గత ఐదేళ్లలో రాష్ట్రంలో 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం విస్తరణ
తద్వారా 2,73,888 మంది అన్నదాతలకు ప్రయోజనం
రైతులకు డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లూ టీడీపీ ప్రచారం
అదంతా అవాస్తవమేనని స్పష్టం చేస్తోన్న కేంద్ర గణాంకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు చేస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా స్పష్టమైంది. గత ఐదేళ్లలో సూక్ష్మ సేద్యం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా ఏపీలో ఐదేళ్లలో 2,73,888 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది.
సూక్ష్మ సేద్యం కింద డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలతో నీటి వినియోగ సామరŠాధ్యన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించింది. ఈ పథకంపై నీతి ఆయోగ్ అధ్యయనం నిర్వహించిందని, జాతీయ ప్రాధాన్యతలను సాధించడంలో ఈ పథకం కీలకమని పేర్కొందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, పంట ఉత్పాదనను, ఉత్పత్తిని పెంచుకుని, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని నీతి ఆయోగ్ ప్రశంసించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (అహ్మదాబాద్) ద్వారా 2023లో ఏపీతో సహా దేశంలోని 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం మైక్రో ఇరిగేషన్ కవరేజీపై అధ్యయనం చేసిందని పేర్కొంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫార్సులు చేసిందని తెలిపింది. నీటి కొరత, నీటి ఒత్తిడి, క్లిష్టమైన పరిస్థితుల్లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
తద్వారా భూగర్భ నీటిని సంరక్షించడానికి సూక్ష్మ సేద్యాన్ని మరింత ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) సూక్ష్మ సేద్యంలో కర్ణాటక 13.30 లక్షల హెక్టార్లలో తొలి స్థానంలో ఉండగా ఆ తరువాత తమిళనాడు 7.79 లక్షల హెక్టార్లు, రాజస్థాన్ 6.16 లక్షల హెక్టార్లు, ఒడిశా 5.91 లక్షల హెక్టార్లు, గుజరాత్ 5.24 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్ 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం విస్తరించినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment