
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ సేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. దేశంలో 2.3 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి రాగా.. రాష్ట్రంలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే అందుబాటులోకి వచ్చింది. శనివారం విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలో కేంద్ర వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశంలో వ్యవసాయ రంగాలకు చెందిన అన్ని అంశాలపై సమగ్ర విశ్లేషణ చేసింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 35.31 లక్షల ఎకరాల్లో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నారు. గుజరాత్‌లో 28.45 లక్షల ఎకరాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 7.1 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం చేస్తున్నారు.
భూసార కార్డుల్లోనూ అంతంతే!
భూసార కార్డుల జారీలోనూ రాష్ట్రంలో పెద్దగా పురోగతి లేదు. భూసార కార్డుల రెండో దశకు సంబంధించి 5.17 లక్షల మట్టి నమూనాలను తీయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. 4.87 లక్షల నమూనాలను సేకరించారు. 3.45 లక్షల నమూనాలను పరీక్షించారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేవలం లక్ష భూసార కార్డులను మాత్రమే రైతులకు అందజేసినట్లు కేంద్ర నివేదిక తెలిపింది.
- దేశంలో వరి ఉత్పాదకత ఏటా పెరుగుతోంది. 1950– 51లో హెక్టారుకు వరి ఉత్పాదకత 6.68 క్వింటాళ్లుంటే, 2016–17 నాటికి 25.5 లక్షలకు చేరుకుంది.
- వంట నూనెల తలసరి అందుబాటు 1980–81లో 3.8 కిలోలుంటే, 2015–16లో 17.7 కిలోలకు పెరిగింది. పంచదార తలసరి అందుబాటు 1980–81లో 7.3 కిలోలైతే, 2015–16లో 19.4 కిలోలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment