నష్టాలపాలు | People Facing Problems With Subsidy Cows | Sakshi
Sakshi News home page

నష్టాలపాలు

Published Tue, Apr 17 2018 9:08 AM | Last Updated on Tue, Apr 17 2018 9:08 AM

People Facing Problems With Subsidy Cows - Sakshi

వింత వ్యాధితో పైకి లేవలేని స్థితిలో ఉన్న ఆవు

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది జిల్లాలో సబ్సిడీ ఆవులు పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితి. ఆవులతోనైనా అప్పులు పూడ్చుకోవచ్చని భావించిన పేదలకు చివరకు కష్టాలు.. నష్టాలే మిగులుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినఆవులు ఇక్కడమనలేక మృత్యువాతపడుతున్నాయి. వీటికి బీమా సొమ్మూ ఇవ్వకుండా అధికారులు అప్పులపాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.  

బలవంతంగా అంటగట్టారు
నాకు పట్టించిన ఆవులు ఏమీ బాగోలేవు. ఇవి వద్దన్నా బ్యాంకర్లు, పశువైద్యాధికారులు వినలేదు. మీకు సబ్సిడీ ఆవులు కావాలంటే వీటినే పట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. చేసేది లేక వారు చూపించిన వాటినే పట్టుకున్నా. ఆవులు ఇంటికి చేరేలోపే ఓ ఆవుకు కడుపులోనే దూడ చనిపోయింది. దూడను బయటకు తీసి ఆవుకు వైద్యం చేయాలని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆవుకూడా చనిపోయింది.         – వేద, మహిళా రైతు, ఎట్టేరి

చిత్తూరు అగ్రికల్చర్‌ : జిల్లాలో 2017–18కి గాను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మొత్తం 920 పాడి ఆవులు పంపిణీ చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారునికి రెండేసి ఆవులను అంటగట్టారు. వీటిని ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు చేసేవిధంగా అధికారులు ఆంక్షలు విధించారు. సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆవులను పట్టించి ఇచ్చారు. అక్కడి ఆవులు ఇక్కడ మనుగడ సాగించలేకపోతున్నాయి. వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. 

నెల తిరక్కనే..
సబ్సిడీ ఆవులు ఇక్కడికొచ్చిన నెల రోజులకే పాడెక్కుతున్నాయి. బ్యాంకర్లు, వైద్యాధికారులు పక్కరాష్ట్రాల్లో ఆవులను పట్టిస్తున్నారే గానీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాక పట్టించుకోవడం లేదు. కొన్ని చూలు ఆవులు ఇక్కడకు చేరుకునే సమయానికే కడుపులోనే దూడలు చనిపోతున్నాయి. లబ్ధిదారులు వైద్యాధికారులకు తెలిపినా సకాలంలో స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 సబ్సిడీ ఆవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. 

ఒకే గ్రామంలోనే 8 ఆవులు..
గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామస్తులకు తమిళనాడులోని నామక్కళ్‌ గ్రామం వద్ద మొత్తం 22 ఆవులను అధికారులు పట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఐదు ఆవులకు కడుపులోనే దూడలు చనిపోయాయి. మరో వారం రోజులకే మూడు ఆవులు వింత వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఇంకో రెండు ఆవుల పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. 

అప్పుల ఊబిలోకి లబ్ధిదారులు
సబ్సిడీ పేరుతో ఆవులు పొందిన లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు. బ్యాంకులో రుణం చెల్లించలేక.. పెట్టుబడీ చేతికి రాక చితికిపోతున్నారు. 

బీమా ఏదీ?
సబ్సిడీ ఆవులకు బీమా తప్పనిసరి. బీమా చేసిన ఆవుల చెవులకు ఏజెంట్లు గుర్తుగా కమ్మ వేయాలి. కానీ ఆ ఏజెంట్లు గ్రామాలకు వచ్చే సమయానికే ఆవులు వ్యాధుల బారినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజెంట్లు వాటికి కమ్మ వేసేందుకు సమ్మతించడంలేదు. బీమా వర్తించకనే ఆవులు మృత్యువాత పడుతున్నాయి. 

సబ్సిడీ..దోపిడీ
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందించే మొత్తాలు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆవులను పట్టించేందుకు వెళుతున్న బ్యాంకర్లు, వైద్యాధికారులు అక్కడి పాడి ఆవుల దళారీలతో కుమ్మక్కై సబ్సిడీ నిధులను అప్పనంగా దిగమింగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి ఆవుకూ రూ.50 వేలు కేటాయించగా, అందులో రూ.20 వేలు లబ్ధిదారునికి బ్యాంకు రుణం, మిగిలిన రూ.30 వేలు కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ కింద అందించాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు, వైద్యాధికారులు రూ.20 వేల విలు చేసే ఆవులను పట్టించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని దిగమింగుతున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 

దోచేసుకున్నారు
ఆవులకు కార్పొరేషన్‌ అందించే సబ్సిడీని బ్యాంకర్లు, వైద్యాధికారులు దోచేసుకున్నారు. మాకు పట్టించిన ఆవులు ఒక్కొక్కటీ రూ.20 వేలే చేస్తాయి. రూ.50 వేలని పట్టించారు. మిగిలిన డబ్బులు వారే పంచుకున్నారు. ఆఖరుకు ఇటు ఆవూలేక.. అటు రుణం తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాం.           – రాధిక, మహిళారైతు, ఎట్టేరి

బీమా లేదు
బ్యాంకు రుణం ద్వారా పట్టుకొస్తున్న ఆవులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. తమిళనాడు నుంచి ఆవులు ఇక్కడకు తీసుకొచ్చే సమయానికే కొన్ని జబ్బు చేసి పైకిలేవలేని స్థితికి చేరుతున్నాయి. బీమా ఏజెంట్లకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది.           – జయలక్ష్మి, మహిళా రైతు, ఎట్టేరి 

జాగ్రత్తగా చూసుకోక పోవడం వల్లే
పక్క రాష్ట్రాల్లో పట్టిస్తున్న ఆవులకు అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొందరు అలా చేయడంలేదు. అందువల్లే కొన్ని ఆవులు చనిపోతున్నాయి.             – వెంకట్రావ్, జేడీ, పశుసంవర్థకశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement