Cows dies
-
చీమలపాడు: ఆ తిండి తిని పశువులకు అస్వస్థత.. మూడు మృతి
క్రైమ్: ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ శ్రేణులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చగా.. వేదికకు దగ్గర్లోని ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, ఆర్పడానికి వెళ్లిన వాళ్లు అందులోని సిలిండర్ పేలి మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలు అయ్యాయి కూడా. ఈ విషాదంతో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకుంది బీఆర్ఎస్. అయితే.. సమ్మేళనం కోసం వండిన వంటకాలను గ్రామ సమీపంలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని కొన్ని పశువులు ఆ కుళ్లిపోయిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యాయి. మూడు ఆవులు మృతి చెందగా, మరికొన్నింటికి వైద్యం అందిస్తున్నారు. నలుగురు గ్రామస్తుల మృతితో విషాదంలో ఉన్న తాము అక్కడ తిండి వదిలేసిన సంగతి గమనించలేదని, పశువులు నిత్యం అటువైపు మేతకు వెళ్తుండడంతో తాము పెద్దగా పట్టించుకోలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పశువుల యజమానులు వాపోతున్నారు. -
ఆకలితో వెళ్లి.. మృత్యువుతో తల్లడిల్లి.. ఈ పాపం ఎవరిదీ?
సాక్షి, కడప: ఆకలి మాటున మృత్యువు పొంచి ఉందని తెలియని ఆవులు తనువులు చాలించాయి. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై తల్లడిల్లుతూ ప్రాణాలు వదిలాయి. కడప వైవీ స్ట్రీట్ రెండో గాంధీ విగ్రహంవద్ద డీసీసీ బ్యాంకు బ్రాంచ్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తగిలి రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాపం ఎవరిదీ? అని అక్కడ జరిగిన సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. విద్యుత్‌షాక్‌తో కాలిపోయిన మరో ఆవు నగరంలో ప్రధాన కూడలిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కంచె లేదా రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు. ట్రాన్స్ఫార్మర్కు పక్కనే చెత్త డంపును ఏర్పాటు చేయడంతో ఆవులు ఆకలితో ఏదైనా తినేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతిచెంది ఉంటాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్కు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చదవండి: నెట్టింట్లో హల్చల్ చేస్తోన్న అరుదైన జాతి దూడ -
తడోబా నుంచి పులుల రాక!
సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత నది పెద్దపులి రాకపోకలకు ప్రధాన దారిగా మారింది. నాలుగేళ్లుగా ప్రాణహిత సరిహద్దుల మీదుగా అనేక పులులు తెలంగాణలోకి అడుగు పెట్టాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆవాసాలు ఇరుకుగా మారుతున్నాయి. ఫలితంగా అక్కడి అభయారణ్యం నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో పొరుగున ఉన్న తెలంగాణ సరిహద్దులోకి కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ అడవుల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరు, మంచిర్యాల, జన్నారం, ఖానాపూర్ డివిజన్లలోని అటవీ ప్రాంతాలకు పులులు వరసకడుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలోకి ఓ పులిని అధికారులు గుర్తించారు. ఆ పులి ఆవాసం వెతుక్కుంటూ పెద్దపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ప్రస్తుతం కుమురంభీం, మంచిర్యాల జిల్లా పరిధిలో ఏడు పులుల వరకు ఉంటాయని అంచనా. అయితే ఈ పులులు ఒకేచోట స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వందల కిలోమీటర్లు అటు ఇటు సంచరిస్తూనే ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్ డివిజన్లో ఫాల్గుణ అనే ఆడ పులి రెండేళ్ల పాటు ఇక్కడే ఆవాసం ఏర్పరుచుకుని రెండు దఫాల్లో ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా పులుల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోగా.. కొత్తగా మరికొన్ని కొత్తవి వచ్చి చేరాయి. ఇలా అనేక పులులు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇక్కడే తాత్కాలికంగా ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. కెమెరాల్లో పులుల ఫొటోలు చిక్కినప్పుడుగానీ, స్థానిక పశువులపై దాడులు చేసినప్పుడు, ఎవరైనా ప్రత్యక్షంగా చూసినప్పుడుగానీ పులుల సం చారంపై అటవీ అధికారులు ధ్రువీకరించుకుంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. పశువుల మందపై దాడులు పులుల సంఖ్యకు అనుగుణంగా శాఖాహార జంతువుల లభ్యత లేకపోవడంతో స్థానిక పశువులపై నిత్యం దాడులు చేస్తున్నాయి. పశువులను మేతకు అడవుల్లోకి పంపొద్దని ఆంక్షలు ఉన్నప్పటికీ పెరిగిన సాగు విస్తీర్ణంతో మేత లభ్యత తగ్గి పశువులకు అడవులే ప్రధాన ఆధారంగా మారాయి. దీంతో పులి దాడిలో చనిపోయిన పశువులకు వాటి యజమానులకు పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్లలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోనే రూ.20 లక్షలకు పైగా పరిహారం అటవీ శాఖ నుంచి చెల్లించారు. పులికి పొంచి ఉన్న ముప్పు ఉమ్మడి ఆదిలాబాద్ విశాలమైన భూభాగం, కొండలు, గుట్టలు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పులుల ఆవాసాలకు మరింతగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సి ఉంది. మానవ కార్యకలాపాలను నిరోధించి ప్రశాంతత కల్పించాల్సిన అవసరం ఉంది. వేటగాళ్లను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చులు పులులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం చెన్నూరు డివిజన్లో సంచరిస్తున్న కే–4 ఆడపులి నడుం భాగానికి వేటగాళ్లు అమర్చిన ఇనుప తీగ చుట్టుకుని అలాగే సంచరిస్తోంది. శరీరాకృతి మారిన కొద్దీ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ పులి ప్రస్తుతం చెన్నూరు పరిధిలో అనారోగ్య స్థితిలో సంచరిస్తున్నట్లు స్థానిక అటవీ అధికారులు గుర్తించారు. ఇటీవల అరుదైన జీవి అలుగును వేటాడిన ముఠాను అటవీ అ«ధికారులు ఛేదించారు. ఇలా వేటగాళ్లతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది. వన్యప్రాణుల మనుగడతోనే మానవ జీవనం ఆధారపడి ఉన్నప్పటికీ చాలాచోట్ల వాటి ఆవాసాలకు అనుకూలంగా లేకపోవడంతో శత్రుముప్పుగా భావిస్తూ.. తిరిగి తడోబాకు వెళ్లిపోతున్నాయి. జన సంచారం అధికంగా ఉండటం, ఓపెన్‌కాస్ట్ కార్యకలాపాలు, ఆవాసాలకు ముప్పుగా మారాయి. అటవీ శాఖ నుంచి జాతీయ జంతువైన పులి మనుగడ ఆవశ్యకతపై స్థానికులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆవుల మందపై పెద్దపులి పంజా ► ఒక ఆవు మృతి, నాలుగింటికి గాయాలు ► ఆరు పులులు దాడి చేశాయి: పశువుల యజమాని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటలో సోమవారం ఉదయం ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా, నాలుగు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఆదివారం పెద్దపల్లి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించింది. జిల్లాలోకి పులి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు కూడా. కాగా సోమవారం ఉదయం ముత్తారం, రామగిరి మండల శివారులోని మచ్చుపేట బగుళ్లగుట్ట వద్ద తనకున్న 150 ఆవులను రాజయ్య మేతకు తీసుకెళ్లాడు. 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆవులు భయంతో పరుగెత్తడంతో రాజయ్య వెళ్లి చూడగా పులులు దాడి చేస్తున్నట్లు గుర్తించాడు. భయంతో సమీపంలోని పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు, ఆ తర్వాత గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. తన పశువుల మందపై ఆరు పులులు దాడి చేశాయని రాజయ్య చెబుతున్నాడు. అటవీశాఖ అధికారి రవిప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. కాగా ఇప్పటివరకు ఒక్క పెద్దపులిని మాత్రమే అధికారులు నిర్ధారించారు. -
గోవుల మృత్యు ఘోష
గోవు సర్వదేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. భారతీయ సనాతన సంప్రదాయంలో గోవు పరమ పూజనీయమైనది. అలాంటి గోమాతలు నీడ కరువై.. యజమానికి బరువై రోడ్డుపాలవుతున్నాయి. చివరకు గోశాలలకు చేరినా దారుణమైన హింసకు గురవుతున్న విషయం కళ్లముందు కనిపించే వాస్తవం. అధిక సంఖ్యలో గోవులు ఒకే గోశాలలో మగ్గుతుండటం అయ్యుండొచ్చు.. అధికారుల నిర్లక్ష్యం శాపంగా పరిణమించడం కావచ్చు.. తీరని బాధలతో గోమాత అంబా.. అని అరచినా.. కనికరించేవారు కరువయ్యారు. చివరకు గోమాతలు బతకలేక.. చావుకేక పెడుతున్నాయి. కమిటీ సభ్యులు కూడా అడపాదడపానే వెళ్తారు. అక్కడ గోవులు చనిపోయాయని తెలిసినా స్పందన తక్కువే. ఈ నిర్లక్ష్యమే 86 గోవులు చనిపోవడానికి కారణమని సంఘ సభ్యులే ఆరోపిస్తుండటం కొసమెరుపు. సాక్షి, తాడేపల్లి(కృష్ణా) : జిల్లాలో గోశాలల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. అసలు జిల్లాలో ఎన్ని గోశాలలు ఉన్నాయనే సమాచారం పశు సంవర్ధక శాఖ వద్ద లేదు. అయితే విజయవాడలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మల్లికార్జున పేటలోనూ, కొత్తూరుతాడేపల్లిలోనూ గోశాలలను నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా మచిలీపట్నం, జీ.కొండూరు, కొండపావులూరు, పెదముత్తేవి, గొల్లపూడిలలో గోప్రేమికులు, స్వామీజీలు గోశాలలను నిర్వహిస్తున్నారు. ఆయా వ్యక్తుల సొంత నిధులతో పాటు దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే వీటిని కొనసాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. ► గోశాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి తప్పని సరి. అయితే ప్రస్తుతం గోవులు చనిపోయిన గోశాలకు అనుమతి లేదు. గోశాల సంఘాన్ని మాత్రం రిజిస్టర్ చేసుకున్నారు. జిల్లాలోని ఏ గోశాలకూ ప్రభుత్వ అనుమతులు లేవు. ► నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఆవుకు 35 నుంచి 50 అడుగుల షెడ్డు, 80 నుంచి 100 అడుగులు తిరిగే ప్రదేశం కావాలి. దూడలకు 10 నుంచి 20 అడుగులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం గోవులు చనిపోయిన గోశాలలో ఏడు ఎకరాల్లో 1,400కు పైగా గోవుల్ని ఉంచారు. ► పాలిచ్చే గోవుకు రోజుకు 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డి, 25 కేజీల పచ్చగడ్డి దాణా అందించాలి. ముసలి, ఒట్టిపోయిన గోవులకు రోజుకు 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డి 10 కేజీల పచ్చగడ్డి పెట్టాలి. అయితే, గోశాలల్లోని గోవులకు తగినంత మేత అందుబాటులో ఉండటం లేదు. ► ప్రభుత్వం సూచించిన ప్రకారం పశువులకు టీకా మందులు వేయాలి. వందల సంఖ్యలో గోవులను మెయింటెన్ చేసే గోశాలలో అనారోగ్యం చేసినప్పుడు ఇంజక్షన్లు చేయిస్తారు తప్ప టీకాలు వేయడం లేదు. ► ప్రతి ఐదారు వందల పశువులకు ఒక పశు వైద్యుడు, కాంపౌండర్, అటెండర్ ఉండాలి. ► ఆవులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా షెడ్లు వేయాలి. వాటికి పూర్తిస్థాయిలో గాలి, వెలుతురు వచ్చే విధంగా ఎతైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. ► ఆవులు దోమలు, పురుగులు బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు దోమల నిరోధన పొగ వేయించాలి. ► దోమలు అధికంగా ఉన్నప్పుడు దోమ తెరలు, ఊక పొగలు వేయాలి. అయితే ఇవేమీ గోశాలలో ఉండదు. ఆవులు విసర్జించే మలమూత్రాలను రెండుమూడు గంటలకు ఒకసారి చూసి తీసివేయాలి. పశువులు ఒక పూట ఆహారం తీసుకోకపోయినా వెంటనే వైద్యుడితో పరీక్ష చేయించాలి. ► గోవులకు వేసే మేతను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కొక్కసారి రసాయనాలు ఎక్కువగా వాడితే మేత పచ్చగానే కనిపిస్తుందిగానీ గోవులకు వాతం చేసి వెంటనే చనిపోతాయి. ► అంటువ్యాధులు, అనారోగ్యంతో బాధ పడే / పడుతున్న ఆవులను మిగిలిన పశువులకు దూరంగా ఉంచాలి. వాటి వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పశు వైద్యుల పర్యవేక్షణ నిల్.... జిల్లాలో ఉన్న గోశాలలన్నీ ఏడాదికి ఒక్కసారి కూడా పశు వైద్యులు పర్యవేక్షించరు. అక్కడ గోవుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా వుంది.. నిర్వాహకులు గోవులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుతున్నారా? లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. వైద్యులు తనిఖీకి వెళ్తే నిర్వాహకులు తమ ఆర్థిక సమస్యలను ఏకరువు పెడుతూ ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పించమంటూ డిమాండ్ చేస్తారు. కొంతమంది తమ వద్ద ఉన్న గోవుల్ని అక్కడ నుంచి మరో చోటకు తీసుకువెళ్లిపోయినా తమకు అభ్యంతరం లేదని పశు వైద్యులకు బదులిస్తున్నారు. అయితే గోశాల నుంచి స్వాధీనం చేసుకున్న పశువుల్ని ఎక్కడకు తరలించాలో తెలీని అధికారులు అసలు తనిఖీలు చేయడమే మానేశారు. దీంతో గోవులకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన మౌనంగా రోదించడమే తప్ప పట్టించుకునేవారే లేరు. మూతపడిన జిల్లా జంతు హింస నివారణ సంస్థ కబేళాకు తరలించే గోవుల్ని పట్టుకుని వాటిని కొద్దిరోజులు పోషించిన తర్వాత పశు ప్రేమికులకు అప్పగించాలనే ఉద్దేశ్యంలో 2017లో మండవల్లి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా జంతు హింస నివారణ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి తగిన నిధులు రాకపోవడంతో కొద్దిరోజులకే అది మూత పడింది. దీంతో ఎక్కడైనా గోవుల్ని పట్టుకుని సమీపంలోని గోశాలలకు తరలిస్తున్నారు. గోవు కళేబరాన్ని క్రేన్‌తో తరలిస్తున్న దృశ్యం కబేళాకు తరలిస్తున్న ఆవులతోనే సమస్య కబేళాల నిర్వాహకులు పదుల సంఖ్యలో గోవులను గ్రామాల నుంచి సేకరిస్తారు. వీటన్నింటిని ఒకే లారీలో కుక్కి కబేళాకు తరలిస్తారు. విజయవాడలోని గో ప్రేమికులు, పోలీసులు జాతీయ రహదారిపై తరచూ నిఘా పెడతారు. వీరికి ఈ గోవులు తరలిస్తున్న లారీలు దొరికినప్పుడు వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని గోశాలలకు బలవంతంగా తరలించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విధంగా పట్టుకున్న గోవుల కోసం ప్రత్యేకంగా ఒక గోశాలను ప్రభుత్వమే నిర్వహిస్తే సమస్యలు చాలా మటుకు తీరతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవులపై వివక్షత. వాస్తవంగా పాలు ఇచ్చి, సంతానోత్పత్తి చేసే గోవులపై గోశాల నిర్వాహకులు అత్యంత ప్రేమ చూపిస్తుంటారు. ముసలివి, ఎండిపోయిన గోవులు నిర్వాహకులకు భారంగా మారాయి. విజయవాడలోని గోసంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రెండు రకాల గోశాలలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించే గోశాలలో పాలిచ్చే గోవుల్ని ఉంచుతారు. వీటికి గోశాల నిర్వాహకులు ఇచ్చే మేతతో పాటు దుర్గ గుడికి వచ్చే భక్తులు కూడా మేత అందిస్తుంటారు. -
మూగజీవాలపై విషప్రయోగం
సీతానగరం: మూగజీవాలపై విషప్రయోగం చేసిన సంఘటన మండలంలోని బూర్జ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఆవు, ఎద్దు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కోట శివున్నాయుడు కుమారులు పోలినాయుడు, శ్రీనివాసరావు వేర్వేరుగా ఉంటున్నా వ్యవసాయం కలిసే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆవులు, ఎద్దులు పెంచుతున్నారు. పోలినాయుడు, శ్రీనివాసరావు ప్రతి రోజూ సాయంత్రం పశువులకు కుడితి పెట్టి ఇంటికి వస్తుంటారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం కూడా శాలలో ఉన్న పశువులకు కుడితి పెట్టి వీరిద్దరూ ఇంటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా ఆవు, ఎద్దు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాయి. వెంటనే పశువైద్యాధికారి ఎస్. రామారావుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి విషప్రయోగం వల్లే పశువులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఎవరో గిట్టని వారే ఈ పని చేసుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో సుమారు 60 వేల రూపాయల విలువ చేసే ఆవు, ఎద్దు మృతి చెందాయని బాధితులు లబోదిబోమంటున్నారు. నెలలో రెండో నష్టం ఏప్రిల్ ఒకటో తేదీ రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు, దుకాణం, ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు కూడా పోలినాయుడికి చెందినదే. ఎవరో కావాలనే తమపై కక్ష కట్టి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
నష్టాలపాలు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది జిల్లాలో సబ్సిడీ ఆవులు పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితి. ఆవులతోనైనా అప్పులు పూడ్చుకోవచ్చని భావించిన పేదలకు చివరకు కష్టాలు.. నష్టాలే మిగులుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినఆవులు ఇక్కడమనలేక మృత్యువాతపడుతున్నాయి. వీటికి బీమా సొమ్మూ ఇవ్వకుండా అధికారులు అప్పులపాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అంటగట్టారు నాకు పట్టించిన ఆవులు ఏమీ బాగోలేవు. ఇవి వద్దన్నా బ్యాంకర్లు, పశువైద్యాధికారులు వినలేదు. మీకు సబ్సిడీ ఆవులు కావాలంటే వీటినే పట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. చేసేది లేక వారు చూపించిన వాటినే పట్టుకున్నా. ఆవులు ఇంటికి చేరేలోపే ఓ ఆవుకు కడుపులోనే దూడ చనిపోయింది. దూడను బయటకు తీసి ఆవుకు వైద్యం చేయాలని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆవుకూడా చనిపోయింది. – వేద, మహిళా రైతు, ఎట్టేరి చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో 2017–18కి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 920 పాడి ఆవులు పంపిణీ చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారునికి రెండేసి ఆవులను అంటగట్టారు. వీటిని ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు చేసేవిధంగా అధికారులు ఆంక్షలు విధించారు. సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆవులను పట్టించి ఇచ్చారు. అక్కడి ఆవులు ఇక్కడ మనుగడ సాగించలేకపోతున్నాయి. వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. నెల తిరక్కనే.. సబ్సిడీ ఆవులు ఇక్కడికొచ్చిన నెల రోజులకే పాడెక్కుతున్నాయి. బ్యాంకర్లు, వైద్యాధికారులు పక్కరాష్ట్రాల్లో ఆవులను పట్టిస్తున్నారే గానీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాక పట్టించుకోవడం లేదు. కొన్ని చూలు ఆవులు ఇక్కడకు చేరుకునే సమయానికే కడుపులోనే దూడలు చనిపోతున్నాయి. లబ్ధిదారులు వైద్యాధికారులకు తెలిపినా సకాలంలో స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 సబ్సిడీ ఆవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఒకే గ్రామంలోనే 8 ఆవులు.. గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామస్తులకు తమిళనాడులోని నామక్కళ్ గ్రామం వద్ద మొత్తం 22 ఆవులను అధికారులు పట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఐదు ఆవులకు కడుపులోనే దూడలు చనిపోయాయి. మరో వారం రోజులకే మూడు ఆవులు వింత వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఇంకో రెండు ఆవుల పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుల ఊబిలోకి లబ్ధిదారులు సబ్సిడీ పేరుతో ఆవులు పొందిన లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు. బ్యాంకులో రుణం చెల్లించలేక.. పెట్టుబడీ చేతికి రాక చితికిపోతున్నారు. బీమా ఏదీ? సబ్సిడీ ఆవులకు బీమా తప్పనిసరి. బీమా చేసిన ఆవుల చెవులకు ఏజెంట్లు గుర్తుగా కమ్మ వేయాలి. కానీ ఆ ఏజెంట్లు గ్రామాలకు వచ్చే సమయానికే ఆవులు వ్యాధుల బారినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజెంట్లు వాటికి కమ్మ వేసేందుకు సమ్మతించడంలేదు. బీమా వర్తించకనే ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సబ్సిడీ..దోపిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే మొత్తాలు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆవులను పట్టించేందుకు వెళుతున్న బ్యాంకర్లు, వైద్యాధికారులు అక్కడి పాడి ఆవుల దళారీలతో కుమ్మక్కై సబ్సిడీ నిధులను అప్పనంగా దిగమింగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి ఆవుకూ రూ.50 వేలు కేటాయించగా, అందులో రూ.20 వేలు లబ్ధిదారునికి బ్యాంకు రుణం, మిగిలిన రూ.30 వేలు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద అందించాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు, వైద్యాధికారులు రూ.20 వేల విలు చేసే ఆవులను పట్టించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని దిగమింగుతున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దోచేసుకున్నారు ఆవులకు కార్పొరేషన్ అందించే సబ్సిడీని బ్యాంకర్లు, వైద్యాధికారులు దోచేసుకున్నారు. మాకు పట్టించిన ఆవులు ఒక్కొక్కటీ రూ.20 వేలే చేస్తాయి. రూ.50 వేలని పట్టించారు. మిగిలిన డబ్బులు వారే పంచుకున్నారు. ఆఖరుకు ఇటు ఆవూలేక.. అటు రుణం తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాం. – రాధిక, మహిళారైతు, ఎట్టేరి బీమా లేదు బ్యాంకు రుణం ద్వారా పట్టుకొస్తున్న ఆవులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. తమిళనాడు నుంచి ఆవులు ఇక్కడకు తీసుకొచ్చే సమయానికే కొన్ని జబ్బు చేసి పైకిలేవలేని స్థితికి చేరుతున్నాయి. బీమా ఏజెంట్లకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. – జయలక్ష్మి, మహిళా రైతు, ఎట్టేరి జాగ్రత్తగా చూసుకోక పోవడం వల్లే పక్క రాష్ట్రాల్లో పట్టిస్తున్న ఆవులకు అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొందరు అలా చేయడంలేదు. అందువల్లే కొన్ని ఆవులు చనిపోతున్నాయి. – వెంకట్రావ్, జేడీ, పశుసంవర్థకశాఖ -
పశుగ్రాసం కరువై.. ఆకలికి తాళలేక..
దైద(గురజాల రూరల్)/మాచర్ల రూరల్: పశుగ్రాసం కరువై ఆకలికి తాళలేక జొన్న పిలకలు తిన్న 56 గోమాతలు అకాలమృత్యువు పాలయ్యాయి. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన గుండాల లక్ష్మయ్యకు 100 ఆవులు ఉన్నాయి. గతేడాది లాగే ఈసారీ పల్నాడు ప్రాంతానికి వచ్చి గత 45 రోజుల నుంచి అనేక చోట్ల ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దైద ప్రాంతానికి ఆవులను మేపటానికి తోలుకొచ్చాడు. పక్కనే ఉన్న పొలంలో జొన్న పిలకలు తిన్న ఆవులు సుడులు తిరుగుతూ కింద పడి మృతిచెందాయి. కొన్ని ఆవులకు రూ.25 వేలు వెచ్చించి 25 పామ్ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 56 ఆవులు మృతిచెందడంతో లక్ష్మయ్య కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులు మృతి చెందటానికి జొన్న పిలకలు విషపూరితమవటమే కారణమని తెలుస్తోంది. నాటు జొన్న కోత అనంతరం వచ్చే పిలకలు సైనేడ్ కంటే ప్రమాదకరమని గురజాల వెటర్నరీ ఏడీ హనుమంతరావు తెలిపారు. -
కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం: 14 ఆవులు మృతి
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూరు సబ్ స్టేషన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను డీసీఎం ఢీకొనడంతో అందులో ఉన్న 14 ఆవులు మృతిచెందాయి. డీసీఎం డ్రైవర్ అంజి, పశువుల వ్యాపారి బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం నుంచి షాద్‌నగర్‌కు ఈ పశువులను తీసుకెళ్తున్నారు. డీసీఎం డ్రైవర్ కునుకు తీయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. చనిపోయిన పశువుల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉండవచ్ఛని ఎస్ఐ లెనిన్ తెలిపారు. -
కంటైనర్ బోల్తా: 20 ఆవులు మృతి
హైదరాబాద్: నగరం శివారులోని హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆదివారం ఓ కంటైనర్ బోల్తా పడింది. దాంతో ఆ కంటైనర్‌లో తరలిస్తున్న అవులలో 20 అవులు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొన్ని అవులు తీవ్రంగా గాయపడ్డాయి. కంటైనర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. గోవులను కంటైనర్‌లో రహస్యంగా నగరానికి తీసుకువస్తున్న క్రమంలో అధిక లోడ్ కారణంగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.