పెద్దపల్లి గూడ్స్‌ ప్రమాదం: వందేభారత్‌ సహా రద్దైన రైళ్ల వివరాలివే.. | Peddapalli goods train derails: SC Railway Cancelled These Trains Details | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి గూడ్స్‌ ప్రమాదం: వందేభారత్‌ సహా రద్దైన రైళ్ల వివరాలివే..

Published Wed, Nov 13 2024 7:52 AM | Last Updated on Wed, Nov 13 2024 10:16 AM

Peddapalli goods train derails: SC Railway Cancelled These Trains Details

పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్‌ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్‌(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్‌ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్‌ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్‌ వద్దకు  ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.

ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్‌ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.

రద్దు.. డైవర్షన్‌.. రీషెడ్యూల్‌
ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌ రైళ్లను రద్దు చేశారు.

అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్‌ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.

దారి మళ్లించిన రైల్వే వివరాలు 
జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

 

 

 

 


ఏం జరిగిందంటే..
మంగళవారం నిజామాబాద్‌ నుంచి ఘజియాబాద్‌ వైపు 43 వ్యాగన్లతో ఐరన్‌ కాయల్స్‌ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌–కన్నాల గేట్‌ మధ్యలో 282/35 పోల్‌ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు.   రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు.  

ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్‌ పోల్స్‌ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్‌ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్‌ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement