అకాల వర్షం...
పెదకూరపాడు : అకాల వర్షం మిరప, పత్తి రైతులను నష్టాలపాల్జేసింది. పంట చేతికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో శుక్రవారం ఉదయం లగడపాడు, కన్నెగండ్ల, హుస్సేన్‌నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం గ్రామాల్లో కురిసిన వర్షానికి పొలం మీద, కల్లాల్లో ఉన్న మిరప కాయలు, చేలల్లో విరగకాసిన పత్తి పూర్తిగా తడిసిపోయాయి.
లగడపాడు, హుస్సేన్ నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం, రామా పురంలో మొదటి విడత మిరప కోతలు 10 రోజుల కిందట ప్రారంభమ య్యాయి. కాయలు కోసిన రైతులు కల్లాలకు చేర్చి ఆరబెడుతున్నారు. శుక్ర వారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న పంట పూర్తిగా తడిసి నీళ్లల్లో తేలియాడింది.
చేలల్లో పత్తి కూడా పూర్తిగా తడిసిపోయి నేల రాలుతోంది. పత్తి, మిరప పనులకు వెళ్లిన కూలీలు వర్షం కారణంగా వెనుదిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
ప్రస్తుతం మిరప పంట పూర్తిగా కాయ, పూత దశలోఉంది. వర్షం పడడంతో చేలల్లోనే నేలరాలాయి. కాయలు తాలుగా మారే ప్రమాదం ఉంది. మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కోతలు కోసిన వరి పంట కూడా తడిసిపోయింది. చేలల్లో పొట్టదశలో ఉన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది.
లబోదిబోమంటున్న అన్నదాతలు
నకరికల్లు: అకాల వర్షంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం వర్షం కురిసింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కురిసిన వర్షంతో పంట నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చల్లగుండ్ల, నకరికల్లు, నర్సింగపాడు, దేచవరం, చేజర్ల తదితర గ్రామాల్లో వరికోతలు కోసి ఓదెలను ఆరబెడుతున్నారు. ఈ సమయంలో కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఓదెలను కుప్పలుగా వేసి పట్టలు కప్పారు.