
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్‌గా టాటా గ్రూప్ నిలిచింది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను, అధునాతన తయారీ, సాంకేతికతలో టాటా గ్రూప్ నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.
ఈ నివేదిక ప్రకారం.. టాటా ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్ , టాటా ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పుడు టెస్లా సరఫరా గొలుసులో భాగంగా ఉన్నాయి. కీలకమైన భాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు ఇప్పటికే టెస్లాతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వివిధ విడిభాగాలు, సేవలను సరఫరా చేస్తున్నాయని ఈటీ నివేదించింది. ముఖ్యంగా టెస్లా భారత్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
టెస్లా సీనియర్ ప్రొక్యూర్మెంట్ అధికారులు నిర్దిష్ట విడిభాగాల తయారీ గురించి భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ పేర్కొంది. వీటిలో కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ భాగాలు ఉన్నాయి. టెస్లాకు భారతీయ సప్లయర్ల సహకారం ఇప్పటికే గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు టెస్లాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. టెస్లా తన సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని చూస్తున్న క్రమంలో భారత్ నుంచి దాని సోర్సింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
టాటా కంపెనీలు ఏం సరఫరా చేస్తున్నాయంటే..
ఈటీ కథనం ప్రకారం.. వివిధ టాటా గ్రూప్ కంపెనీలు టెస్లాకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. వాటిలో టాటా ఆటోకాంప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ అందిస్తోంది. టీసీఎస్ సర్క్యూట్ బోర్డు టెక్నాలజీని అందిస్తోంది.
టెస్లా తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటయ్యాక టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్‌లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్‌కు కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్స్ (పీసీబీఏ) కోసం టెస్లా టాటా ఎలక్ట్రానిక్స్ వైపు చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment