సూక్ష్మ సేద్యానికి రూ.130 కోట్లు
Published Fri, May 26 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
- ఈ ఏడాది 20,500 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం
- కూరగాయల సాగుకు అడిగిన వెంటనే మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం కోసం జిల్లాకు రూ.130 కోట్లు మంజూరైనట్లు ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది 20,500 హెక్టార్లకు సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదెకరాల వరకు వంద శాతం సబ్సిడీ ఉంటుందని, ఐదెకరాలు దాటితే 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఇతరులకు పదెకరాల వరకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15వేల హెక్టార్లకు డ్రిప్, 5500 హెక్టార్లకు స్ప్రింకర్లు లేదా రెయిన్‌గన్‌లు ఇస్తున్నట్లు వివరించారు. మొత్తం లక్ష్యంలో ఎస్సీలకు 3,280 హెక్టార్లు, ఎస్టీలకు 1,373 హెక్టార్లకు డ్రిప్ వసతి కల్పిస్తామన్నారు. గతంలో ఒకసారి డ్రిప్ తీసుకుంటే పదేళ్ల వరకు మళ్లీ అవకాశం ఉండేది కాదని, ఈ వ్యవధిని ఈ ఏడాది నుంచి ఏడేళ్లకు తగ్గించినట్లు తెలిపారు. ఖరీప్‌లో మిరప, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులు అడిగిన వెంటనే డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా డ్రిప్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ ఏడాది డ్రిప్ పొందిన తర్వాత మెయిన్‌టెనెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పర్టిగేషన్ ద్వారా ఎరువులను కరిగించి మొక్కలకు అందే ప్రక్రియను చేపట్టేందుకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.
Advertisement
Advertisement