అకాల వర్షం...భారీనష్టం..!
►రాళ్లవానతో రాలిపోయిన ధాన్యం
►ఈదురు గాలులతో ఇళ్లపై ఎగిరిపోయిన పై కప్పులు
►అవుసలపల్లిలో పిడుగుపాటుకు పాడిగేదె, దున్నపోతు మృతి
►కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
►ప్రభుత్వమే ఆదుకోవాలి బాధితుల వినతి
మెదక్ రూరల్ : అకాలవర్షంతో తీవ్రనష్టం వాటిల్లింది. చేతికందిన పంటంతా నేలపాలైంది సంఘటన మండల పరిధిలోని పలుగ్రామాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలులతో రాళ్లవర్షం పడింది. దీంతో మండల పరిధిలోని పాతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రలోని ధాన్యం తడిసి ముదైంది. అలాగే భయంకరమైన ఈదురుగాలులతో మండలంలోని ఔరంగాబాద్ గిరిజన తండాలోని పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి.
తండాకు చెందిన నానావత్ భాస్కర్ అనేవ్యక్తి ఇంటిపై ఉన్న సిమెంటు రేకులు గాలిధాటికి ఎగిరి వందగజాల దూరంలో పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగున బయటకు వచ్చి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. అవుసులపల్లి గ్రామానికి చెందిన కందుల రాములు అనేరైతు పాడిగేదెను, దున్నపోతును వ్యవసాయపొలం వద్ద చెట్టుకు కట్టేయగా పిడుగుపడడంతో మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.60 వేలనష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
పిడుగు పడిన చోట నిలబడితే మంచుపై నిలబడినంత చల్లగా ఉంది. దీనిని బట్టి ఇది చలిపిడుగై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పిడుగు పడిన సమయంలో భయంకరమైన శబ్దం వచ్చి మెరుపు మెరిసిందని పిడుగు పడిన ప్రదేశానికి తాను కొద్దిదూరంలో ట్రాక్టర్ కింద తలదాచుకున్నానని బాధిత రైతు తెలిపాడు. గేదే మృత్యువాత పడటంతో తాను జీవనాధారం కోల్పోయానని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రాళ్లవర్షంతో అవుసులపల్లి శివారులోని కోతకు వచ్చిన వరిపొలంలోని వడ్లు రాలిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కలేదని, మరో వారం రోజుల్లో కోతకోద్దామనుకుంటున్న సమయంలో అకాలవర్షం తమను ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు, బాధితులు కోరుతున్నారు.
అయోమయంలో అన్నదాత
కొల్చారం: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ఈ ప్రాంత అన్నదాతలు అయోమయంలో పడ్డారు. సాయంత్రం 5గంటలకు చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం పెద్దదిగా మారడంతో రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలా మేరకు తడిసింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.