గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్‌ వంతెన గడ్డర్లు | Telangana: Peddapalli Oded bridge collapses again | Sakshi
Sakshi News home page

గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్‌ వంతెన గడ్డర్లు

Published Wed, Jul 3 2024 7:18 AM | Last Updated on Wed, Jul 3 2024 8:31 AM

Telangana: Peddapalli Oded bridge collapses again

పెద్దపల్లి, సాక్షి:  ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. 

మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్‌అండ్‌బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 

2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.

భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement