తడోబా నుంచి పులుల రాక! | Tigers Killed Three Cows At Peddapalli Telangana | Sakshi
Sakshi News home page

తడోబా నుంచి పులుల రాక!

Published Tue, Sep 8 2020 3:39 AM | Last Updated on Tue, Sep 8 2020 4:48 AM

Tigers Killed Three Cows At Peddapalli Telangana - Sakshi

పులి దాడిలో మృతిచెందిన ఆవును పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత నది పెద్దపులి రాకపోకలకు ప్రధాన దారిగా మారింది. నాలుగేళ్లుగా ప్రాణహిత సరిహద్దుల మీదుగా అనేక పులులు తెలంగాణలోకి అడుగు పెట్టాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆవాసాలు ఇరుకుగా మారుతున్నాయి. ఫలితంగా అక్కడి అభయారణ్యం నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో పొరుగున ఉన్న తెలంగాణ సరిహద్దులోకి కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని కవ్వాల్‌ అడవుల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరు, మంచిర్యాల, జన్నారం, ఖానాపూర్‌ డివిజన్లలోని అటవీ ప్రాంతాలకు పులులు వరసకడుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలోకి ఓ పులిని అధికారులు గుర్తించారు. ఆ పులి ఆవాసం వెతుక్కుంటూ పెద్దపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది.

ప్రస్తుతం కుమురంభీం, మంచిర్యాల జిల్లా పరిధిలో ఏడు పులుల వరకు ఉంటాయని అంచనా. అయితే ఈ పులులు ఒకేచోట స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వందల కిలోమీటర్లు అటు ఇటు సంచరిస్తూనే ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఫాల్గుణ అనే ఆడ పులి రెండేళ్ల పాటు ఇక్కడే ఆవాసం ఏర్పరుచుకుని రెండు దఫాల్లో ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా పులుల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోగా.. కొత్తగా మరికొన్ని కొత్తవి వచ్చి చేరాయి. ఇలా అనేక పులులు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇక్కడే తాత్కాలికంగా ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. కెమెరాల్లో పులుల ఫొటోలు చిక్కినప్పుడుగానీ, స్థానిక పశువులపై దాడులు చేసినప్పుడు, ఎవరైనా ప్రత్యక్షంగా చూసినప్పుడుగానీ పులుల సం చారంపై అటవీ అధికారులు ధ్రువీకరించుకుంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.  

పశువుల మందపై దాడులు 
పులుల సంఖ్యకు అనుగుణంగా శాఖాహార జంతువుల లభ్యత లేకపోవడంతో స్థానిక పశువులపై నిత్యం దాడులు చేస్తున్నాయి. పశువులను మేతకు అడవుల్లోకి పంపొద్దని ఆంక్షలు ఉన్నప్పటికీ పెరిగిన సాగు విస్తీర్ణంతో మేత లభ్యత తగ్గి పశువులకు అడవులే ప్రధాన ఆధారంగా మారాయి. దీంతో పులి దాడిలో చనిపోయిన పశువులకు వాటి యజమానులకు పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్లలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోనే రూ.20 లక్షలకు పైగా పరిహారం అటవీ శాఖ నుంచి చెల్లించారు.  

పులికి పొంచి ఉన్న ముప్పు 
ఉమ్మడి ఆదిలాబాద్‌ విశాలమైన భూభాగం, కొండలు, గుట్టలు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పులుల ఆవాసాలకు మరింతగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సి ఉంది. మానవ కార్యకలాపాలను నిరోధించి ప్రశాంతత కల్పించాల్సిన అవసరం ఉంది. వేటగాళ్లను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చులు పులులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం చెన్నూరు డివిజన్‌లో సంచరిస్తున్న కే–4 ఆడపులి నడుం భాగానికి వేటగాళ్లు అమర్చిన ఇనుప తీగ చుట్టుకుని అలాగే సంచరిస్తోంది. శరీరాకృతి మారిన కొద్దీ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ పులి ప్రస్తుతం చెన్నూరు పరిధిలో అనారోగ్య స్థితిలో సంచరిస్తున్నట్లు స్థానిక అటవీ అధికారులు గుర్తించారు. ఇటీవల అరుదైన జీవి అలుగును వేటాడిన ముఠాను అటవీ అ«ధికారులు ఛేదించారు. ఇలా వేటగాళ్లతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది. వన్యప్రాణుల మనుగడతోనే మానవ జీవనం ఆధారపడి ఉన్నప్పటికీ చాలాచోట్ల వాటి ఆవాసాలకు అనుకూలంగా లేకపోవడంతో శత్రుముప్పుగా భావిస్తూ.. తిరిగి తడోబాకు వెళ్లిపోతున్నాయి. జన సంచారం అధికంగా ఉండటం, ఓపెన్‌కాస్ట్‌ కార్యకలాపాలు, ఆవాసాలకు ముప్పుగా మారాయి. అటవీ శాఖ నుంచి జాతీయ జంతువైన పులి మనుగడ ఆవశ్యకతపై స్థానికులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.  

ఆవుల మందపై పెద్దపులి పంజా 
► ఒక ఆవు మృతి, నాలుగింటికి గాయాలు 
► ఆరు పులులు దాడి చేశాయి: పశువుల యజమాని
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేటలో సోమవారం ఉదయం ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా, నాలుగు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి ఆదివారం పెద్దపల్లి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించింది. జిల్లాలోకి పులి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు కూడా. కాగా సోమవారం ఉదయం ముత్తారం, రామగిరి మండల శివారులోని మచ్చుపేట బగుళ్లగుట్ట వద్ద తనకున్న 150 ఆవులను రాజయ్య మేతకు తీసుకెళ్లాడు. 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆవులు భయంతో పరుగెత్తడంతో రాజయ్య వెళ్లి చూడగా పులులు దాడి చేస్తున్నట్లు గుర్తించాడు. భయంతో సమీపంలోని పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు, ఆ తర్వాత గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. తన పశువుల మందపై ఆరు పులులు దాడి చేశాయని రాజయ్య చెబుతున్నాడు. అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. కాగా ఇప్పటివరకు ఒక్క పెద్దపులిని మాత్రమే అధికారులు నిర్ధారించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement