
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ నుంచి తమ ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. వంటి కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి కార్ల ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి. ముడి సరుకు వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సతమతమవుతున్నందున తయారీ సంస్థలు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.
మారుతీ సుజుకి 4 శాతం పెంపు
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన మొత్తం శ్రేణి వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి 4% ధరల పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. మార్కెట్లో కంపెనీ పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే వ్యయ పెరుగుదలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ధరల పెంపు నిర్ణయంతో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో సహా పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
హ్యుందాయ్, ఎం అండ్ ఎం
హ్యుందాయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనాలపై 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించాయి. క్రెటా, ఐ20 వంటి మోడళ్లను కలిగి ఉన్న హ్యుందాయ్ లైనప్ ధరను సవరించనుంది. అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 సహా ఎస్‌యూవీ కూడా మరింత ఖరీదవనున్నాయి.
ఇతర బ్రాండ్‌లు ఇలా..
కియా, హోండా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ వంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ధరల సర్దుబాట్లకు సంబంధించి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పరిశ్రమలో ఏకీకృత ప్రతిస్పందన వస్తుంది. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావితం చూపుతుందనే వాదనలున్నాయి.
పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు
ఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్ చిప్స్ వంటి ముడి పదార్థాలపై చేస్తున్న ఖర్చులు పెరగడంతో ఆటోమోటివ్ రంగం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. అదనంగా లాజిస్టిక్స్, ఇంధనానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు ధరలు సవరించేందుకు కారణమయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి నాణ్యత లేదా సృజనాత్మకతలో రాజీపడకుండా వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు చెబుతున్నాయి.
వినియోగదారులపై ప్రభావం
ధరల పెరుగుదల స్వల్పకాలంలో విక్రయాలను ప్రభావితం చేసినప్పటికీ, వాహన తయారీదారులు తమ వాహనాలలో అధునాతన ఫీచర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొనుగోలుదారులపై ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి, వారి ఉత్పత్తులకు నిరంతర గిరాకీ ఏర్పడేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ సమీపిస్తున్న కొద్దీ కారు కొనుగోలుదారులు తమ నిర్ణయాలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏప్రిల్‌లోపే కొనుగోలు
ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్న కొందరు వినియోగదారులు ఏప్రిల్‌లో ధరల పెంపు అమల్లోకి రాకముందే తమ కొనుగోళ్లను ఖరారు చేయడానికి పరుగులు తీస్తున్నారు. దీంతో మార్చి నెలాఖరు నాటికి కార్ల అమ్మకాలు తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది.
బడ్జెట్ వాహనాలపై దృష్టి
ధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు తమ ఎంపికలను పునఃపరిశీలించవచ్చు. గతంలో నిర్ణయించుకున్న మోడల్‌ను కాకుండా బడ్జెట్‌లో మరో మోడల్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి బదులుగా సెడాన్ కేటగిరీ కారును ఎంచుకోవచ్చు.
యూజ్డ్ కార్లకు డిమాండ్
కొత్త కార్ల ధరలు పెరుగుతుండటంతో ప్రీ ఓన్డ్ కార్ల(ఇది వరకే ఉపయోగించిన కార్లు) మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొత్త వాహనాలపై అధిక ఖర్చులను నివారించాలని చూస్తున్న కొనుగోలుదారులు మరింత చౌకైన ప్రత్యామ్నాయంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు మొగ్గు చూపవచ్చు.
ఇదీ చదవండి: అపార్ట్‌మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్
రుణాలపై ఆధారపడటం
వాహన ధరలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది కస్టమర్లు తాము చేయాలనుకుంటున్న కొనుగోళ్ల కోసం ఫైనాన్సింగ్ లేదా రుణాలపై ఆధారపడవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లేదా ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లను అందించే వాహన తయారీదారులు ఈమేరకు ప్రయోజనం చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment