సాక్షి, కర్నూలు : సూక్ష్మ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాయితీల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మారుతోంది. సాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న రైతులు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణాన్ని పెంచుతూ భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. కరువు మండలాలు, కరువు లేని మండలాలకు వేర్వేరుగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 35 వేల హెక్టార్లలో సాగవుతున్న సూక్ష్మ సేద్యంపై ఆ ప్రభావం చూపనుంది.
అయితే కేంద్రం తగ్గించిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగంలో సూక్ష్మ సేద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక రాయితీ కల్పిస్తున్నాయి. సన్న, చిన్న కారు రైతులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నారు. బీసీలకు 90 శాతం రాయితీ లభిస్తోంది. 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు 75 శాతం రాయితీ.. 15 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన రైతులకు 60 శాతం రాయితీ కల్పించారు. అయితే ఇకపై కొత్త రాయితీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. కరువు పీడిత మండలాల్లో సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 35 శాతం రాయితీ మాత్రమే లభించనుంది.
ఈ రెండింట్లో 10 శాతం రాయితీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే నిబంధన విధించారు. కరువులేని సాధారణ మండలాల్లో చిన్న రైతులకు 35 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 25 శాతం రాయితీ అమలు చేయనున్నారు. ఈ రెండింట్లోనూ రాష్ట్ర వాటాగా 10 శాతం భరించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో బిందు సేద్యంపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఇందుకు సంబంధించి యూనిట్ల మంజూరుకు యేటా నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంటోంది. గత ఏడాది 17 రకాల నిబంధనలు అమలు చేశారు.
గతంలో బిందు, తుంపర సేద్యం యూనిట్లను పొలంలో అమర్చిన తర్వాత భూసార పరీక్షల నివేదిక కోరేవారు. గత ఏడాది దరఖాస్తుతో పాటే భూసార పరీక్ష నివేదిక, తహశీల్దార్, ఉప తహశీల్దార్, ఉద్యానవన శాఖ అధికారుల్లో ఎవరిదో ఒకరి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌డీడ్.. ఒకవేళ టైటిల్‌డీడ్ బ్యాంకులో ఉంటే ఫాం-1(బీ)పై తహశీల్దార్ సంతకం ఉండాలనే నిబంధన విధించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలనే మెలిక పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రాయితీల్లోనూ కోత విధించడం రైతులను ఈ సేద్యం పట్ల విముఖతకు కారణమవుతోంది.
ఉత్తర్వులు అందలేదు
కేంద్ర ప్రభుత్వం రాయితీల్లో కోత విధించడం వాస్తవమే. జిల్లా స్థాయిలో అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది. మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఏర్పాటైంది. ఈ విభాగానికి మంత్రి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. మంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు చేపడతాం. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ఇంకా పూర్తి కానందున బిందు సేద్యం పరికరాలు ఎవరికీ అందజేయలేదు.
- పుల్లారెడ్డి, పీడీ, ఏపీఎంఐపీ
రైతుపై రాయితీ
Published Wed, Jun 11 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement