సాక్షి, హైదరాబాద్: గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకిన పత్తికి బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి విన్నవిం చింది. దీనికి అనుగుణంగా పంటల బీమా పథకంలో సమూల మార్పులు చేయాలని విన్నవించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) అమలు మార్గదర్శక ముసాయిదాపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి రెండ్రోజుల కిందట నివేదిక పంపింది. అందు లో కీలకంగా పత్తి రైతులను ఆదుకునేలా బీమా పథకాన్ని సమూలంగా మార్చాలని సూచించింది. పీఎంఎఫ్‌బీవై, ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను కలిపి కొత్తగా మరో పథకాన్ని తీసుకురావాలని పేర్కొంది. తెలంగాణలో పత్తి కీలకమైన పంటని, ఏటా దాని విస్తీర్ణం పెరుగుతోందని, అయితే గులాబీ పురుగుతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించింది. తెలంగాణలో పత్తి పంటను ఆర్‌డబ్ల్యూబీసీఐ ఎస్ పథకం పరిధిలో ఉంచారు. దానికి అను గుణంగానే పరిహారం చెల్లిస్తున్నారు. అయితే గులాబీ పురుగు సోకితే అది ఆర్‌డబ్ల్యూబీసీఐ ఎస్ పథకం కిందికి రాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపో తారని, ఈ నేపథ్యంలో గులాబీ పురుగు సోకి న నేపథ్యంలో దిగుబడి, వాతావరణం రెండింటినీ లెక్కలోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ కేంద్రాన్ని కోరింది.
2 కోట్ల క్వింటాళ్లకు పడిపోయిన పత్తి దిగుబడి?
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈ ఖరీఫ్‌లో 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టిందని అంచనా. దీంతో పురుగు సోకిన పంటంతా సర్వనాశనమైంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక అంచనాలు రూపొందించలేదు. కానీ కేంద్రానికి పంపిన నివేదికలో మాత్రం ఉధృతంగా గులాబీ పురుగు సోకిందని, ఆ ప్రకారం నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గులాబీ పురుగు, ఇతరత్రా కారణాలతో 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని ఆ తర్వాత పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు 88.03 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే రైతులు విక్రయించారు. ఇది కోటి క్వింటాళ్ల వరకు చేరుకుంటుందని అనుకున్నా భారీ తేడా కనిపిస్తోంది. మొదటి అంచనా ప్రకారం చూస్తే ఏకంగా 2 కోట్ల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి పడిపోయే అవకాశముందని చెబుతున్నారు. సాధారణంగా ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాలి. గులాబీ పురుగు కారణంగా అనేక చోట్ల 6–7 క్వింటాళ్లకు మించిలేదంటున్నారు. ఇంత నష్టం జరిగినా రైతుకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది.
పీఎంఎఫ్‌బీవైలో మార్పులపై రాష్ట్రం చేసిన మరికొన్ని సూచనలివీ..
- బీమా చేసిన ఆయా పంటలకు ప్రస్తుతం 70%, 80%, 90% నష్టపరిహారం ఇస్తున్నారు. మున్ముందు అన్నింటికీ 90% నష్టపరిహారం ఇవ్వాలి.
- రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేయాలి.
- ప్రస్తుతం ప్రీమియం చెల్లించే గడువు ఖరీఫ్ పంటలకు జూలై వరకు, రబీ పంటలకు డిసెంబర్ వరకు ఉంది. ఇది సమంజసంగా లేదు. స్థానిక పంట కేలండర్ ప్రకారం రాష్ట్రాలే గడువు తేదీలను ఖరారు చేసుకునే అవకాశం ఇవ్వాలి.
- బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటా భారీగా పెంచుతున్నాయి. ఈ పద్ధతి మార్చాలి.
- పంటల బీమాను అమలు చేసే కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడంలేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటంలేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడు వారాల్లోగా రైతులకు పరిహారాన్ని ఖరారు చేయాలి. ప్రస్తుతం నెలల తరబడి ఆలస్యం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- రైతుల ఫిర్యాదులను వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెలకొల్పాలి.
- రైతులు చెల్లించిన ప్రీమియం సొమ్మును బ్యాంకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీమా కంపెనీలకు బదిలీ చేయాలి.
- వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా రైతులు బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment