
చిత్తూరు అర్బన్: సుమారు 40 వేల మందికి పైగా జనాభా. 24 పంచాయతీలు. ప్రముఖ పుణ్యక్షేత్రం పులిగుండు ఉన్న ఊరు. అదే పెనుమూరు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మాత్రం కనిపించడంలేదు. ఎనిమిది నెలలుగా ఈ స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు భర్తీకి నోచుకోలేదు. మండలంలోని ఏ గ్రామంలో చిన్న సమస్య వచ్చినా ప్రజలు పెనుమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. ‘ఇక్కడ ఎస్‌ఐ లేరు, మీరు చిత్తూరు టౌన్‌లోని తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. అక్కడ సీఐ సార్ ఉంటారు. ఆయన మీ సమస్య చూస్తారు’ అంటూ సిబ్బంది పంపివేయడం.
నెలలు తరబడిగా ఇదే సమాధానం వినివిని మండలంలోని ప్రజలు విసుగెత్తిపోతున్నారు. పెనుమూరు మండల కేంద్రం నుంచి చిత్తూరుకు 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచైతే 30 కిలోమీటర్ల పైనే దూరం. మనిషి కనిపించికపోయినా, ఇంట్లో చోరీ జరిగినా, చిన్నపాటి గొడవలు జరిగినా, ఆఖరుకు చింతచెట్లు కొట్టేసినా సరే.. పెనుమూరు ప్రజలు చిత్తూరుకు రావాల్సిందే. స్టేషన్‌లో ఇద్దరు ఏఎస్‌ఐలుంటే ఒకరు వారెంట్ డ్యూటీ, మరొకరు స్టేషన్ పర్యవేక్షణ బాధ్యత. ఉన్న పది మందిలో ఎవరికి వాళ్లే బాసు. ఒకరి మాట, ఒకరు వినే పరిస్థితి లేదు. అలాంటిది ప్రజల సమస్య ఏం వింటారనే విమర్శలున్నాయి.
మరోవైపు కూటమి ప్రజాప్రతినిధి చెప్పిన వ్యక్తికి ఇక్కడ ఎస్‌ఐ పోస్టింగ్ దక్కడం లేదో..? పోలీసు బాసు ఎవరినైనా నియమిస్తే ఆయన్ని ఇక్కడ చేర్చుకోవడంలేదో..? తెలియడం లేదుగానీ.. ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. ఒక్కొక్కసారి తాలూక స్టేషన్‌లోని పోలీసు సారుకూ చిర్రెత్తుకొస్తుంది. జనం ముందే ‘మీ ఊరికి ఓ ఎస్‌ఐను వేసుకోవడానికి వగలేదు. ఊరికే నా వద్దకు వస్తారు. మీ వల్‌లైతే ఎస్‌ఐను వేసుకోండి. నాకు ఇదొక్కటే స్టేషన్ కాదు కాదా..?’ అంటూ చిర్రుబుర్రులాడుతున్నారని ప్రజలు నిట్టూరుస్తున్నారు. మరి పోలీసు ‘బాసు’ ఇప్పటికైనా పెనుమూరు స్టేషన్‌కు ఎస్‌ఐని నియమిస్తే ప్రజలకు మేలు చేసినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment