ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్‌లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.
ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.
ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
‘ఫేమ్’లో భారీగా సబ్సిడీ
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.
ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్‌పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment