సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం.. భీకరంగా కురిసింది. వడగండ్లతో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలను నీట ముంచాయి. నెల రోజుల్లో చేతికొస్తాయని ఆశించిన పంటలను వర్షాలు ఎక్కడికక్కడే ఛిద్రం చేశాయి. రెండు రోజులుగా పంట నష్టం తీవ్రత ఎక్కువైంది. 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇందులో 5 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 73 ఇళ్లు తీవ్రంగా, 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు జిల్లాలో 17.1 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 71,6 మి.మీటర్ల వర్షం కురవగా.. సంగారెడ్డి మండలంలో 52 మి.మీటర్లు, కొండాపూర్‌లో 48, కంగ్టిలో 46.8, శివ్వంపేటలో 41.2, సదాశివపేటలో 40.4, ములుగులో 40, న్యాల్‌కల్ 36 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగనూరు, పటాన్‌చెరు, ఆర్సీపురం మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి ఓ మోస ్తరు వర్షం కురిసింది. ఈ వర్షాల పలు ప్రాంతాలలో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
సోమవారం నాటికి కురిసిన వర్షాలతో జిల్లాలోని 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల వ్యవసాయ పంటలు వర్షార్పణమయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ తేల్చింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంట లు దెబ్బతిన్నాయి. ఈ మేరకు అంచనాలతో మంగళవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించింది. అదే విధంగా 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ నిర్ధారించింది. మంగళవారం సైతం భారీ వర్షం కురవడంతో నష్టం వేల ఎకరాలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
‘వ్యథ’సాయం 937. 5 హెక్టార్లు
అత్యధికంగా కల్హేర్ మండలంలో 422.8 హెక్టార్లలో పంట లు దెబ్బతిన్నాయి. 380 హెక్టార్ల మొక్కజొన్న, 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 2.8 హెక్టార్ల గోధుమలకు నష్టం వాటిల్లింది.
అదే విధంగా సిద్దిపేట మండలంలో 60 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సంగారెడ్డిలో 44 హెక్టార్లలో వరి, మెదక్‌లో 43.5 మొక్కజొన్న, శివ్వంపేటలో 40 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.
చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నాయి.
వర్షార్పణం
Published Tue, Mar 4 2014 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement