subcidy
-
ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుందన్నారు. భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈవీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈవీలకు ప్రభుత్వం అందించే రాయితీ అవసరం లేదని తెలిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అవికాస్తా వైరల్‌గా మారడంతో మంత్రి దీనిపై తాజాగా స్పష్టతనిచ్చారు. ‘ఈవీలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు నేను వ్యతిరేకం కాదు. దీనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను బాధ్యత వహించాలని, ఈవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈవీలు ప్రారంభమైనప్పుడు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ధర 150 డాలర్లు(రూ.12,500)గా ఉండేది. ప్రస్తుతం దాని ధర 108-110 డాలర్లుగా(రూ.9,100) ఉంది. ఇది రానున్న రోజుల్లో రూ.8,300కు తగ్గుతుందని విశ్వసిస్తున్నాను. ఉత్పత్తి ఖర్చులు తగ్గినందున సబ్సిడీ లేకుండా కూడా కంపెనీలు వాటి ఖర్చులను నిర్వహించవచ్చని అంచనా వేశాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు‘వచ్చే రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుంది. కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో సబ్సిడీల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖ, భారీ పరిశ్రమల శాఖ ఈ విభాగానికి మరింత రాయితీలు అవసరమని భావిస్తే, నేను దాన్ని వ్యతిరేకించను’ అని స్పష్టం చేశారు. -
ఫ్రీ కరెంట్ కావాలంటే ఇలా చేయండి.. డబ్బులు కూడా ఇస్తారు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 'పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేయడానికి గరిష్ఠంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు 300 యూనిట్ల కరెంటును ఉచితంగానే పొందవచ్చు. కేంద్రం ఈ కొత్త పధకం కోసం ఏకంగా రూ.75000 కోట్లు వెచ్చిస్తోంది. సబ్సిడీ వివరాలు కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని పలు విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. దీని కింద ఒక కిలోవాట్ సిస్టమ్‌కు రూ. 30000, రెండు కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60000, మూడు కిలోవాట్ల సిస్టమ్‌కు ఏకంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు రూ.1.45 ఖర్చు అవుతుంది. ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుంది. రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయి. ఉదాహరణకు 3 కిలోవాట్ సిస్టమ్‌కు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి రూ.1.45 ఖర్చు అయిందనుకున్నప్పుడు, అందులో రూ. 78000 రాయితీ లభిస్తుంది. కాబట్టి మిగిలిన రూ. 67000 కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే పొందవచ్చు. నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే 150 యూనిట్ల నుంచి 300 యూనిట్లను ఉపయోగించుకునే వారికి 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిం రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజనకు అప్లై చేసుకునే విధానం 👉స్టెప్-1 అధికారిక వెబ్సైట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి. మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంచుకోండి. ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ (వినియోగదారు) నెంబర్, మొబైల్ నెంబర్ & ఈ-మెయిల్ వంటి వాటిని ఎంటర్ చేయండి. 👉స్టెప్-2 వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఫామ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-3 డిస్కమ్ నుంచి అనుమతి వచ్చిన తరువాత, రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉స్టెప్-4 ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-5 నెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, డిస్కమ్ అధికారులు చెక్ చేసి, తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. 👉స్టెప్-6 కమిషనింగ్ సర్టిఫికెట్ పొందిన తరువాత బ్యాంక్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన 30 రోజుల లోపల సబ్సడీ అమౌట్ మీ అకౌంట్లోకి జమ అవుతుంది. -
సూక్ష్మ సేద్యం.. సిఫార్సుల్లేకుండా సాధ్యం
సాక్షి, అమరావతి: బిందు, తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగునీటి సౌకర్యం లేనిచోట్ల మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ప్రతి నీటి బొట్టును రైతులు వినియోగించేకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లలో 5.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించగా.. ఈ ఏడాది మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలు అమర్చారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హతే కొలమానంగా.. అడిగిన ప్రతి రైతుకూ పరికరాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించి సూక్ష్మసేద్యం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019–20లో రూ.720 కోట్లు వెచ్చింది 3.05 లక్షల ఎకరాల్లో విస్తరించగా.. 1,03,453 మంది లబ్ధి పొందారు. కరోనా వల్ల రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. 2022–23 నుంచి మళ్లీ ప్రారంభించి.. ఆ ఏడాది రూ.636 కోట్ల ఖర్చుతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. 2023–24లో రూ.902.56 కోట్ల అంచనాతో మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఎకరాలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలలో 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సిఫార్సులతో పని లేకుండా ఆర్బీకేలో నమోదు చేస్తే చాలు అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు పరికరాలు అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి మరీ పరికరాలు అమరుస్తున్నారు. ఆర్బీకేల్లో 2.02 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ 2023–24లో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 5,79,517 ఎకరాలు బిందు తుంపర పరికరాల కోసం 2.02 లక్షల మంది రైతులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాలను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం సిబ్బంది, కంపెనీల ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. 2.75 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు కంపెనీలు బీఓక్యూను జనరేట్ చేయగా.. 1.56 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో పరికరాలను బిగించారు. సీఎంకు రుణపడి ఉంటాం నేను 4.14 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. తుంపర సేద్య పరికరాల కోసం ఆర్బీకేలో దరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సు చేయలేదు. నాకు కావాల్సిన పరికరాలు మా పొలానికి తీసుకొచ్చి అమర్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – టి.పాపయ్య, ఎర్రవారిపాలెం, తిరుపతి జిల్లా దిగుబడులు పెరుగుతాయి ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. పైపులు, స్ప్రింక్లర్లు కోసం దరఖాస్తు చేశా. 15 రోజుల్లో తీసుకొచ్చి అమర్చారు. వీటిద్వారా నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఏర్పడటంతో కాయ నాణ్యత పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. – ముళ్లమూరి బాలకృష్ణ,కలువాయి, నెల్లూరు జిల్లా అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక జరుగుతోంది. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ధేశించినప్పటికీ అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ప్రాధాన్యత ఇస్తున్నాం. జనవరి నాటికి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకెళ్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మసాగునీటి పథకం -
అర్హతే ప్రామాణికంగా కరెంట్ సబ్సిడీ
-
మరింత మందికి ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్న ప్రభుత్వం మరింతమందికి లబ్దిచేకూర్చాలని సంకల్పించింది. జోన్ పరిధిలో అసైన్డ్ భూములతో సహా వివిధరకాల ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న వారితోపాటు దేవదాయ భూములను లీజుకు తీసుకుని సాగుచేస్తున్న పదెకరాల్లోపు వారికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ భూముల హక్కులు ప్రభుత్వ, ఆయా దేవస్థానాల పేరిట నమోదై ఉండడంతో ఆక్వా సబ్సిడీ వర్తింపునకు సాంకేతికంగా ఇబ్బంది నెలకొంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అయా భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్న రైతులందరికి సబ్సిడీ వర్తించేలా వెసులుబాటు కల్పించింది. ఈ ఫిష్ సర్వే ప్రకారం 1,72,514 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 3,14,313 ఎకరాల్లోను, 4,691 మంది పదెకరాలకు పైగా విస్తీర్ణంలో.. మొత్తం 1,17,780 ఎకరాల్లోను ఆక్వా సాగుచేస్తున్నారు. నోటిఫైడ్ ఆక్వాజోన్ పరిధిలో 2,49,348 ఎకరాల్లో 1,00,792 మంది సాగుచేస్తున్నారు. వీరిలో 98,095 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,86,218 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నాన్ ఆక్వాజోన్ పరిధిలో 74,419 మంది 1,28,095 ఎకరాల్లో సాగుచేస్తుండగా, 76,413 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,82,744 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. జోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుదారులందరికీ ఈ నెల 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు.. జోన్ పరిధిలో పదెకరాల్లోపు అసైన్డ్‌తో సహా వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేస్తున్న వారికి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబును ఆదేశించారు. దీంతో మత్స్యశాఖాధికారులు జోన్ పరిధిలో అసైన్డ్ ల్యాండ్స్, వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్నవారిని గుర్తించి వారికి విద్యుత్ సబ్సిడీ వర్తించేలా చర్యలు చేపట్టారు. ఈ జాబితాలను తయారుచేసి ఆయా డిస్కమ్‌లకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హతగల ఆక్వాజోన్ ప్రాంతాల గుర్తింపునకు చేపట్టిన సర్వే పూర్తికాగా, వాటికి గ్రామసభతోపాటు జిల్లాస్థాయి కమిటీలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిస్కమ్‌లకు జాబితాలు ఆక్వాజోన్‌లో పదెకరాల్లోపు అర్హత కలిగిన విద్యుత్ కనెక్షన్ల వివరాలను డిస్కమ్‌లకు పంపించాం. వాటికి యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జోన్ పరిధిలో ఉన్న అసైన్డ్, ఇతర ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేసే పదెకరాల్లోపు రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టాం. ఈ జాబితాలను డిస్కమ్‌లకు పంపిస్తున్నాం. నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హమైన ప్రాంతాలను గుర్తించి జోన్ పరిధిలోకి బదలాయించేందుకు చర్యలు చేపట్టాం. – కూనపురెడ్డి కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
నష్టాలపాలు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది జిల్లాలో సబ్సిడీ ఆవులు పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితి. ఆవులతోనైనా అప్పులు పూడ్చుకోవచ్చని భావించిన పేదలకు చివరకు కష్టాలు.. నష్టాలే మిగులుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినఆవులు ఇక్కడమనలేక మృత్యువాతపడుతున్నాయి. వీటికి బీమా సొమ్మూ ఇవ్వకుండా అధికారులు అప్పులపాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అంటగట్టారు నాకు పట్టించిన ఆవులు ఏమీ బాగోలేవు. ఇవి వద్దన్నా బ్యాంకర్లు, పశువైద్యాధికారులు వినలేదు. మీకు సబ్సిడీ ఆవులు కావాలంటే వీటినే పట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. చేసేది లేక వారు చూపించిన వాటినే పట్టుకున్నా. ఆవులు ఇంటికి చేరేలోపే ఓ ఆవుకు కడుపులోనే దూడ చనిపోయింది. దూడను బయటకు తీసి ఆవుకు వైద్యం చేయాలని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆవుకూడా చనిపోయింది. – వేద, మహిళా రైతు, ఎట్టేరి చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో 2017–18కి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 920 పాడి ఆవులు పంపిణీ చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారునికి రెండేసి ఆవులను అంటగట్టారు. వీటిని ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు చేసేవిధంగా అధికారులు ఆంక్షలు విధించారు. సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆవులను పట్టించి ఇచ్చారు. అక్కడి ఆవులు ఇక్కడ మనుగడ సాగించలేకపోతున్నాయి. వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. నెల తిరక్కనే.. సబ్సిడీ ఆవులు ఇక్కడికొచ్చిన నెల రోజులకే పాడెక్కుతున్నాయి. బ్యాంకర్లు, వైద్యాధికారులు పక్కరాష్ట్రాల్లో ఆవులను పట్టిస్తున్నారే గానీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాక పట్టించుకోవడం లేదు. కొన్ని చూలు ఆవులు ఇక్కడకు చేరుకునే సమయానికే కడుపులోనే దూడలు చనిపోతున్నాయి. లబ్ధిదారులు వైద్యాధికారులకు తెలిపినా సకాలంలో స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 సబ్సిడీ ఆవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఒకే గ్రామంలోనే 8 ఆవులు.. గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామస్తులకు తమిళనాడులోని నామక్కళ్ గ్రామం వద్ద మొత్తం 22 ఆవులను అధికారులు పట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఐదు ఆవులకు కడుపులోనే దూడలు చనిపోయాయి. మరో వారం రోజులకే మూడు ఆవులు వింత వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఇంకో రెండు ఆవుల పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుల ఊబిలోకి లబ్ధిదారులు సబ్సిడీ పేరుతో ఆవులు పొందిన లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు. బ్యాంకులో రుణం చెల్లించలేక.. పెట్టుబడీ చేతికి రాక చితికిపోతున్నారు. బీమా ఏదీ? సబ్సిడీ ఆవులకు బీమా తప్పనిసరి. బీమా చేసిన ఆవుల చెవులకు ఏజెంట్లు గుర్తుగా కమ్మ వేయాలి. కానీ ఆ ఏజెంట్లు గ్రామాలకు వచ్చే సమయానికే ఆవులు వ్యాధుల బారినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజెంట్లు వాటికి కమ్మ వేసేందుకు సమ్మతించడంలేదు. బీమా వర్తించకనే ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సబ్సిడీ..దోపిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే మొత్తాలు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆవులను పట్టించేందుకు వెళుతున్న బ్యాంకర్లు, వైద్యాధికారులు అక్కడి పాడి ఆవుల దళారీలతో కుమ్మక్కై సబ్సిడీ నిధులను అప్పనంగా దిగమింగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి ఆవుకూ రూ.50 వేలు కేటాయించగా, అందులో రూ.20 వేలు లబ్ధిదారునికి బ్యాంకు రుణం, మిగిలిన రూ.30 వేలు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద అందించాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు, వైద్యాధికారులు రూ.20 వేల విలు చేసే ఆవులను పట్టించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని దిగమింగుతున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దోచేసుకున్నారు ఆవులకు కార్పొరేషన్ అందించే సబ్సిడీని బ్యాంకర్లు, వైద్యాధికారులు దోచేసుకున్నారు. మాకు పట్టించిన ఆవులు ఒక్కొక్కటీ రూ.20 వేలే చేస్తాయి. రూ.50 వేలని పట్టించారు. మిగిలిన డబ్బులు వారే పంచుకున్నారు. ఆఖరుకు ఇటు ఆవూలేక.. అటు రుణం తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాం. – రాధిక, మహిళారైతు, ఎట్టేరి బీమా లేదు బ్యాంకు రుణం ద్వారా పట్టుకొస్తున్న ఆవులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. తమిళనాడు నుంచి ఆవులు ఇక్కడకు తీసుకొచ్చే సమయానికే కొన్ని జబ్బు చేసి పైకిలేవలేని స్థితికి చేరుతున్నాయి. బీమా ఏజెంట్లకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. – జయలక్ష్మి, మహిళా రైతు, ఎట్టేరి జాగ్రత్తగా చూసుకోక పోవడం వల్లే పక్క రాష్ట్రాల్లో పట్టిస్తున్న ఆవులకు అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొందరు అలా చేయడంలేదు. అందువల్లే కొన్ని ఆవులు చనిపోతున్నాయి. – వెంకట్రావ్, జేడీ, పశుసంవర్థకశాఖ -
ఇన్పుట్ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి
నడిగూడెం: 2014–15 సంవత్సరానికి సంబంధించిన ఈదురుగాలులు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది వాతారణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించిన రైతులకు వెంటనే బీమా సౌకర్యం కల్పించాలన్నారు. నల్గొండలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ, సూర్యాపేటలో మామిడి మార్కెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు ప్రకాష్‌రావు, లక్ష్మారెడ్డి, చక్రయ్య, జానిమియా, రామయ్య, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత
ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్యశాఖల్లో ఇక చేనేత వస్త్రాలే కార్మికులకు రాయితీలు అందిస్తాం.. ఆర్థికంగా ఎదిగేలా చేస్తాం నిఫ్ట్ సహకారంతో చేనేత వస్త్రాలకు కొత్త హంగులు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జరిపేలా చర్యలు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చేనేత కార్మికులకు రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సాయం అడిగే పరిస్థితి నుంచి మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత రంగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. శుక్రవారమిక్కడ వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం, జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) రీజినల్ డెరైక్టర్ ఈశ్వర్పాటిల్, ఆప్కో డెరైక్టర్ బాబూరావు, పద్మశ్రీ అవార్డు గ్ర హీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేత ను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖల్లో వాడే యూనిఫారాలకు సైతం చేనేత వస్త్రాలనే వాడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. వీటితో పాటు పరిశ్రమల్లో యూనిఫారాలు, నేవీ, ఆర్మీ తదితర దళాల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు వినియోగించేలా ప్రధానితో చర్చిస్తామన్నారు. ఆధునిక వస్త్రధారణకు తగ్గట్టుగా నిఫ్ట్ వంటి సంస్థల భాగస్వామ్యంతో చేనేత వస్త్రాలను తీర్చిదిద్దుతామని, ప్రపంచం నలుమూలలకు వస్త్రాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెజాన్ వంటి ప్రపంచస్థాయి కంపెనీల సహకారంతో ఆన్‌లైన్‌లోనూ ఈ వస్త్రాల విక్రయం జరిగేలా చూస్తామన్నారు. ఆప్కో ద్వారా చేనేత కార్మికులకు బకాయిలు చెల్లించే విధానం సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నెలలోపే డబ్బు అందేలా కొత్త పద్ధతి తెస్తామన్నారు. కార్మికుల ఆత్మహత్యలను నివారిస్తామన్నారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల నాయకులు మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. బడ్జెట్లో చేనేతకు రూ.200 కోట్లు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, చేనేత కార్మికుల పిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గజం అంజయ్య, గజం గోవర్ధన్‌లను మంత్రి సన్మానించారు.