అనంతపురం జిల్లాలో అమర్చిన బిందు, తుంపర పరికరాలు
సాక్షి, అమరావతి: బిందు, తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగునీటి సౌకర్యం లేనిచోట్ల మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ప్రతి నీటి బొట్టును రైతులు వినియోగించేకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
నాలుగేళ్లలో 5.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించగా.. ఈ ఏడాది మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలు అమర్చారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
అర్హతే కొలమానంగా.. అడిగిన ప్రతి రైతుకూ పరికరాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించి సూక్ష్మసేద్యం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019–20లో రూ.720 కోట్లు వెచ్చింది 3.05 లక్షల ఎకరాల్లో విస్తరించగా.. 1,03,453 మంది లబ్ధి పొందారు. కరోనా వల్ల రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది.
2022–23 నుంచి మళ్లీ ప్రారంభించి.. ఆ ఏడాది రూ.636 కోట్ల ఖర్చుతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. 2023–24లో రూ.902.56 కోట్ల అంచనాతో మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఎకరాలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలలో 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.
సిఫార్సులతో పని లేకుండా ఆర్బీకేలో నమోదు చేస్తే చాలు అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు పరికరాలు అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి మరీ పరికరాలు అమరుస్తున్నారు.
ఆర్బీకేల్లో 2.02 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్
2023–24లో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 5,79,517 ఎకరాలు బిందు తుంపర పరికరాల కోసం 2.02 లక్షల మంది రైతులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాలను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం సిబ్బంది, కంపెనీల ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది.
2.75 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు కంపెనీలు బీఓక్యూను జనరేట్ చేయగా.. 1.56 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో పరికరాలను బిగించారు.
సీఎంకు రుణపడి ఉంటాం
నేను 4.14 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. తుంపర సేద్య పరికరాల కోసం ఆర్బీకేలో దరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సు చేయలేదు. నాకు కావాల్సిన పరికరాలు మా పొలానికి తీసుకొచ్చి అమర్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – టి.పాపయ్య, ఎర్రవారిపాలెం, తిరుపతి జిల్లా
దిగుబడులు పెరుగుతాయి
ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. పైపులు, స్ప్రింక్లర్లు కోసం దరఖాస్తు చేశా. 15 రోజుల్లో తీసుకొచ్చి అమర్చారు. వీటిద్వారా నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఏర్పడటంతో కాయ నాణ్యత పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. – ముళ్లమూరి బాలకృష్ణ,కలువాయి, నెల్లూరు జిల్లా
అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత
సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక జరుగుతోంది. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ధేశించినప్పటికీ అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ప్రాధాన్యత ఇస్తున్నాం. జనవరి నాటికి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకెళ్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మసాగునీటి పథకం
Comments
Please login to add a commentAdd a comment