
12.5 కోట్లకు చేరిన యూజర్లు
2024లో రూ.35,600 కోట్ల ఆదాయం
పోటాపోటీ షోలు, విస్తృతమైన టైటిల్స్
మరింత విస్తరణకు భారీ అవకాశాలు
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే.
ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్‌ఎక్స్‌టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్‌లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది.
విస్తరణ వ్యూహాలు..
అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు.
సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్‌లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది.
విలీనాలు.. కొనుగోళ్లు
భారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.
భారీగా ఆదాయం..
2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది.
వృద్ధికి భారీ అవకాశాలు..
90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు.
సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment