వాటిని ‘జిల్లేడు మొక్కలను ఆశించే ప్రత్యేక మిడతలు’గా గుర్తించాలి. మన దేశంలో కనపడే ముఖ్యమైన మిడతల గురించి తెలుసుకుందాం. ఎడారి మిడత ఎడారిమిడతలు (schistocerca gregaria) మన ప్రాంతంలో వుండవు. కానీ ఇప్పుడు వేరే దేశాల నుంచి రాజస్తాన్ మీదుగా ఇతర రాష్ట్రాల్లోకి దండుగా తరలి వస్తున్న మిడతలు ఇవే. ఇది ఒక ఖండం నుంచి మరో ఖండానికి (వలస) వెళ్లగల అత్యంత వినాశకారి మిడత ఇది. ♦ మిడతల జీవిత చక్రంలో గుడ్డు, రెక్కలు లేని అపరిపక్వ దశ, రెక్కలున్న ప్రౌఢదశలుగా మూడు దశలు వుంటాయి. ఆడపురుగులు ఖాళీగా వుండే ఎడారిప్రాంతాల్లో తగినంత తేమ ఉన్నప్పుడు గుడ్లు పెడతాయి. రెండు వారాల్లో గుడ్డు నుంచి (రెక్కలు లేని) పిల్ల పురుగులు పుడతాయి. ఈ పిల్ల పురుగులు ఐదారు వారాల్లో అన్ని రకాల పంటలను, చెట్ల ఆకులను, గడ్దిని తింటూ అయిదారు సార్లు కుబుసం విడుస్తూ (పాత చర్మాన్ని విడుస్తూ) పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటాయి. చివరి కుబుసం విడిచే దశ తర్వాత రెక్కలున్న పెద్ద మిడతలుగా మారతాయి. ♦ పెద్దమిడతలు వేరేప్రాంతానికి ఎగురుకుంటూ పోయి ఆయా ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి. పెద్ద మిడతలు నాలుగువారాలు బతుకుతాయి. అయితే ఒంటరిగా వుండే రెక్కలులేని మిడతలు, రెక్కలుగల ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎక్కువగా వుండి ఆ ప్రదేశం మిడతలతో కలిసి గుంపుగా మారితే ఈ మిడతల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ గుంపులనే ‘దండు’ అంటారు. ♦ సాధారణంగా రెక్కలు లేని మిడతలు ఒంటరి దశలో ఆకుపచ్చ రంగులో వుంటాయి, కానీ అవి గుంపులుగా వుండే దండు దశకు మారగానే నల్లటి మచ్చలతో పసుపురంగులోకి మారతాయి. చదరపు కిలోమీటరులో పరచుకొని ఉండే ఒక్కో దండులో అయిదారు కోట్ల మిడతలు ఉంటాయి. ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎంతదూరమైనా ఎగురుకుంటూ పోగలవు. ♦ గాలి వాటంగా రోజుకు 100 కిలోమీటర్లు వెళ్లగలవు. రెక్కలున్న ప్రౌఢ మిడతలైతే గాలి వాటంగా సముద్రమట్టంపై రెండు కిలోమీటర్ల ఎత్తులో వేరే ప్రాంతానికి ఎగురుతూ వెళ్లగలవు. ఈ ఎడారి మిడతలు సహారా ఎడారుల్లో, పాకిస్తాన్, మనదేశంలో రాజస్తాన్ ఎడారి ప్రాంతంలో వుంటాయి. కానీ, వాటికి, సంతతికి అనుకూలంగా వుంటే వేరే ఖండాలకు, దేశాలకు, ప్రాంతాలకు దండులుగా తిండికోసం, గుడ్లుపెట్టటానికి వెళ్తాయి. ఈ క్రమంలో దొరికిన పంటలను, చెట్లను సర్వనాశనం చేస్తాయి. ♦ మన దేశంలో ఈ మిడతలు సంతానోత్పత్తి జులై నుండి అక్టోబర్ దాకా చేస్తాయి. అయితే పాకిస్తాన్లో జనవరి నుండి అక్టోబర్‌దాకా సంతానోత్పత్తి చేస్తాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిడతల కదలికలను గమనిస్తూ అన్ని దేశాలకి సలహాలని ఇస్తుంటారు. ♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘మిడతల హెచ్చరిక సంస్థ’ ఎప్పటికప్పుడు పక్కదేశాల్లో మిడతల ఉధృతిని అంచనావేస్తూ ఉంటుంది. మన దేశంలో నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్లో ఉన్న ఎడారి ప్రాంతాలో పడిన వానల మూలంగా ఎడారి మిడతల సంతానోత్పత్తి పెరిగింది. అందువల్ల ఈ ఎడారి మిడతలు దండు దశగా మారి ఎప్రిల్ నెలలో పాకిస్తాన్ నుండి రాజస్తాన్ వైపు వచ్ఛాయి. అవి గాలివాటంగా (బలమైన దక్షిణ గాలుల వల్ల) ఇతర ప్రాంతాల వైపు వస్తున్నాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం ఇప్పుడున్న గాలివాటం ప్రకారం బీహార్, ఒరిస్సా రాస్ట్రాల వరకు జులై నెలదాకా వచ్చే అవకాశం వుంది. అయితే నైరుతీ రుతు పవనాలు మొదలవగానే ఈ మిడతలు గాలివాటంగా మళ్లీ రాజస్తాన్ వైపు మరలుతాయని అంచనా. ♦ జిల్లేడు మిడత జిల్లేడు మిడత (Poekilocerus pictus) మన భారత ఖండంలోనే వుంటుంది. ఇది జిల్లేడు మొక్కలపై జీవిస్తుంది. బాగా ఆకుపచ్చ రంగులో వుండి పసుపు పచ్చ గీతలు వుంటాయి. ఇవి జిల్లేడు మొక్కల మీద మాత్రమే వుంటాయి. వేరే రకాల మొక్కలపై లేదా పంటలపైకి అసలు రావు. వీటిని మొహం మీద లేదా పొట్ట దగ్గర తాకితే ఒకరకమైన ద్రావణాన్ని చిమ్ముతాయి. వీటిని గుర్తించటం చాలా తేలిక. ఎడారి మిడతలకు వీటికి తేడా సులభంగా అర్థమవుతుంది. ♦ బొంబాయ్ మిడత బొంబాయ్ మిడత (Patanga succincta) మన దేశంలో సాధారణంగా అన్ని మొక్కలపై కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధరణంగా అన్ని చోట్లా అన్ని మొక్కలపైనా కనిపిస్తూ వుంటుంది. ఈ మిడతల దండు 1927 తర్వాత మళ్లీ కనిపించలేదు. ఏ పంటలనూ వదలవు 1993లో రాజస్థాన్‌లో ఎడారి మిడతలు విజృంభించాయి. అప్పట్లో మిడతల నియంత్రణ కార్యక్రమాన్ని 40 రోజులు అమలు చేసి.. మిడతలను సమర్థవంతంగా నిర్మూలించిన అధికార బృందంలో తెలుగు వారైన డాక్టర్ కె.ఎస్.ఆర్.కె. మూర్తి కూడా ఉన్నారు. కీటక శాస్త్ర నిపుణులైన డా. మూర్తి 1999లో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైరై సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కీటక శాస్త్ర నిపుణుల జాతీయ సంఘానికి అధ్యక్షునిగా కూడా సేవలందించారు. ఎడారి మిడతలు ఏ పంటలనూ వదలకుండా రాత్రీ, పగలు తేడా లేకుండా ఆబగా తినేస్తాయని, వీటి పట్ల ప్రభుత్వం, రైతులతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డా.మూర్తి చెప్పారు. రైతులు రోజూ ఉదయం, సాయంత్రం పొలాల్లో కలియదిరిగేటప్పుడు ఎడారి మిడతలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుంటూ ఉండాలి. సాధారణంగా వేడి వాతావరణంలోనే ఎడారి మిడతలు వస్తాయి. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇక రావు అనుకోవడానికి లేదన్నారు. ఇతర దేశాల్లో మిడతల తీవ్రత, వాతావరణంలో మార్పులను బట్టి రావచ్చని. రావని కచ్చితంగా చెప్పటానికి లేదని డా.మూర్తి(94415 84255) హెచ్చరిస్తున్నారు. కాఫీ మిడత కాఫీ తోటల్లో ఉంటుంది కాబట్టి దీన్ని కాఫీ మిడత (Aularches miliaris) అంటారు. దీన్ని దెయ్యం మిడత, నురుగు మిడత అని కూడా పిలుస్తారు. ఈ మిడత ఇటీవల కేరళలో వయనాడ్ ప్రాతంలో కాఫీతోటల్లో కనపడిందని వార్తలు వచ్చాయి. ఎడారి మిడత వచ్చిందని స్థానికులు భయపడ్డారు. దీన్ని గుర్తించటం చాలా తేలిక. విశాఖపట్టణం జిల్లాలో కాఫీమిడతలకు చెందిన రెక్కలులేని పిల్లపురుగులు. ఎక్కువ సంఖ్యలో వుండటంతో వీటిని చూసి స్థానికులు ఎడారి మిడతలని అనుకుంటున్నారు. వీటికి ఎడారి మిడతలకు చాలా తేడా ఉంది. ♦ కాఫీ మిడత కొబ్బరి, పోక, పనస, రబ్బరు, టేకు, అరటితోపాటు మిగతా పంటల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇతర మిడతలు మనకు సాధారణంగా గడ్డిలో కనబడే అనేక ఇతర రకాల మిడతలు పెద్దగా నష్టం కలగచేయవు. వరి పంటలోనూ ‘వరి మిడత’ను గమనించవచ్ఛు. కొన్నిసార్లు ఈ మిడతల ఉధృతి పెరగవచ్చు. – డా. శ్రీనివాస రావు చెరుకూరి కీటక శాస్త్ర ఆచార్యులు (94410 26576) ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, బాపట్ల cherukurisrao@yahoo.com -
బాబోయ్.. రొయ్య
పశ్చిమగోదావరి, భీవువరం: డాలర్లు కురిపించిన రొయ్యల సాగు ప్రస్తుతం నష్టాల్లో సాగుతోంది. వైరస్ తాకిడితో రైతులు వరుసగా నష్టాలను చవిచూస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది రైతులకు మంచి దిగుబడి వచ్చినా ధరల్లో నిలకడ లేకపోవడంతో సాగు నిరాశాజనకంగా ఉంది. చేపల సాగు ఆశాజనకంగా ఉండడంతో కొంతమంది రైతులు రొయ్యల చెరువుల్ని చేపల చెరువులుగా మారుస్తున్నారు. అయితే కొందరికి ఆక్వా సాగుపై మోజు తగ్గకపోవడంతో రైతులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. గతంలో భీమవరం కేంద్రంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని చెబుతున్నారు. మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయాలి వరి, పొగాకు తదితర పంటలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా వరి రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ, రుణాల మంజూరు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆర్జించిపెట్టే ఆక్వా రంగానికి ఎక్కడా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వానికి సెస్సుల రూపంలో ఏటా ఆక్వా రైతులు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా వీరికి ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. కోల్డ్ స్టోరేజీలు లేవు. వరిలో రైతులకు నాణ్యమైన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ కమిటీలు, వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఆక్వాలో సీడ్ వ్యాపారమంతా దళారుల గుప్పెట్లోనే జరుగుతోంది. రాష్ట్రం మెుత్తంమీద ఒకట్రెండు సీడ్ కేంద్రాలు ఉన్నా అవి రైతులకు ఉపయోగపడటంలేదు. సుమారు వంద వరకూ సీడ్ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా ఉత్పత్తి అవుతున్న పిల్లల్లో నాణ్యత ఉండటంలేదు. వైరస్ తదితర కారణాల వల్ల నెలరోజుల్లోపే పిల్లలు చెరువుల్లో తేలిపోతున్నాయి. రైతుల్ని నిండా ముంచుతున్న ప్రైవేటు హేచరీలపై ఎలాంటి నిఘా లేదు. అదృష్టాన్ని నమ్ముకుని రైతులు సీడ్ కొంటున్నారు. ప్రభుత్వమే నాణ్యమైన రొయ్య సీడ్ సరఫరా చేస్తే రైతుల కష్టాలు కొంతవరకు గట్టెక్కుతాయి. అంత కష్టపడి రొయ్యలు సాగుచేస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడంలేదు. ధాన్యం, జొన్న, గోధుమలు వంటి ఆహారపంటలకు ప్రభుత్వమే ధర నిర్ణయించి రైతులకు అందేలా చూస్తుంది. ఆక్వా విషయంలో ధర నిర్ణయం దళారుల చేతుల్లో ఉంది. ధరలేనప్పుడు పట్టుబడికి వచ్చిన రొయ్యల్ని దాచుకునే సౌకర్యం జిల్లాలో లేదు. కనీసం ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా నిర్మించలేదు. ఇక ఆక్వా మందుల పేరుతో మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న ఉత్పత్తులపై అధికారుల నియంత్రణ కొరవడింది. కంపెనీలు తెలివిగా ఫీడ్ సప్లిమెంట్స్ రూపంలో మందులను కూడా విడుదల చేస్తున్నాయి. దీనివల్ల రైతులకు నష్టం జరిగినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉండటం లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడి చేసేందుకు చట్టంలో సరైన సెక్షన్ లేదు. ఆకర్షణీయ ప్రకటనలతో నాణ్యత లేని మేతను కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఉపయోగంలేని ఎంపెడా ఆక్వా రైతులకు ఎంపెడా వల్ల ఒరిగిందేమీ లేదు. వైరస్ పరీక్ష కేంద్రాల్లో నీటి సాంద్రత నిర్ధారించే పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. ఎంపెడా వద్ద ఉన్నా అవి రైతులందరికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. చాలామంది రైతులు ప్రైవేటు కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఈ కేంద్రాల్లో కొన్ని బోగస్ రిపోర్టులు ఇస్తూ సీడ్, ఫీడ్ కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆక్వా చెరువుల్లోంచి వదిలివేసిన మురుగునీరు ప్రత్యేకంగా బయటకు వెళ్లే మార్గాలు లేవు. ఫలితంగా వైరస్ అదుపులోకి రావడంలేదు. ఈసారైనా పంట దక్కకపోతుందా? అని ఆశచావని రైతు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేస్తున్నాడు. ఆక్వా రైతులకు కూడా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. -
నీట మునిగిన పంటలు
రేగోడ్: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొండాపురంలో వరి, కంది, తొగరి, పత్తి పంటలు 400 ఎకరాల్లో నీట మునిగింది. చెరువు అలుగు పొంగి ఇళ్ల వద్దకు వర్షపు నీరు చేరింది. రాయిలొంక తండాలో 15 ఎకరాల్లో పంటలు నీళ్లల్లో మునిగాయి. పెద్దతండా, జగిర్యాల, దుద్యాల, మర్పల్లి, లక్యానాయక్ తండా, రేగోడ్, చౌదర్పల్లి, ప్యారారం, సిందోల్, తాటిపల్లి, ఆర్.ఇటిక్యాల, గజ్వాడ, దేవునూర్, ఖాదిరాబాద్, నిర్జప్ల, ఉసిరికపల్లి తదితర గ్రామాలు, తండాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంటలు చేతికొచ్చే స్థితిలో లేవన్నారు. లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటనష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతున్నారు. వర్షం కారణంగా మేడికుంద, ఆయా తండాల్లో శనివారం రాత్రి కరెంటు సరఫరా నిలిచింది. దీంతో ప్రజలు రాత్రి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా'
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను తానే కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం రుణమాఫీ చేసినట్టు చెప్పారు. ప్రతి అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. -
మరో రెండు రోజులు వానలే..
చేవెళ్ల, ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం 35 వేల ఎకరాల్లో పంట నష్టం మూడు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున, మహేశ్వరం, జడ్చర్లలో 6, సిరిసిల్లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డైంది. గోల్కొండలో 2.4, బేగంపేట్‌లో 1.4, హకీంపేట్‌లో 1.9, సరూర్‌నగర్‌లో 1.7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉద్యాన పంటలకు నష్టం.. వర్షాల కారణంగా 35 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 6 వేల ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో అరటి తోటలకు, కూరగాయలు.. ఇతరత్రా పంటలకు నష్టం సంభవించినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తెలి పారు. పూర్తిస్థాయి సమాచారం తమకు అందలేదని, కల్లాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. -
వర్షార్పణం!
తాండూరు, న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వ్యాపారులకూ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది. అమ్ముకునేందుకు యార్డుకు తరలించిన పంటలతోపాటు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులు వర్షార్పణం అయ్యాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రితం రోజు వర్షానికి వేలాది బస్తాల వేరుశనగలు, కందులు, శనగలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 12 వేల బస్తాల్లో నిల్వ చేసిన వేరుశనగలు నల్లగా రంగు మారాయి. సుమారు రూ.2 కోట్ల మేరకు పప్పుధాన్యాల ఉత్పత్తులు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు. ఒకవైపు వర్షం జోరు.. మరోవైపు వడగళ్లు కురవడంతో యార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు, హమాలీలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునేందుకు రెండో షెడ్ లేకపోవడమే నష్టానికి కారణమని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు పాలకమండలి, మార్కెట్‌యార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా షెడ్ నిర్మాణం చేపట్టలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అలాగే హైదరాబాద్ మార్గంలోని ఖాంజాపూర్ సమీపంలో కొత్త యార్డు ఏర్పాటులో జాప్యాన్ని వారు తప్పుపడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చుతారని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మాకెవరు దిక్కని రైతులు వాపోతున్నారు. ఇకముందైనా ఇలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు మార్కెట్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు. రెండు రోజల నుంచి కురుస్తున్న వర్షాలకు షాబాద్ మండలంలోని కక్కులూరు, కేసారం, నరెడ్లగూడ, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో మిర్చి, కీరదోస, సొరకాయ, టమాటా, ఉల్లి, క్యాబేజి, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, పూలతోటలకు నష్టం వాటిల్లింది. వడగళ్లు, ఈదురు గాలులకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, శేరిగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు, నైల్లి గ్రామాల పరిధిలో గల వందలాది ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పూత, పిందెలు రాలిపోయాయి. రాందాస్‌పల్లి, మల్శెట్టిగూడ, చింతపల్లిగూడ తదితర గ్రామాల్లో వడగళ్లు పడడంతో వివిధ పంటలకు నష్టం కలిగింది. మేడ్చల్ మండలం డబిల్పూర్, సోమారం, లింగాపూర్, రాయిలాపూర్, బర్మాజిగూడ, శ్రీరంగవరం గ్రామాల్లో టమాటా, ఆలుగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గిలో వడగళ్ల కారణంగా మిరప పంట దెబ్బతిన్నది. వరుస నష్టాలను చవిచూస్తున్న మిర్చి రైతులకు ఈ సారీ కలిసిరాలేదు. కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో అధిక మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాచుపల్లి, ధన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, దాసర్లపల్లి గ్రామాల్లో వడగళ్లకు క్యాప్సికం, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా, కీరదోస, చిక్కుడు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. -
రెక్కల కష్టం నీటిపాలు
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు అన్నదాతల వెన్నువిరిచాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా జిల్లాలో 3,292 హెక్టార్లలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు రూ.10.57 కోట్ల నష్టం వాటిల్లింది. గత నెల 27 నుంచి ఈనెల 5 వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పం టలతోపాటు పండ్లు, కూరగాయల తోటలు నీట ముంచాయి. ఈ వర్షాల వల్ల 1,941 హెక్టార్లలో వ్యవసాయ పంటలతోపాటు 1,350 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు తేల్చాయి. కాగా 44,573 క్వింటాళ్ల దిగుడులకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక నివేదికను పంపించాయి. వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న గృహాల సంఖ్య 369కు పెరిగింది. అందులో 10 పూర్తిగా, ఐదు తీవ్రంగా, 354 పాక్షికంగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వ్యవసాయం, పశు సంపదకు జరిగిన నష్టంపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. కూరగాయల రైతు విలవిల అకాల వర్షాల వల్ల 1,350 హెక్టార్లలో కూరగాయల తోటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి, బత్తా యి, ద్రాక్ష తోటలకు నష్టం వాటిల్లింది. పం టలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి రూ.4.60కోట్ల పెట్టుబడి రాయితీ కోసం ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 965.20 హెక్టార్లలో కూరగాయల తోటలు ధ్వంసం కావడంతో రైతులకు రూ.1.91 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పం పారు. వంద హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.24లక్షలు, 20 హెక్టార్లలో బొప్పాయి తోటలకు గాను రూ.2 లక్షలు, 20 హెక్టార్లలో ద్రాక్ష తోటలకు గాను రూ.1.8 లక్షలు, 4హెక్టార్లలో బత్తాయి తోటలకు గాను రూ.60 వేల ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా వడగళ్ల వాన వల్ల జిల్లాలో 32 మేకలు, 22 గొర్రెలు, ఓ గేదె మృత్యువాత పడ్డాయి. దీంతో పెంపకందారులకు రూ.1.40 లక్షల నష్టం వాటిల్లిందని పశు సంవర్థక శాఖ తేల్చింది. సగటు వర్షపాతం 11.5 మి.మీటర్లు జిల్లాలో మంగళవారం 11.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా నర్సాపూర్‌లో గరిష్టంగా 42.2 మిల్లీమీటర్లు, దౌల్తాదాలో 38 మి.మీటర్లు, కోహీర్‌లో 35మి.మీ., చిన్నశంకరంపేటలో 33మి.మీ., కొండపాకలో 30 మి.మీటర్ల వర్షం కురిసింది. -
వర్షార్పణం
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం.. భీకరంగా కురిసింది. వడగండ్లతో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలను నీట ముంచాయి. నెల రోజుల్లో చేతికొస్తాయని ఆశించిన పంటలను వర్షాలు ఎక్కడికక్కడే ఛిద్రం చేశాయి. రెండు రోజులుగా పంట నష్టం తీవ్రత ఎక్కువైంది. 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇందులో 5 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 73 ఇళ్లు తీవ్రంగా, 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు జిల్లాలో 17.1 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 71,6 మి.మీటర్ల వర్షం కురవగా.. సంగారెడ్డి మండలంలో 52 మి.మీటర్లు, కొండాపూర్‌లో 48, కంగ్టిలో 46.8, శివ్వంపేటలో 41.2, సదాశివపేటలో 40.4, ములుగులో 40, న్యాల్కల్ 36 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగనూరు, పటాన్చెరు, ఆర్సీపురం మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి ఓ మోస ్తరు వర్షం కురిసింది. ఈ వర్షాల పలు ప్రాంతాలలో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం నాటికి కురిసిన వర్షాలతో జిల్లాలోని 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల వ్యవసాయ పంటలు వర్షార్పణమయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ తేల్చింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంట లు దెబ్బతిన్నాయి. ఈ మేరకు అంచనాలతో మంగళవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించింది. అదే విధంగా 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ నిర్ధారించింది. మంగళవారం సైతం భారీ వర్షం కురవడంతో నష్టం వేల ఎకరాలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ‘వ్యథ’సాయం 937. 5 హెక్టార్లు అత్యధికంగా కల్హేర్ మండలంలో 422.8 హెక్టార్లలో పంట లు దెబ్బతిన్నాయి. 380 హెక్టార్ల మొక్కజొన్న, 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 2.8 హెక్టార్ల గోధుమలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా సిద్దిపేట మండలంలో 60 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సంగారెడ్డిలో 44 హెక్టార్లలో వరి, మెదక్‌లో 43.5 మొక్కజొన్న, శివ్వంపేటలో 40 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నాయి. -
జిల్లాలో నష్టం రూ.323.4 కోట్లు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గత నెలలో వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసి బీభత్సం సృష్టించిన వర్షాలు... అదే స్థాయిలో నష్టాల ను కూడా మిగిల్చాయి. వర్షాలకు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా రూ.113.60 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించగా అది మూడు రెట్లు పెరిగి రూ.323.4 కోట్లకు చేరింది. జిల్లాలో ఇటీవల పర్యటించిన కేంద్రబృందానికి శాఖల వారీగా నష్టం వివరాలను అంద జేశారు. జిల్లాలో అన్నిశాఖలకు సంబంధించి రూ.323.4 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వానికి, ఆయా శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. 34 మండలాల్లో నష్టం ఏర్పడగా, వాటిలో 102గ్రామాల్లో నష్టం చాలా ఎక్కువగా ఉంది. పంటనష్టం వివరాలు... వర్ష బీభత్సం వల్ల 16,936 హెక్టార్లల్లో వరి దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు రూ.16.17 కోట్లు అవసరమని నివేదించారు. 1,197.37 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, దీనికి గానూ రూ.1.27 కోట్లు అవసరమని పేర్కొన్నారు. 2,655 ఇళ్లకు నష్టం.... అధిక వర్షాలకు 2,655 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో పక్కా ఇళ్లు 18 పూర్తిగా, 31 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే పూరిళ్లు 67 పూర్తిగా, 259 తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్షికంగా 2,068 ఇళ్లు దెబ్బతిన్నట్టు నివేదించారు. అలాగే గుడిసెలు 175 దెబ్బతిన్నాయి. ఇవి కాక మరో 37 ఇళ్లు పాడైనట్టు గుర్తించారు. వీటికి పరిహారం చెల్లించేందుకు రూ.76 లక్షలు అవసరమని పేర్కొన్నారు.నలుగురు మృతి చెంద గా వారిలో ముగ్గురికి పరిహారం అందజేయాలని పేర్కొన్నా రు. 600 పశువులు మృత్యువాత పడ్డాయని వీటి యజమానులకు పరిహారం చెల్లించేందుకు రూ.90 లక్షలు అవసరమని నివేదించారు. 11 పునరావాస కేంద్రాలు నిర్వహించి 896 మందికి పునరావసం కల్పించినట్టు పేర్కొన్నారు. రోడ్లకు భారీ నష్టం భారీ వర్షాలు ఆర్అండ్బీ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చాయి. 169.10 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 10 కల్వర్టు లు, 89 సీడీ వర్కులు దెబ్బతిన్నాయి. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.113.72 కోట్లు అవసరమని నివేదించారు. అలాగే ఐటీడీఏకు చెందిన 87 రోడ్లు పాడవ గా వీటి మరమ్మతుల కోసం రూ.8.91కోట్లు అవసరమని నివేదించారు. పంచాయతీరాజ్‌కు చెందిన 204కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.అలాగే 73సీడీ వర్కులు, 75 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పనులు చేపట్టడానికిగానూ రూ.92.40 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. మున్సిపాల్టీల్లో మున్సిపాల్టీల్లో 20.28 కిలోమీటర్ల మేర రోడ్లు, 10 కిలో మీటర్ల మేర డ్రైన్లు, మూడు మంచినీటి పథకాలు, 1,060 వీధిలైట్లు, తొమ్మిది మున్సిపల్ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటి మరమ్మతుకు రూ.10.47 కోట్లు అవసరమని నివేదించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చెరువులు, మదుములు వంటివి 994 దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానకి రూ 60.30 కోట్లు అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం... గ్రామీణ నీటిసరఫరా విభాగానికి సంబంధించి 181 పథకాలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానికి రూ. 10.71 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. 81 వలలు, 40 చేపల చెరువులు, 30 టన్నుల చేపలు పాడైపోయాయి. వీటి నష్టం రూ.14.2 లక్షలుగా గుర్తించారు. అలాగే చేప పిల్లల కేంద్రంలో వేసిన పిల్లలు చనిపోవడం , కార్యాలయ భవనం శిథిలం కావడంతో రూ.58.8లక్షల నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో మందులు సరఫరా చేయడానికి రూ.97 వేలు ఖర్చు చేసి నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి 165 ట్రాన్స్ఫార్మర్లు, 172 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి వీటి మరమ్మతులకు రూ.87.39లక్షలు అవసరమని నివేదించారు.