ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుందన్నారు. భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈవీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈవీలకు ప్రభుత్వం అందించే రాయితీ అవసరం లేదని తెలిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అవికాస్తా వైరల్‌గా మారడంతో మంత్రి దీనిపై తాజాగా స్పష్టతనిచ్చారు. ‘ఈవీలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు నేను వ్యతిరేకం కాదు. దీనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను బాధ్యత వహించాలని, ఈవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈవీలు ప్రారంభమైనప్పుడు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ధర 150 డాలర్లు(రూ.12,500)గా ఉండేది. ప్రస్తుతం దాని ధర 108-110 డాలర్లుగా(రూ.9,100) ఉంది. ఇది రానున్న రోజుల్లో రూ.8,300కు తగ్గుతుందని విశ్వసిస్తున్నాను. ఉత్పత్తి ఖర్చులు తగ్గినందున సబ్సిడీ లేకుండా కూడా కంపెనీలు వాటి ఖర్చులను నిర్వహించవచ్చని అంచనా వేశాను’ అని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు
‘వచ్చే రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుంది. కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో సబ్సిడీల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖ, భారీ పరిశ్రమల శాఖ ఈ విభాగానికి మరింత రాయితీలు అవసరమని భావిస్తే, నేను దాన్ని వ్యతిరేకించను’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment