కౌలు రైతుల పిల్లలపై చిన్నచూపు | Underestimate on the leased farmers children | Sakshi

కౌలు రైతుల పిల్లలపై చిన్నచూపు

Mar 10 2018 2:29 AM | Updated on Jun 4 2019 5:04 PM

Underestimate on the leased farmers children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ విద్యలో కౌలు రైతుల పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కనీసం ఎకరా భూమి, లేదా అంతకుమించి ఉన్న రైతుల పిల్లలకే వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 40 శాతం సీట్లు లభించేలా వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 3 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతుల పిల్లలకే ఆ కోటా ప్రకారం సీట్లు లభించేవి. దాన్ని సవరించి తాజా నిబంధన తీసుకువచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు పంపిన ప్రతిపాదన మేరకు ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల వల్ల ఎకరా లోపు భూమి ఉన్న రైతుల పిల్లలకు, కౌలు రైతుల పిల్లలకు వ్యవసాయ విద్యలో అవకాశం లభించదు. 

రైతు కూలీలకూ అంతే.. 
రైతు కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 40 శాతం కోటాను జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అమలు చేస్తోంది. గ్రామాల్లో కనీసం 4 ఏళ్లు చదివిన వారు, నిర్ణీత భూమి ఉన్న వారికి ఈ కోటాను అమలు చేస్తోంది. అయితే తాజా నిబంధన ప్రకారం గ్రామాల్లో ఎకరం లోపున్న సన్నకారు రైతుల పిల్లలకు రైతు కోటా సీటు లభించదు. భూమి లేకున్నా వ్యవసాయ కార్మికులుగా పని చేస్తున్న వారికి, కౌలుకు తీసుకుని ఏళ్ల తరబడి సాగు చేస్తున్న వారి పిల్లలకూ రైతు కోటా కింద సీటు దక్కదు.  

ఎందుకివ్వరు? 
కౌలు రైతులు, ఎకరా లోపు భూమి ఉన్న రైతులు, రైతు కూలీల కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు వ్యవసాయ విద్యలో కోటా సీటు ఎందుకు ఇవ్వడం లేదో అంతుబట్టడంలేదు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది వరకు ఉన్నారు. ఆ ప్రకారం ఏకంగా 30 లక్షల మంది రైతుల పిల్లలు ఎవరైనా వ్యవసాయ కోర్సుల్లో రైతు కోటా కింద సీటు కోల్పోయే పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లు అనేవి అత్యంత అణగారిన వర్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారిని వదిలేయడంలో అర్థం ఏమిటో తెలియడంలేదు. గతంలో 3 ఎకరాల పరిమితిని ఎకరానికి పరిమితం చేయడంలోనే తామెంతో మేలు చేశామన్న భావన వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్గాల్లో నెలకొందన్న ఆరోపణలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement