micro irrigation
-
సూక్ష్మ సేద్యం అమల్లో ఏపీకి ఆరో స్థానం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు చేస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా స్పష్టమైంది. గత ఐదేళ్లలో సూక్ష్మ సేద్యం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా ఏపీలో ఐదేళ్లలో 2,73,888 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది. సూక్ష్మ సేద్యం కింద డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలతో నీటి వినియోగ సామరŠాధ్యన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించింది. ఈ పథకంపై నీతి ఆయోగ్ అధ్యయనం నిర్వహించిందని, జాతీయ ప్రాధాన్యతలను సాధించడంలో ఈ పథకం కీలకమని పేర్కొందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, పంట ఉత్పాదనను, ఉత్పత్తిని పెంచుకుని, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని నీతి ఆయోగ్ ప్రశంసించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ద్వారా 2023లో ఏపీతో సహా దేశంలోని 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం మైక్రో ఇరిగేషన్ కవరేజీపై అధ్యయనం చేసిందని పేర్కొంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫార్సులు చేసిందని తెలిపింది. నీటి కొరత, నీటి ఒత్తిడి, క్లిష్టమైన పరిస్థితుల్లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. తద్వారా భూగర్భ నీటిని సంరక్షించడానికి సూక్ష్మ సేద్యాన్ని మరింత ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) సూక్ష్మ సేద్యంలో కర్ణాటక 13.30 లక్షల హెక్టార్లలో తొలి స్థానంలో ఉండగా ఆ తరువాత తమిళనాడు 7.79 లక్షల హెక్టార్లు, రాజస్థాన్ 6.16 లక్షల హెక్టార్లు, ఒడిశా 5.91 లక్షల హెక్టార్లు, గుజరాత్ 5.24 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్ 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం విస్తరించినట్లు వివరించింది. -
చిన్న రైతులకు గుడ్ న్యూస్ ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్
-
సూక్ష్మ సేద్యం.. సిఫార్సుల్లేకుండా సాధ్యం
సాక్షి, అమరావతి: బిందు, తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగునీటి సౌకర్యం లేనిచోట్ల మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ప్రతి నీటి బొట్టును రైతులు వినియోగించేకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లలో 5.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించగా.. ఈ ఏడాది మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలు అమర్చారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హతే కొలమానంగా.. అడిగిన ప్రతి రైతుకూ పరికరాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించి సూక్ష్మసేద్యం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019–20లో రూ.720 కోట్లు వెచ్చింది 3.05 లక్షల ఎకరాల్లో విస్తరించగా.. 1,03,453 మంది లబ్ధి పొందారు. కరోనా వల్ల రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. 2022–23 నుంచి మళ్లీ ప్రారంభించి.. ఆ ఏడాది రూ.636 కోట్ల ఖర్చుతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. 2023–24లో రూ.902.56 కోట్ల అంచనాతో మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఎకరాలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలలో 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సిఫార్సులతో పని లేకుండా ఆర్బీకేలో నమోదు చేస్తే చాలు అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు పరికరాలు అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి మరీ పరికరాలు అమరుస్తున్నారు. ఆర్బీకేల్లో 2.02 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ 2023–24లో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 5,79,517 ఎకరాలు బిందు తుంపర పరికరాల కోసం 2.02 లక్షల మంది రైతులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాలను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం సిబ్బంది, కంపెనీల ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. 2.75 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు కంపెనీలు బీఓక్యూను జనరేట్ చేయగా.. 1.56 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో పరికరాలను బిగించారు. సీఎంకు రుణపడి ఉంటాం నేను 4.14 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. తుంపర సేద్య పరికరాల కోసం ఆర్బీకేలో దరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సు చేయలేదు. నాకు కావాల్సిన పరికరాలు మా పొలానికి తీసుకొచ్చి అమర్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – టి.పాపయ్య, ఎర్రవారిపాలెం, తిరుపతి జిల్లా దిగుబడులు పెరుగుతాయి ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. పైపులు, స్ప్రింక్లర్లు కోసం దరఖాస్తు చేశా. 15 రోజుల్లో తీసుకొచ్చి అమర్చారు. వీటిద్వారా నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఏర్పడటంతో కాయ నాణ్యత పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. – ముళ్లమూరి బాలకృష్ణ,కలువాయి, నెల్లూరు జిల్లా అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక జరుగుతోంది. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ధేశించినప్పటికీ అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ప్రాధాన్యత ఇస్తున్నాం. జనవరి నాటికి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకెళ్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మసాగునీటి పథకం -
ఏపీలో సూక్ష్మ సేద్యం భేష్
-
ఏపీలో సూక్ష్మ సేద్యం భేష్
సాక్షి, అమరావతి: నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచి, రైతులకు అధిక లాభాలనిచ్చే సూక్ష్మ సేద్యం విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం వేగంగా విస్తరిస్తూ దేశంలో నాలుగో స్థానానికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో రైతులు కుదేలైపోయారు. సూక్ష్మ సేద్యం చేసే చిన్న, సన్నకారు రైతులు మరింత దయనీయ స్థితిలోకి వెళ్లారు. పైగా, బిందు, తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.969.40 కోట్లు ఎగ్గొట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వ్యవసాయ రంగం అభివృద్ధిపై దృష్టి సారించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదేలైపోయిన సూక్ష్మ సేద్యాన్ని తిరిగి గాడిలో పెట్టారు. బిందు, తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ. 969.40 కోట్లను చెల్లించారు. పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై తుంపర, బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరికరాలపై జీఎస్టీ భారం రైతులపై పడకుండా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా జీఎస్టీని వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. దీంతో సూక్ష్మ సేద్యం రాష్ట్రంలో ఊపందుకొని, ఇప్పుడు 9.10 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దేశంలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తర్వాత నాలుగో స్థానాన్ని పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మంగళవారం పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం కింద దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లో 10.96 శాతం మేర సూక్ష్మ సేద్యం సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 9.10 లక్షల హెక్టార్లలో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక తొలి స్థానంలో, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. డ్రిప్, స్ప్రింక్లర్ వినియోగం ద్వారా సూక్ష్మ సేద్యాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని, నీటి వినియోగం సామరŠాద్యన్ని పెంచుతోందన్నారు. సూక్ష్మ సేద్యం చేసే చిన్న, సన్న కారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాలు అదనపు ఆర్థిక సాయాన్ని ఈ రైతులకు అందిస్తున్నాయన్నారు. సూక్ష్మ సేద్యం విస్తరణకు, ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు తీసుకునే రుణాలపై 3 శాతం మేర వడ్డీ రాయితీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. పీడీఎంసీ కింద దేశంలో మొత్తం 83.06 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఖర్చును తగ్గించే ప్రభావవంతమైన శాస్త్రీయ సాంకేతికలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) అభివృద్ది చేసిందని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, రీసైక్లింగ్, నీటి బహుళ వినియోగం వంటి స్మార్ట్ సాంకేతికలను అభివృద్ది చేసిందన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో వ్యవసాయ నీటి వినియోగ సామర్ధ్యం మెరుపడుతుందని, పంట ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా నీటి ఆదాతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుందని, అలాగే కూలీలు, ఇతర వ్యయం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని మంత్రి చెప్పారు. -
బకాయిలు చెల్లించినా బాధేనా?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యంలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సైతం పొందింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా కృషి చేస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఆరోపణ: సూక్ష్మ సేద్యానికి తూట్లు.. వాస్తవం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సాగు నీటి పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నీటి బొట్టును రైతులు సద్వినియోగం చేసుకునేలా బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు సేద్యాన్ని, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యాన్ని చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు ఇందుకు అనువైనవిగా గుర్తించారు. ఈ మేరకు దశల వారీగా విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆరోపణ: మూడేళ్లుగా నిలిపేసిన పథకం.. వాస్తవం: 2019–20లో రూ.720.08 కోట్లు ఖర్చు చేసి 3,04,705 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడంతో 1,03,453 మంది లబ్ధి పొందారు. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఈ పథకం విస్తరణ జరగలేదు. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.636 కోట్లతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.465 కోట్లు సర్దుబాటు చేయగా రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించారు. 2023–24లో రూ.902 కోట్ల అంచనాతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటివరకు రూ.218.38 కోట్లు వెచ్చించి 71,690 ఎకరాల్లో విస్తరించగా 26,051 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాంటప్పుడు పథకాన్ని ఎక్కడ నిలిపివేశారో రామోజీకే తెలియాలి. ఆరోపణ: ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష.. వాస్తవం: సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఎందుకు వివక్ష చూపుతుంది? 2019–20లో 1,03,453 లబ్ధి పొందితే వారిలో 8,525 మంది ఎస్సీలు, 3,583 మంది ఎస్టీలున్నారు. 2022–23లో 82,833 మంది లబ్ధి పొందితే వారిలో 3,241 మంది ఎస్సీలు, 1,889 మంది ఎస్టీలున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 26,498 మంది లబ్ధి పొందగా వారిలో 1,015 మంది ఎస్సీలు, 503 మంది ఎస్టీలున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు చెందిన 46,497 ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు రూ.131.52 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆరోపణ: పన్నుల భారం రైతులపైనేనా? వాస్తవం: తుంపర, బిందు సేద్యం పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తుండగా రైతులపై భారాన్ని తగ్గించేందుకు 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఒక్క 2022–23లోనే రూ.47 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది. ఆరోపణ: రాయితీలలో కోత వాస్తవం: సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలను అందజేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటా కేవలం 33 శాతం మాత్రమే. మిగిలిన 57 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోపణ: సిఫార్సులున్న వారికే పరికరాలు? వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులుంటేనే బిందు, తుంపర సేద్యం పరికరాలు అమర్చేవారు. ఇప్పుడు ఆర్బీకేలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు అర్హతే కొలమానంగా ప్రతి రైతుకు ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చుతున్నారు. ఏపీ ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక జరుగుతోంది. అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీల కింద ప్రదర్శిస్తున్నారు. ఆరోపణ: సూక్ష్మ సేద్యంపై అవగాహన ఏది? వాస్తవం: బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేలు, ఆర్బీకే ఛానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 5 వేల టన్నుల ఎరువులు, 1,553 టన్నుల విద్యుత్, 15 టీఎంసీల నీరు ఆదా కాగా రైతులకు రూ.210 కోట్ల మేరకు కూలీల ఖర్చు మిగిలింది. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించింది ఎవరు? టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన బకాయిలు సూక్ష్మ సేద్యం పథకానికి గుదిబండలా మారాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం జగన్ ఆ బకాయిలను చెల్లించి అన్నదాతలకు బాసటగా నిలిచారు. చంద్రబాబు చెల్లించకుండా చేతులెత్తేసిన రూ.969.40 కోట్ల బకాయిలను అణా పైసలతో సహా ఆయా కంపెనీలకు సీఎం జగన్ ప్రభుత్వం చెల్లించింది. తద్వారా రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం విస్తరణకు మార్గం సుగమం చేశారు. ఇంత భారీగా బకాయిలు పెట్టిన చంద్రబాబు సర్కారుపై రామోజీ కలం కదల్లేదు ఎందుకో మరి? -
‘సూక్ష్మ’సాగే బాగు
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) రైతన్నలకు ఎంతో లాభదాయకమని నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ నాబ్కాన్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అవసరమైన చోట్ల మాత్రమే మొక్కలకు నీరు అందడం వల్ల కలుపు, చీడపీడల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. సూక్ష్మ సేద్యం ద్వారా కేవలం నీరు మాత్రమే కాకుండా విద్యుత్తు, కూలీల వ్యయంలో పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. తద్వారా అన్నదాతలకు సాగు వ్యయం, అనవసర ఖర్చులు తగ్గిపోయి అదనపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ అధ్యయనంతో తేలిందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం విధానంలో హెక్టార్‌కు గంటకు 1,553 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ఆదా అవుతుందని నాబ్కాన్స్ నివేదిక తెలిపింది. హెక్టార్‌కు 52 పనిదినాల కూలీల వ్యయం తగ్గుతుంది. రోజు కూలీ రూ.245 చొప్పున ఆదా అవుతుంది. హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుండగా అదనపు ఆదాయం రూ.1,15,000 సమకూరుతుంది. సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు రైతులకు బహుళ ప్రయోజనాలను అందించే కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎం కేఎస్‌వై) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనుసరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది 75,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 60,500 హెక్టార్లకుపైగా ఈ పరిధిలోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరో 2,38,070 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 2.02 లక్షల రైతులు నమోదు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో 70 శాతం సూక్ష్మ సేద్యం చేయడం ద్వారా ఎంత మేరకు నీరు, విద్యుత్, కూలీల వ్యయం తగ్గుతుంది? సాగు ఖర్చులు ఎంత తగ్గుతాయి? రైతులకు అదనపు ఆదాయం ఎంత లభిస్తుందనే అంశాలపై నాబ్కాన్స్ గణాంకాలు రూపొందించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నీటి కొరతను అధిగమించేందుకు సూక్ష్మ సేద్యాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని నాబ్కాన్స్ నివేదిక సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉందని వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లోనూ సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
సూక్ష్మ సేద్యం చకచకా.. అర్హులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాలను పొందేందుకు రైతులు ఆర్బీకేల ద్వారా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతోపాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 3.75 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1,395 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 90 శాతం సబ్సిడీపై పరికరాలు ఈ ప్రాజెక్టు కింద ఐదెకరాల్లోపు విస్తీర్ణం గల చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5నుంచి 12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాల కోసం 1.19 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇప్పటివరకు 2.16 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. 1.30 లక్షల ఎకరాలకు సంబంధించి 49,597 మంది రైతులు తమ వాటా చెల్లించారు. 46,174 మంది రైతులకు చెందిన 1.26 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 42,211 మంది రైతులకు చెందిన 1.16 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. ఈ నెలాఖరులోగా మరో లక్ష ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాలను అమర్చనున్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మసేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక చేస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఎంతమందికి అర్హత ఉన్నా మంజూరు చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరికకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
అన్నదాతపై జీఎస్టీ పిడుగు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భూతం సూక్ష్మసేద్యానికి విఘాతం కలిగిస్తోంది. వివిధ పంటల కోసం వ్యవసాయ భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలను ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు 12 శాతం జీఎస్టీ భరించాల్సిరావడమే దీనికి కారణం. సూక్ష్మసేద్యం కోసం ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే జీఎస్టీ సొమ్ము చెల్లించలేక రైతులు వెనుకడుగు వేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకుపైగానే ఖర్చుకానుంది. కానీ, జీఎస్టీ భారాన్ని మాత్రం ఆ వర్గాల రైతులు భరించాల్సి వస్తోంది. అంటే ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు అన్నివర్గాలూ జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తోంది. నాలుగెకరాల్లో సూక్ష్మసేద్యం నెలకొల్పాలంటే రూ. 12–16 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు వేల రూపాయలు ఖర్చయ్యే సూక్ష్మసేద్యం పరికరాలను ఉచితంగా బిగిస్తున్నా, జీఎస్టీని మాత్రం ఆయా రైతులు భరించాల్సి వస్తోంది. సూక్ష్మసేద్యంతో నీటి ఆదా...: సూక్ష్మసేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నందున ఈ ఏడాది కూడా పెద్దమొత్తంలో రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా రాష్ట్రంలో 43 శాతం(25 టీఎంసీల) నీటిని పొదుపు చేశారు. వివిధ రకాల పంటల సాగును నూతన పద్ధతుల ద్వారా ప్రోత్సహించారు. ఈ పథకాన్ని పంటల సాగుకు వాడటంతో 33 శాతం విద్యుత్ అంటే 1,703 లక్షల యూనిట్లు ఆదా అయినట్లేనని న్యాబ్కాన్స్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. మైక్రో ఇరిగేషన్ అమలు వల్ల 52 శాతం దిగుబడి పెరిగినట్లు గుర్తించారు. ఎందుకంటే మొక్కకు అవసరమైన నీరు నేరుగా సూక్ష్మసేద్యం పైపుల ద్వారా వెళుతుంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అందించిన పరికరాల ద్వారా ఏడేళ్ల వరకు లబ్ధిపొందవచ్చు. అందుకే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గత లెక్కల ప్రకారం చూస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో కేవలం 5 లక్షల ఎకరాల్లోపే ఉందని అంచనా. ఆయిల్‌పాం సాగుకు దెబ్బ ప్రస్తుతం 55 వేల ఎకరాలకే పరిమితమైన ఆయిల్‌పాం విస్తీర్ణాన్ని రానున్న రోజుల్లో 20 లక్షల ఎకరాలకుపైగా విస్తరించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్దేశించింది. ఆయిల్‌పాం సాగులో సూక్ష్మసేద్యం పరికరాలే కీలకపాత్ర పోషిస్తాయి. కానీ, సూక్ష్మసేద్యం ఏర్పాటులో జీఎస్టీ భారం వల్ల అనేకచోట్ల రైతులు వెనకడుగు వేస్తున్నారు. సూక్ష్మసేద్యం మంజూరైన చోట్ల కూడా రైతులు జీఎస్టీ భారం భరించలేక, ఆ సొమ్ము చెల్లించకపోవడంతో అవి నిలిచిపోయాయి. రైతులకు భారం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే కంపెనీలైనా ఆ భారాన్ని భరించాలని పలువురు కోరుతున్నారు. ఇదీ చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
AP: సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది. నిజానికి.. ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని, ఆయినా సరే నీటిని ఆదాచేసే మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని వినియోగించడంలో ఇవి బాగా వెనుకబడి ఉన్నట్లు నివేదిక వ్యాఖ్యానించింది. అయితే, ఇక్కడ వరి సాగు ఎక్కువగా ఉండటం కూడా మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని వివరించింది. సూక్ష్మ సేద్యంలో వరిసాగుపై పరిశోధనలు మరోవైపు.. వరి సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నాబార్డు నివేదిక తెలిపింది. సూక్ష్మ సేద్యంలో నీటి ఆదాతో పాటు పంటల ఉత్పాదకత బాగా పెరుగుతుందని.. అలాగే, విద్యుత్, కూలీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని పలు సర్వేల్లో వెల్లడైందని అందులో ప్రస్తావించింది. నీరు ఆదా కావడమే కాకుండా ఉత్పాదకత గణనీయంగా పెరిగినట్లు ఈ తరహా సాగు చేస్తున్న 60 శాతం రైతులు వెల్లడించారని నివేదిక పేర్కొంది. ప్రధానంగా అరటి, వేరుశనగ, పత్తి పంటల సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలిందని వివరించింది. -
లాభసాటిగా సూక్ష్మసేద్యం
సాక్షి, అమరావతి: రైతన్నకు ఇటు సాగు ఖర్చుల్లో ఆదాతోపాటు అటు అదనంగా ఆదాయం సమకూరే సూక్ష్మ సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఏటా భారీగా నిధులు కేటాయిస్తూ రాయితీపై రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలను అందజేస్తోంది. గత సర్కారు పెట్టిన బకాయిలను సైతం చెల్లించింది. మైక్రో ఇరిగేషన్ పరికరాల సరఫరాదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించి టెండర్లు కూడా పిలవడంతో ఏప్రిల్‌లో పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ఏడాది అదనంగా లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యంతో అన్నదాతకు అన్ని విధాలా లాభమే. విలువైన ఎరువులు మొక్కకు నేరుగా అందడంతోపాటు నీటివృథా లేనందున కలుపు మొక్కల సమస్యకు ఇది విరుగుడు. మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మసేద్యం)తో సాగువ్యయం తక్కువ కావడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది అదనంగా 1.50 లక్షల హెక్టార్లను మెక్రో ఇరిగేషన్ పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం రూ.1,190.11 కోట్లు వ్యయం చేయనుంది. ఇందులో రూ.961.86 కోట్లను ప్రభుత్వం సబ్సిడీ కింద భరించి సూక్ష్మ సేద్యం పరికరాలను రైతులకు రాయితీపై అందజేస్తుంది. రైతులు తమ వాటాగా రూ.228.25 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. టాప్ పదిలో అనంత, కడప.. ప్రస్తుతం రాష్ట్రంలో 13.41 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కింద సాగులో ఉంది. దీనికి అదనంగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 1.50 లక్షల హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. రాయలసీమతో పాటు నీటి ఎద్దడి ఉండే జిల్లాల్లో రైతులు డ్రిప్ ఇరిగేషన్ కింద పంటలు సాగు చేస్తున్నారు. 2019–20లో మైక్రో ఇరిగేషన్ సాగు విస్తీర్ణంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. మైక్రో ఇరిగేషన్లో దేశంలో పది జిల్లాలు అగ్రస్థానంలో ఉండగా రాష్ట్రం నుంచి అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడి తగ్గి అదనపు ఆదాయం రైతులకు సబ్సిడీ కల్పించడం ద్వారా మైక్రో ఇరిగేషన్ సాగు విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూక్ష్మ సేద్యంతో పెద్ద ఎత్తున నీటి ఆదాతో పాటు విద్యుత్, ఎరువులు వినియోగం భారీగా తగ్గనుంది. మైక్రో ఇరిగేషన్ విధానంలో సాగు చేయడం ద్వారా హెక్టార్‌కు రూ.21,500 పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు హెక్టార్‌కు అదనంగా రూ.1,15,000 చొప్పున ఆదాయం లభిస్తుందని సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక 2022–23లో కొత్తగా 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని విస్తరించేందుకు రూ.1,190.11 కోట్లతో కార్యాచరణ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యంపై అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. మరింత మెరుగ్గా రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా త్వరలో ఉన్నతాధికారుల సమావేశంలో విధివిధానాలను ఖరారు చేస్తాం. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పటికే ప్రతి ఆర్బీకేకి లాగిన్ ఐడీ ఇచ్చాం. ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు వంద శాతం గ్రౌండింగ్ చేసేందుకు కృషి చేస్తాం – డాక్టర్ సీబీ హరనాథరెడ్డి, రాష్ట్ర సూక్ష్మ సాగునీటి పథకం పీవో -
హార్టికల్చర్, సెరీ కల్చర్, మైక్రో ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష
-
అగ్రికల్చర్ విద్యార్థులు ఆర్బీకేల్లో నెల రోజులు పని చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలి. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని’’ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలులో ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి ‘‘కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి. నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి. టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు. దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిల్చిందని అధికారులు తెలిపారు. మిరప పంట విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్నారు. పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం జగన్ అదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కొబ్బరికి మంచి ధర వచ్చేలా చూడాలి కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని.. కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్ ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని.. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని తెలిపారు. దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితోపాటు ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం.. వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ‘‘రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలి. దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది.. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలి. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి. దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయని’’ సీఎం జగన్ తెలిపారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సిహించాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యానపంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులను మోటివేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2020–21లో ఈ విధంగా 1 లక్షా 42వేల 565 ఎకరాల్లో అదనంగా ఉద్యానపంటలు సాగు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ యేడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు అధికారులు. పువ్వుల (ప్లోరీకల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, వాటి ప్రాసెసింగ్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్ష ‘‘తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. రివర్స్ టెండరింగ్‌కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయి. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి’’ అన్నారు సీఎం జగన్. సెరికల్చర్ సాగు– ప్రోత్సాహం సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. పట్టుగూళ్ల విక్రయాల్లో ఇ– ఆక్షన్ విధానం తీసుకొచ్చామని తెలిపారు అధికారులు. దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలుచేస్తున్నారని, రైతులకు ధరలు వస్తున్నాయని తెలిపారు. 1250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టుపురుగులు పెంచుతున్న రైతులు ఉన్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. సెరికల్చర్ సాగు ప్రోత్సాహకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. రైతులకు షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.. తద్వారా చిన్న రైతులను సెరికల్చర్ సాగులో ప్రోత్సహించినట్టవుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి శేఖర్ బాబు, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీధర్‌రెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీఓ డాక్టర్ హరినాథ్ రెడ్డి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి జానకిరామ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వైఎస్సార్ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ఏం చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)పద్ధతిలో ఉండాలని, కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవçస్థలో అవినీతి ఉండకూడదని, చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనపై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండర్లతో ధరలు తగ్గి ఎక్కువ మందికి మేలు.. రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల సదుపాయాలను కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఒక అవగాహన వస్తుందన్నారు. సెరి కల్చర్‌పై ప్రత్యేక దృష్టి మల్బరీ సాగు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మల్బరీ సాగు చేసే రైతుల పరిస్థితులను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మల్టీ పర్పస్ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు అగ్రి ఇన్ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు ఉంటాయని, ఇందుకు దాదాపు రూ.14,562 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్ర పరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ – మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు తదితరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. – సమీక్షలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
యురేనియం గ్రామాలకు మహర్దశ
సాక్షి, వేముల: యురేనియం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇక్కడ సూక్ష్మ సేద్యం అమలు చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. దీంతో జైన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం యురేనియం గ్రామాలలో పర్యటించారు.కాగా మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధిచేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. టైలింగ్ పాండ్ నిర్మాణంలో యూసీఐఎల్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని బాధితుల ఆరోపణ.. టైలింగ్‌పాండ్ వ్యర్థాలతో యురేనియం కాలుష్యం వెలువడుతోంది. వ్యవసాయ బోర్లలోని నీరు కలుషితం అవుతున్నాయి. దీంతో సాగులో ఉన్న అరటి, వేరుశనగ పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అంతేకాక చర్మ వ్యాధులు సోకుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాధిత రైతులు యూసీఐఎల్ తీరుకు నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. గ్రామాల్లో పర్యటించిన జైన్ కంపెనీ బృందం : మండలంలోని తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కె.కె.కొట్టాల, వేల్పుల గ్రామాల్లో జైన్ కంపెనీ బృందం పర్యటించింది. జైన్ ప్రాజెక్టు ఇంజినీర్లు సుదన్షు, కృష్ణ, నీటిపారుదల శాఖ జేఈలు వాసుదేవారెడ్డి, ప్రదీప్‌రెడ్డి సూక్ష్మ సేద్యం అమలుపై పరిశీలించారు. ఈ గ్రామాలలో సుమారు 10వేల ఎకరాలకుపైనే సూక్ష్మ సేద్యం అమలు చేయనున్నారు. ఇందుకోసం రోజుకు ఎంత నీరు అవసరమవుతుంది.. 200ఎకరాలకు ఒక సంప్ నిర్మించాలా, 500ఎకరాలకు,.. 2వేల ఎకరాలకు ఒక్కో సంప్ నిర్మించాలా అనే దానిపై సర్వే చేసినట్లు జేఈ వాసుదేవారెడ్డి తెలిపారు. మబ్బుచింతలపల్లెలో భూములను పరిశీలిస్తున్న జైన్ కంపెనీ బృందం, నీటిపారుదల శాఖ అధికారులు సూక్ష్మ సేద్యం అమలుకు చర్యలు.. : యురేనియం గ్రామాల్లో సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ బోర్లతో నిమిత్తం లేకుండా సంప్ల ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక టీఎంసీ సామర్థ్యంతో గిడ్డంగివారిపల్లె సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. టైలింగ్ పాండ్ వ్యర్థ జలాలు కలుషితం కావడంతో వ్యవసాయం దెబ్బతింది. దీంతో సీఎం వైఎస్ జగన్ యురేనియం గ్రామాలకు పార్నపల్లె నీటిని పైపులైన్ ద్వారా తీసుకొచ్చి రిజర్వాయర్‌కు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలతో అధికారుల సర్వే చేస్తున్నారు. -
సూక్ష్మ సేద్యంలో వెనుకబాటే!
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ సేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. దేశంలో 2.3 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి రాగా.. రాష్ట్రంలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే అందుబాటులోకి వచ్చింది. శనివారం విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలో కేంద్ర వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశంలో వ్యవసాయ రంగాలకు చెందిన అన్ని అంశాలపై సమగ్ర విశ్లేషణ చేసింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 35.31 లక్షల ఎకరాల్లో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నారు. గుజరాత్లో 28.45 లక్షల ఎకరాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 7.1 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం చేస్తున్నారు. భూసార కార్డుల్లోనూ అంతంతే! భూసార కార్డుల జారీలోనూ రాష్ట్రంలో పెద్దగా పురోగతి లేదు. భూసార కార్డుల రెండో దశకు సంబంధించి 5.17 లక్షల మట్టి నమూనాలను తీయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. 4.87 లక్షల నమూనాలను సేకరించారు. 3.45 లక్షల నమూనాలను పరీక్షించారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేవలం లక్ష భూసార కార్డులను మాత్రమే రైతులకు అందజేసినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. - దేశంలో వరి ఉత్పాదకత ఏటా పెరుగుతోంది. 1950– 51లో హెక్టారుకు వరి ఉత్పాదకత 6.68 క్వింటాళ్లుంటే, 2016–17 నాటికి 25.5 లక్షలకు చేరుకుంది. - వంట నూనెల తలసరి అందుబాటు 1980–81లో 3.8 కిలోలుంటే, 2015–16లో 17.7 కిలోలకు పెరిగింది. పంచదార తలసరి అందుబాటు 1980–81లో 7.3 కిలోలైతే, 2015–16లో 19.4 కిలోలకు చేరింది. -
సూక్ష్మసేద్యంపై తగ్గని జీఎస్టీ
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యం పరికరాలపై జీఎస్టీ తగ్గకపోవడం రైతులను నిరాశపర్చింది. 18 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సడలించకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర రైతాంగంపై పడనుంది. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించిన సంగతి తెలిసిందే. రైతుల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో నాబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. ప్రభుత్వ ప్రయత్నాలపై జీఎస్టీ దెబ్బ తగిలిం దని ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సూక్ష్మసేద్యంపై ఐదు శాతం వ్యాట్ ఉంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం (రూ. 5 వేల వరకు) భరించేది. జీఎస్టీ వచ్చాక 18 శాతంలో అదే ఐదు శాతాన్ని భరించేందుకు రాష్ట్ర సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 13 శాతంలో నాలుగు శాతం మేర రేట్లు తగ్గించేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతులపై నికరంగా 9 శాతం భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పథకం ఉచితం.. పన్ను భారం ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరా సూక్ష్మసేద్యానికి దాదాపు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు కానుంది. ఎస్సీ, ఎస్టీలకు సూక్ష్మసేద్యం ఉచితమైనా, జీఎస్టీ వల్ల రూ.10 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 80 వేల మందికి సూక్ష్మసేద్యం మంజూరు చేశారు. జీఎస్టీ తగ్గలేదు: వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ ‘ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూక్ష్మసేద్యంపై భారాన్ని తగ్గిస్తారని అనుకున్నాం. కానీ తగ్గలేదు. కాబట్టి 18 శాతం వరకు భారం పడుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం భరిస్తుంది. మిగిలిన దాంట్లో నాలుగు శాతం వరకు కంపెనీలు రేట్లు తగ్గిస్తాయి. ఇవన్నీ పోగా 9 శాతం రైతులు భరించక తప్పదు.’ అని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. -
సూక్ష్మ సేద్యానికి రూ.130 కోట్లు
- ఈ ఏడాది 20,500 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం - కూరగాయల సాగుకు అడిగిన వెంటనే మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం కోసం జిల్లాకు రూ.130 కోట్లు మంజూరైనట్లు ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది 20,500 హెక్టార్లకు సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదెకరాల వరకు వంద శాతం సబ్సిడీ ఉంటుందని, ఐదెకరాలు దాటితే 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఇతరులకు పదెకరాల వరకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15వేల హెక్టార్లకు డ్రిప్, 5500 హెక్టార్లకు స్ప్రింకర్లు లేదా రెయిన్గన్లు ఇస్తున్నట్లు వివరించారు. మొత్తం లక్ష్యంలో ఎస్సీలకు 3,280 హెక్టార్లు, ఎస్టీలకు 1,373 హెక్టార్లకు డ్రిప్ వసతి కల్పిస్తామన్నారు. గతంలో ఒకసారి డ్రిప్ తీసుకుంటే పదేళ్ల వరకు మళ్లీ అవకాశం ఉండేది కాదని, ఈ వ్యవధిని ఈ ఏడాది నుంచి ఏడేళ్లకు తగ్గించినట్లు తెలిపారు. ఖరీప్‌లో మిరప, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులు అడిగిన వెంటనే డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా డ్రిప్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ ఏడాది డ్రిప్ పొందిన తర్వాత మెయిన్టెనెన్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పర్టిగేషన్ ద్వారా ఎరువులను కరిగించి మొక్కలకు అందే ప్రక్రియను చేపట్టేందుకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. -
‘సూక్ష్మ’ లక్ష్యం 15వేల హెక్టార్లు
– ఏపీఏంఐపీ రాష్ట్ర ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 15వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐఏఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో ఇప్పటి వరకు 8300 హెక్టార్లకు సూక్ష్మ సేద్యాన్ని అందించామని.. ఫిబ్రవరి నెల చివరిలోగా వంద శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. సూక్ష్మ సేద్యం కల్పనలో దేశంలోనే ఆంధ్రపదేశ్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఉల్లికి మినీ స్ప్రింక్లర్లు, మిరపకు డ్రిప్ ద్వారా నీటిని వినియోగించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
- గ్రీన్హౌస్, షేడ్‌నెట్‌పై మరింత దృష్టి పెట్టాలి – ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్)/దేవనకొండ/కోడుమూరు రూరల్: పండ్లతోటల అభివృద్ది, సూక్ష్మ సేద్యం విస్తరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి రైతులకు సూచించారు. మంగళవారం ఆయన కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గూడూరు మండలం వై.ఖానాపురం, దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామాల్లో పర్యటించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, రైతులతోను ముఖాముఖి మాట్లాడారు. సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో విడివిడిగా సమావేశమై సమీక్షించారు. ఉద్యానశాఖలోని నార్మల్ స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టీకల్చర్ మిషన్, ఆకేఈవై కింద ఇచ్చిన లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని ఇకపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ హౌస్, షేడ్‌నెట్ టెక్నాలజీని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లాలన్నారు. పందిరిపై తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. కొత్త పండ్లతోటల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ముగిసేలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. డ్రిప్ కోసం వచ్చిన దరఖాస్తులనుజాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట హార్టీ కల్చర్ పీడీ శ్రీనివాసులు, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఆయా శాఖల ఏడీలు, సిబ్బంది ఉన్నారు. -
సూక్ష్మసేద్యానికి రుణంపై నాబార్డు కొర్రీలు
రూ. వెయ్యి కోట్ల అప్పుపై సర్కారు హామీనీ పట్టించుకోని సంస్థ ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ వద్దని మెలిక 25 శాతం రైతులు చెల్లించాల్సిందేనని పట్టు అలాగైతేనే పథకానికి రుణం ఇస్తామని కుండబద్దలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం పథకం అమలుకు ప్రభుత్వం అడిగిన రూ. వెయ్యి కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డు కొర్రీలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థకు ఇచ్చే రుణంపై పూచీకత్తు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చినా మార్గదర్శకాల పేరిట సాకులు చెబుతోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నూరు శాతం రాయితీ (బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ)ని 75 శాతానికి పరిమితం చేస్తేనే రుణం మంజూరు చేస్తామని మెలిక పెడుతోంది. ఈ అంశంపై ఉద్యానశాఖ అధికారులు మూడుసార్లు చేపట్టిన సమావేశాల్లోనూ నాబార్డు అధికారులు ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. లబ్ధిదారులకు నూటికి నూరు శాతం సబ్సిడీ సరైంది కాదని... ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని, మిగిలిన 25 శాతాన్ని రైతులు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని వారు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు క చ్చితమైన మార్గదర్శకాలున్నాయని... కాబట్టి నూటికి నూరు శాతం సబ్సిడీకి అంగీకరించబోమని చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ వ్యవహారం సీఎం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ‘‘సబ్సిడీ ఎంతివ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఈ విషయంలో నాబార్డు జోక్యం సరైంది కాదు. వారిచ్చే రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. నిర్ణీత సమయంలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ప్రభుత్వానిది’’ అని ఉద్యానాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సూక్ష్మసేద్యంతో తక్కువ నీటితో పంటలు పండించేలా చేయాలని భావించింది. గత రెండేళ్లలో 1.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేయగా... 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఈ పథకం కింద కేవలం 75 శాతమే రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకం కింద గతేడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది రూ. 290 కోట్లు కేటాయించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 190 కోట్లు కేటాయించగా... కేంద్రం తన వాటాగా రూ. 100 కోట్లు ఇవ్వనుంది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ సొమ్ము సరిపోదని... అందువల్ల నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది. నేరుగా రుణం తీసుకోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా రుణం తీసుకొని ఉద్యానశాఖ పరిధిలోని సూక్ష్మసేద్యానికి మరలించాలని నిర్ణయించింది. దుర్వినియోగం అవుతుందనేనా? లబ్ధిదారులకు నూరు శాతం సబ్సిడీ ఇస్తే సూక్ష్మసేద్యం పథకం దుర్వినియోగం అవుతుందని నాబార్డు అధికారులు చెబుతున్నారు. భారీ రాయితీ ఇస్తుండటంతో కొందరు రైతులు కూడా ఇష్టానుసారంగా తీసుకొని సూక్ష్మసేద్యం పరికరాలను ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల రైతుల వాటా 25 శాతం ఉంటేనే బాధ్యతగా ఉంటారని పేర్కొంటున్నారు. అందుకే తాము రాష్ట్ర ప్రభుత్వానికి భారీ రాయితీ వద్దని సూచించామని ఒక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. -
డ్రిప్.. దందా
మహబూబ్‌నగర్ వ్యవసాయం: అధిక పంటదిగుబడులు సాధిం చడంతో పాటు నీరు, కరెంట్‌ను ఆదా చేసి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలు గద్వాల కేంద్రంగా సరిహద్దు దాటుతున్నాయి. ఆయా కంపెనీల డీలర్లు, ఉద్యోగులు, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పక్కరాష్ట్రాలకు తరలుతున్నాయి. దీంతో ఏటా రూ.ఐదుకోట్ల మేర రాయితీ సొమ్ముకు గండిపడుతోంది. ఈ వ్యవహారమంతా జిల్లా మై క్రోఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దందా ఇలా.. 100 శాతం, 90శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలను కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు, మధ్యవర్తులు తక్కువధరలకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అ మ్ముతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వీటికి బాగా డిమాండ్ ఉంది. కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు దరఖాస్తులను తీసుకుని మైక్రోఇరిగేషన్ అధికారులతో మంజూరు చేయించుకుంటున్నారు. వాటిని రైతులకు తెలియకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులు ప్రశ్నిస్తే అప్పుడు ఇప్పుడు ఇస్తామని తిప్పుకుంటున్నారు. మరికొన్నిచోట్ల పాత దరఖాస్తులు లేవని రైతులకు చెప్పి.. కొత్తగా దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇలా మంజూరైన పరికరాలను రైతులకు దక్కకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి డ్రిప్‌లు పొందిన రైతులు పదేళ్లలోపు దరఖాస్తు చేసుకోకూడదు. కానీ ఇలాంటి దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏటా అధికభాగం గద్వాల డివిజన్ పరిధిలో ఉన్న మండలాలకు పరికరాాలను కేటాయిస్తారు. గద్వాల, మల్దకల్ మీదుగా వీటిని కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల నుండి శ్రీశైలం మీదుగా గుంటూరు, రాయలసీమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్రమాలు వెలుగులోకి.. నాలుగునెలల క్రితం కోస్గి మండలంలో ఓ కంపెనీ ఉద్యోగి, డీలర్ కలిసి రైతులకు ఇచ్చిన డ్రిప్‌లను తిరిగి తీసుకుని ఓ లారీలో తరలిస్తుండగా స్థానికులు మైక్రోఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదుచేయగా చర్యలకు ఉపక్రమించారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫిర్యాదుచేశారు. స్పందించిన ముఖ్యమంత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు. ఈ విషయమై రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ పీఓ వెంకటరమణరెడ్డి డ్రిప్ కంపెనీల కోఆర్డినేటర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కాగా, కోస్గి వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఎంఐపీ సిబ్బంది, కంపెనీల ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. విజిలెన్స్ విచారణ చేపట్టకముందే అంతర్గత విచారణ పేరుతో ఎంఐపీ అధికారులు విచారణ చేపట్టి ఏమీ తేల్చలేకపోయారు. 20 బండిళ్ల డ్రిప్పైపుల పట్టివేత గద్వాలటౌన్: గద్వాల పట్టణ శివారులో నిల్వఉంచిన 20 బెండళ్ల రాయితీ డ్రిప్ పైపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైక్రో ఇరిగేషన్ స్టేట్ ప్రాజెక్టు పీడీ విద్యాశంకర్, ఏపీడీ సురేష్ ఆదేశాల మేరకు బుధవారం ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈద్గా సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీడ్రిప్ పైపులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన రాయితీ డ్రిప్ పైపులుగా స్థానిక అధికారులు శివకుమార్, జనార్ధన్‌లు గుర్తించారు. టౌన్ ఏఎస్సై సూర్యప్రకాష్, సిబ్బంది డ్రిప్ పైపులను పరిశీలించారు. ఈ పైపులపై ప్రభుత్వం విడుదల చేసిన ఎంబోజింగ్ ఉందని అధికారులు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీపై డ్రిప్ పైపులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రమంగా నిల్వ ఉంచిన డ్రిప్ పైపులను పరిశీలించడానికి గురువారం జిల్లా కేంద్రం నుంచి అధికారులు వస్తున్నారని తెలిపారు. దీనిపై టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. -
విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
- వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం - వ్యవసాయశాఖ మంత్రి పోచారం కోటగిరి : తెలంగాణా రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిపదవి చేపట్టి మొదటిసారిగా ఆదివారం కోటగిరి మండలానికి విచ్చిన సందర్భంగా మండలంలోని రాణంపల్లి, కోటగిరి, పోతంగల్, హంగర్గ గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోచారం, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ పోతంగల్ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి పోచారం రైతులతో, నాయకులతో మాట్లాడారు. మండలంలోని టాక్లీ, ఎక్లాస్పూర్, కోటగిరి, తదితర ఫీడర్లలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని వారు మంత్రి ఎదుట వాపోయారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు సక్రమంగా లేదన్నారు. స్పందించిన మంత్రి ట్రాన్స్‌కో డీఈతో ఫోన్లో మాట్లాడి విద్యుత్ కోతలు లేకుండా ఏడు గంటల పాటు కరెంటు ఇవ్వాలని సూచించారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు మరమ్మతులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని పనులు త్వరలో చేపడుతామన్నారు. అనంతరం మంత్రి పోచారం విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన అన్నిరకాల విత్తనాలు మనకు సరిపోగా మిగిలిన విత్తనాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు. హార్టికల్చర్, చేపల ఉత్పత్తి, డైరీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పండ్లు, పూలు, కూరగాయలు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఏడాది లక్షా 10 వేల ఎకరాల్లో సాగుచేసేందుకు రూ.130 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, మధ్యతరగతి రైతులకు 75 శాతం, పెద్దతరహా రైతులకు 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీపై స్త్రీనిధి ద్వారా గేదెల రుణాలకోసం మండలానికి రూ. 2 నుంచి 3 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. బంగారు ఆభరణాలపై రుణమాఫీ: వ్యవసాయ పంటల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలపై లక్షలోపు రుణమాఫీ చేస్తామని ఈవిషయం రైతులు గమనించాలని మంత్రి పోచారం తెలిపారు. పంట రుణమాఫీ వల్ల తెలంగాణలో 2 లక్షల 64 మంది రైతులకు లబ్ధికలుగుతోందన్నారు. కార్యక్రమంలో మంత్రి, ఎంపీతోపాటు జడ్పీటీసీ సభ్యుడు పుప్పాల శంకర్, పోతంగల్, కోటగిరి, లింగాపూర్, ఎక్లాస్పూర్, హంగర్గ సర్పంచ్‌లు గంగామణి, స్వరూప, మహేశ్, సంజీవ్, ఉదయ్‌భాస్కర్, టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి గంగాధర్దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుపై రాయితీ
సాక్షి, కర్నూలు : సూక్ష్మ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాయితీల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మారుతోంది. సాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న రైతులు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణాన్ని పెంచుతూ భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. కరువు మండలాలు, కరువు లేని మండలాలకు వేర్వేరుగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 35 వేల హెక్టార్లలో సాగవుతున్న సూక్ష్మ సేద్యంపై ఆ ప్రభావం చూపనుంది. అయితే కేంద్రం తగ్గించిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగంలో సూక్ష్మ సేద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక రాయితీ కల్పిస్తున్నాయి. సన్న, చిన్న కారు రైతులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నారు. బీసీలకు 90 శాతం రాయితీ లభిస్తోంది. 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు 75 శాతం రాయితీ.. 15 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన రైతులకు 60 శాతం రాయితీ కల్పించారు. అయితే ఇకపై కొత్త రాయితీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. కరువు పీడిత మండలాల్లో సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 35 శాతం రాయితీ మాత్రమే లభించనుంది. ఈ రెండింట్లో 10 శాతం రాయితీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే నిబంధన విధించారు. కరువులేని సాధారణ మండలాల్లో చిన్న రైతులకు 35 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 25 శాతం రాయితీ అమలు చేయనున్నారు. ఈ రెండింట్లోనూ రాష్ట్ర వాటాగా 10 శాతం భరించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో బిందు సేద్యంపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఇందుకు సంబంధించి యూనిట్ల మంజూరుకు యేటా నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంటోంది. గత ఏడాది 17 రకాల నిబంధనలు అమలు చేశారు. గతంలో బిందు, తుంపర సేద్యం యూనిట్లను పొలంలో అమర్చిన తర్వాత భూసార పరీక్షల నివేదిక కోరేవారు. గత ఏడాది దరఖాస్తుతో పాటే భూసార పరీక్ష నివేదిక, తహశీల్దార్, ఉప తహశీల్దార్, ఉద్యానవన శాఖ అధికారుల్లో ఎవరిదో ఒకరి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌డీడ్.. ఒకవేళ టైటిల్‌డీడ్ బ్యాంకులో ఉంటే ఫాం-1(బీ)పై తహశీల్దార్ సంతకం ఉండాలనే నిబంధన విధించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలనే మెలిక పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రాయితీల్లోనూ కోత విధించడం రైతులను ఈ సేద్యం పట్ల విముఖతకు కారణమవుతోంది. ఉత్తర్వులు అందలేదు కేంద్ర ప్రభుత్వం రాయితీల్లో కోత విధించడం వాస్తవమే. జిల్లా స్థాయిలో అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది. మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఏర్పాటైంది. ఈ విభాగానికి మంత్రి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. మంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు చేపడతాం. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ఇంకా పూర్తి కానందున బిందు సేద్యం పరికరాలు ఎవరికీ అందజేయలేదు. - పుల్లారెడ్డి, పీడీ, ఏపీఎంఐపీ -
రూ.16కోట్లు తుంపర పాలు
గుర్రంపోడు, న్యూస్‌లైన్ : దేశీయ పరిజ్ఞానం.. తక్కువనీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చన్న ప్రధాన లక్ష్యంతో ఏఎమ్మార్పీ పరిధిలో ఐదేళ్ల క్రితం చేపట్టిన తుంపరసేద్యం పనులకు గ్రహణం పట్టింది.మైక్రోఇరిగేషన్, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారుల మధ్య సమన్వయంలేక దీని పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రతీ ఖరీఫ్‌లో అధికారులు హడావుడి చేయడం ఆ తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. పైలట్ ప్రాజెక్టంటూ ఖర్చు చేసిన రూ. 16 కోట్ల నిధులు వృథా అయ్యేలా ఉన్నా అధికారుల్లో చలనం లేదు. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే వరితో పోల్చితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగుచేయవచ్చనే ఉద్దేశంతో 2008లో రూ.19.6 కోట్లతో ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీలు 16,17ల పరిధిలో 5,500 ఎకరాల్లో తుంపర సేద్యం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే ఉచితంగా పది ఎకరాలకు ఒకటి చొప్పున సంపును నిర్మించాలని అలాగే కరెంటు మోటారు, స్పింకర్ల పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క ఎకరాకు రూ. 40వేలు ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసి పనులు మొదలు పెట్టింది. అయితే మైక్రో ఇరిగేషన్, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయంలేక పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 500 సంపులకుగాను 400 సంపులు తవ్వి, 100 మోటార్లను పంపిణీ చేశారు. కానీ స్పింక్లర్ల పైపులు, పరికరాలు ఇవ్వకపోవడంలో సూక్ష్మసేద్యం ప్రాజెక్టు అటకెక్కింది. సంపులు శిథిలమై కరెంటు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయి. రూ.5కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా లేని లైన్లు తరుచూ చోరీకి గురవుతున్నాయి. బీడుగా భూములు మండలంలో ఏఎమ్మార్పీకి సంబంధించి మైనర్లు, పంటకాల్వలు ఉన్నాయి. వీటి ద్వారా నీరు పంటపొలాలకు చేరుతుంది. అయితే డీ-16,17 లలో తుంపర సేద్యం విధానాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కాల్వలు తవ్వలేదు. మండలంలోని తెరాటిగూడెం. పల్లిపహాడ్, మొసంగి గ్రామాల పరిధిలో 2200 ఎకరాలు సూక్ష్మసేద్యం పరిధిలోకి వస్తాయి. ఈ భూములు ఇటు తుంపరసేద్యానికి, అటు పంటకాల్వలకు నోచుకోక బీళ్లుగా మారుతున్నాయి. ఈ ప్రాజెక్టు తమ పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలు తవ్వాలి : రామగిరి చంద్రశేఖర్‌రావు, రైతు సంఘం నాయకుడు తుంపరసేద్యమో, పంటకాల్వలో ఏదో ఒకటైనా పూర్తి చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండింటినీ ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇస్తేనే సూక్ష్మసేద్యానికి అంగీకరించాం. కనీసం కాలిన టాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయిం చుకునే పరిస్థితి లేదు. ఈఖరీఫ్లోనైనా ముందుగా పంటకాల్వలు తవ్వాలి.