drip system
-
సూక్ష్మ సేద్యం.. సిఫార్సుల్లేకుండా సాధ్యం
సాక్షి, అమరావతి: బిందు, తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగునీటి సౌకర్యం లేనిచోట్ల మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ప్రతి నీటి బొట్టును రైతులు వినియోగించేకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లలో 5.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించగా.. ఈ ఏడాది మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలు అమర్చారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హతే కొలమానంగా.. అడిగిన ప్రతి రైతుకూ పరికరాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించి సూక్ష్మసేద్యం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019–20లో రూ.720 కోట్లు వెచ్చింది 3.05 లక్షల ఎకరాల్లో విస్తరించగా.. 1,03,453 మంది లబ్ధి పొందారు. కరోనా వల్ల రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. 2022–23 నుంచి మళ్లీ ప్రారంభించి.. ఆ ఏడాది రూ.636 కోట్ల ఖర్చుతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. 2023–24లో రూ.902.56 కోట్ల అంచనాతో మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఎకరాలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలలో 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సిఫార్సులతో పని లేకుండా ఆర్బీకేలో నమోదు చేస్తే చాలు అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు పరికరాలు అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి మరీ పరికరాలు అమరుస్తున్నారు. ఆర్బీకేల్లో 2.02 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ 2023–24లో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 5,79,517 ఎకరాలు బిందు తుంపర పరికరాల కోసం 2.02 లక్షల మంది రైతులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాలను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం సిబ్బంది, కంపెనీల ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. 2.75 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు కంపెనీలు బీఓక్యూను జనరేట్ చేయగా.. 1.56 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో పరికరాలను బిగించారు. సీఎంకు రుణపడి ఉంటాం నేను 4.14 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. తుంపర సేద్య పరికరాల కోసం ఆర్బీకేలో దరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సు చేయలేదు. నాకు కావాల్సిన పరికరాలు మా పొలానికి తీసుకొచ్చి అమర్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – టి.పాపయ్య, ఎర్రవారిపాలెం, తిరుపతి జిల్లా దిగుబడులు పెరుగుతాయి ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. పైపులు, స్ప్రింక్లర్లు కోసం దరఖాస్తు చేశా. 15 రోజుల్లో తీసుకొచ్చి అమర్చారు. వీటిద్వారా నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఏర్పడటంతో కాయ నాణ్యత పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. – ముళ్లమూరి బాలకృష్ణ,కలువాయి, నెల్లూరు జిల్లా అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక జరుగుతోంది. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ధేశించినప్పటికీ అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ప్రాధాన్యత ఇస్తున్నాం. జనవరి నాటికి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకెళ్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మసాగునీటి పథకం -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏఐబీపీ, డ్రిప్, భూగర్భజలాలు, ట్రిపుల్ఆర్ పథకాలపై మంత్రి హరీశ్‌రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్ఆర్ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు యుటిలైజేషన్ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు. ఇక డామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టే పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్‌ల ఆధునీకరణ, మరమ్మతులకు రూ.665 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్న వివరాలను హరీశ్ భూగర్భ జలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వచ్చే రూ.70 కోట్ల నిధులతో గ్రౌండ్ డేటా సిస్టంను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భూగర్భ జలాల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించడం, భూగర్భ జలశాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఈ ఏడాది రూ.16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్రం నుంచి మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని హరీశ్ సూచించారు. భూగర్భ జలాల సమాచార సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్ లెవల్ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ ప్రకాశ్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
సూక్ష్మంగా వాడుకుంటేనే మన్నిక
అనంతపురం అగ్రికల్చర్: బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్లు)లాంటి సూక్ష్మసేద్య పరికరాలు చాలా కాలంపాటు పనిచేయాలంటే వాటిని ఎలా వాడాలో ముందుగా తెలుసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు. వర్షాభావం కారణంగా ‘అనంత’ లాంటి జిల్లాలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని.. నీటి విలువ తెలుసుకొని, డ్రిప్ యూనిట్ల ద్వారా క్రమ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రిప్ వాడకం ఇలా : డ్రిప్ యూనిట్లు అమర్చుకున్న రైతులు ఆటో స్టార్ట్ పెట్టుకోకూడదు. 1.5 రేంజ్లో డ్రిప్ ప్రెషర్ మెయింటెయిన్ చేయాలి. వాల్వులు ఒకేసారి ఓపెన్ చేయరాదు. ప్రెషర్ మెయింటెయిన్ చేయడం వల్ల లవణాలు, మలినాలు క్లీన్ అవుతాయి. ఫ్లష్వాల్వులను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. లేదంటే లవణాలు పేరుకుపోయి రంధ్రాలు పూడిపోతాయి. లాటరల్‌లు నెలకోసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే మలినాలు డ్రిప్పర్ల దగ్గర పేరుకుపోతాయి. ఫిల్టర్ లోపల ఉండే జల్లెడను వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుంచి ఇసుక రావడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు హైడ్రో సైక్లోన్ ఫిల్టర్ వాడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు (ఫర్టిగేషన్) వాడే సమయంలో మోటార్ ఆఫ్ చేసే 15 నిమిషాల ముందు ఎరువులు వదలాలి. ముందుగా ఎరువులు వదిలితే పోషకాలు మొక్కల వేరు వ్యవస్థ కన్నా కిందకు వెళ్లిపోతాయి. యాసిడ్ ట్రీట్మెంట్ : ఉప్పులవణాలతో కూడిన నీరు పైపుల ద్వారా ప్రవహించడం వల్ల లేటరల్, డ్రిప్పర్లు మూసుకొని పోతాయి. ఇందుకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)తో యాసిడ్ ట్రీట్మెంట్ æ(ఆమ్లచికిత్స) మూడు లేదా ఆరు నెలలకోసారి చేసుకోవాలి. యాసిడ్ ట్రీట్మెంట్ చేసేముందు మొదటగా ఫిల్టర్లను, పీవీసీ పైపులను, లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి. నిర్ణయించిన ఆమ్ల పరిమాణమును సరైన మోతాదులో నీటిని కలుపుకొని ఆమ్లద్రావణాన్ని తయారు చేసుకుని ఫర్టిలైజర్ ట్యాంకు లేదా ప్లాస్టిక్ బకెట్లో పోసుకొని వెంచురీ ద్వారా డ్రిప్ యూనిట్లోకి పంపించాలి. లేటరల్ చివర ఆమ్ల ద్రావణాన్ని నీటితో పాటు సబ్‌మెయిన్ లేదా లేటరల్, డ్రిప్పర్లలోకి చేరిన నీటిని పీ.హెచ్ పే పరుతో ముంచి పీ.హెచ్‌ను 4 రీడింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. టోల్‌ఫ్రీ: డ్రిప్, స్ప్రింక్లర్లకు సంబంధించి రైతులు ఏవైనా సమస్యలున్నా, ఫర్టిగేషన్, మన్నిక, యాసిడ్ ట్రీట్మెంట్, విడిభాగాలు కావాలన్నా, ఇతరత్రా ఎలాంటి సమాచారం అవసరం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలి. 1800 425 2960 నంబర్‌కు (ఉచితంగా) ఫోన్ చేసి సమాచారం, సమస్య, సలహాలు పొందవచ్చు. డ్రిప్ యూనిట్ల సరఫరా చేసే కంపెనీలు రైతుల పొలాల్లో అమర్చిన తరువాత తమ పని అయిపోయిందనుకోకూడదు. కనీసం ఐదేళ్ల పాటు ఉచితంగా సర్వీసు ఇవ్వాలి. పెద్ద పెద్ద కంపెనీలు నెలకు 8, చిన్న కంపెనీలు ఐదు చొప్పున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, డ్రిప్ యూనిట్ల మన్నిక, ఫర్టిగేషన్, యాసిడ్ ట్రీట్మెంట్, డ్రిప్ నిర్వహణ గురించి రైతులకు తెలియజేయాలి. ప్రతి కంపెనీ తప్పనిసరిగా సర్వీసు సెంటరు, అక్కడ అన్ని రకాల విడిభాగాలు, అగ్రానమిస్టు ఉండేలా చర్యలు తీసుకోవాలి. -
సూక్ష్మసాగులో ‘అనంత’కు అగ్రస్థానం
అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మ సాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) విస్తరణలో ఈ ఏడాది రాష్ట్రంలోనే అగ్రస్థానం సాధించామని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు (శుక్రవారం) ‘అనంత’ కన్నా చిత్తూరు కాస్త ముందంజలో ఉండగా.. అర్ధరాత్రికి అధిగమించి అగ్రస్థానం చేరామన్నారు. చివరి రోజు ఒక్కరోజే దాదాపు 1,500 హెక్టార్లకు మంజూరు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మంజూరు చేసిన రైతుల పొలాల్లో యూనిట్లు అమర్చే కార్యక్రమం వేగవంతం చేస్తామన్నారు. మొత్తమ్మీద 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27,357 హెక్టార్లకు మంజూరు చేసి టాప్‌లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (26,781 హెక్టార్లు), వైఎస్సార్ జిల్లా (25,427 హెక్టార్లు), కర్నూలు (14,263 హెక్టార్లు) ఉన్నాయన్నారు.