కొత్తూరు తాడేపల్లి గోశాలలో మరణించిన ఆవులు
గోవు సర్వదేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. భారతీయ సనాతన సంప్రదాయంలో గోవు పరమ పూజనీయమైనది. అలాంటి గోమాతలు నీడ కరువై.. యజమానికి బరువై రోడ్డుపాలవుతున్నాయి. చివరకు గోశాలలకు చేరినా దారుణమైన హింసకు గురవుతున్న విషయం కళ్లముందు కనిపించే వాస్తవం. అధిక సంఖ్యలో గోవులు ఒకే గోశాలలో మగ్గుతుండటం అయ్యుండొచ్చు.. అధికారుల నిర్లక్ష్యం శాపంగా పరిణమించడం కావచ్చు.. తీరని బాధలతో గోమాత అంబా.. అని అరచినా.. కనికరించేవారు కరువయ్యారు. చివరకు గోమాతలు బతకలేక.. చావుకేక పెడుతున్నాయి. కమిటీ సభ్యులు కూడా అడపాదడపానే వెళ్తారు. అక్కడ గోవులు చనిపోయాయని తెలిసినా స్పందన తక్కువే. ఈ నిర్లక్ష్యమే 86 గోవులు చనిపోవడానికి కారణమని సంఘ సభ్యులే ఆరోపిస్తుండటం కొసమెరుపు.
సాక్షి, తాడేపల్లి(కృష్ణా) : జిల్లాలో గోశాలల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. అసలు జిల్లాలో ఎన్ని గోశాలలు ఉన్నాయనే సమాచారం పశు సంవర్ధక శాఖ వద్ద లేదు. అయితే విజయవాడలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మల్లికార్జున పేటలోనూ, కొత్తూరుతాడేపల్లిలోనూ గోశాలలను నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా మచిలీపట్నం, జీ.కొండూరు, కొండపావులూరు, పెదముత్తేవి, గొల్లపూడిలలో గోప్రేమికులు, స్వామీజీలు గోశాలలను నిర్వహిస్తున్నారు. ఆయా వ్యక్తుల సొంత నిధులతో పాటు దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే వీటిని కొనసాగిస్తున్నారు.
నిబంధనలకు తూట్లు..
► గోశాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి తప్పని సరి. అయితే ప్రస్తుతం గోవులు చనిపోయిన గోశాలకు అనుమతి లేదు. గోశాల సంఘాన్ని మాత్రం రిజిస్టర్ చేసుకున్నారు. జిల్లాలోని ఏ గోశాలకూ ప్రభుత్వ అనుమతులు లేవు.
► నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఆవుకు 35 నుంచి 50 అడుగుల షెడ్డు, 80 నుంచి 100 అడుగులు తిరిగే ప్రదేశం కావాలి. దూడలకు 10 నుంచి 20 అడుగులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం గోవులు చనిపోయిన గోశాలలో ఏడు ఎకరాల్లో 1,400కు పైగా గోవుల్ని ఉంచారు.
► పాలిచ్చే గోవుకు రోజుకు 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డి, 25 కేజీల పచ్చగడ్డి దాణా అందించాలి. ముసలి, ఒట్టిపోయిన గోవులకు రోజుకు 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డి 10 కేజీల పచ్చగడ్డి పెట్టాలి. అయితే, గోశాలల్లోని గోవులకు తగినంత మేత అందుబాటులో ఉండటం లేదు.
► ప్రభుత్వం సూచించిన ప్రకారం పశువులకు టీకా మందులు వేయాలి. వందల సంఖ్యలో గోవులను మెయింటెన్ చేసే గోశాలలో అనారోగ్యం చేసినప్పుడు ఇంజక్షన్లు చేయిస్తారు తప్ప టీకాలు వేయడం లేదు.
► ప్రతి ఐదారు వందల పశువులకు ఒక పశు వైద్యుడు, కాంపౌండర్, అటెండర్ ఉండాలి.
► ఆవులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా షెడ్లు వేయాలి. వాటికి పూర్తిస్థాయిలో గాలి, వెలుతురు వచ్చే విధంగా ఎతైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి.
► ఆవులు దోమలు, పురుగులు బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు దోమల నిరోధన పొగ వేయించాలి.
► దోమలు అధికంగా ఉన్నప్పుడు దోమ తెరలు, ఊక పొగలు వేయాలి. అయితే ఇవేమీ గోశాలలో ఉండదు. ఆవులు విసర్జించే మలమూత్రాలను రెండుమూడు గంటలకు ఒకసారి చూసి తీసివేయాలి. పశువులు ఒక పూట ఆహారం తీసుకోకపోయినా వెంటనే వైద్యుడితో పరీక్ష చేయించాలి.
► గోవులకు వేసే మేతను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కొక్కసారి రసాయనాలు ఎక్కువగా వాడితే మేత పచ్చగానే కనిపిస్తుందిగానీ గోవులకు వాతం చేసి వెంటనే చనిపోతాయి.
► అంటువ్యాధులు, అనారోగ్యంతో బాధ పడే / పడుతున్న ఆవులను మిగిలిన పశువులకు దూరంగా ఉంచాలి. వాటి వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పశు వైద్యుల పర్యవేక్షణ నిల్....
జిల్లాలో ఉన్న గోశాలలన్నీ ఏడాదికి ఒక్కసారి కూడా పశు వైద్యులు పర్యవేక్షించరు. అక్కడ గోవుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా వుంది.. నిర్వాహకులు గోవులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుతున్నారా? లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. వైద్యులు తనిఖీకి వెళ్తే నిర్వాహకులు తమ ఆర్థిక సమస్యలను ఏకరువు పెడుతూ ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పించమంటూ డిమాండ్ చేస్తారు. కొంతమంది తమ వద్ద ఉన్న గోవుల్ని అక్కడ నుంచి మరో చోటకు తీసుకువెళ్లిపోయినా తమకు అభ్యంతరం లేదని పశు వైద్యులకు బదులిస్తున్నారు. అయితే గోశాల నుంచి స్వాధీనం చేసుకున్న పశువుల్ని ఎక్కడకు తరలించాలో తెలీని అధికారులు అసలు తనిఖీలు చేయడమే మానేశారు. దీంతో గోవులకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన మౌనంగా రోదించడమే తప్ప పట్టించుకునేవారే లేరు.
మూతపడిన జిల్లా జంతు హింస నివారణ సంస్థ
కబేళాకు తరలించే గోవుల్ని పట్టుకుని వాటిని కొద్దిరోజులు పోషించిన తర్వాత పశు ప్రేమికులకు అప్పగించాలనే ఉద్దేశ్యంలో 2017లో మండవల్లి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా జంతు హింస నివారణ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి తగిన నిధులు రాకపోవడంతో కొద్దిరోజులకే అది మూత పడింది. దీంతో ఎక్కడైనా గోవుల్ని పట్టుకుని సమీపంలోని గోశాలలకు తరలిస్తున్నారు.
గోవు కళేబరాన్ని క్రేన్‌తో తరలిస్తున్న దృశ్యం
కబేళాకు తరలిస్తున్న ఆవులతోనే సమస్య
కబేళాల నిర్వాహకులు పదుల సంఖ్యలో గోవులను గ్రామాల నుంచి సేకరిస్తారు. వీటన్నింటిని ఒకే లారీలో కుక్కి కబేళాకు తరలిస్తారు. విజయవాడలోని గో ప్రేమికులు, పోలీసులు జాతీయ రహదారిపై తరచూ నిఘా పెడతారు. వీరికి ఈ గోవులు తరలిస్తున్న లారీలు దొరికినప్పుడు వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని గోశాలలకు బలవంతంగా తరలించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విధంగా పట్టుకున్న గోవుల కోసం ప్రత్యేకంగా ఒక గోశాలను ప్రభుత్వమే నిర్వహిస్తే సమస్యలు చాలా మటుకు తీరతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గోవులపై వివక్షత.
వాస్తవంగా పాలు ఇచ్చి, సంతానోత్పత్తి చేసే గోవులపై గోశాల నిర్వాహకులు అత్యంత ప్రేమ చూపిస్తుంటారు. ముసలివి, ఎండిపోయిన గోవులు నిర్వాహకులకు భారంగా మారాయి. విజయవాడలోని గోసంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రెండు రకాల గోశాలలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించే గోశాలలో పాలిచ్చే గోవుల్ని ఉంచుతారు. వీటికి గోశాల నిర్వాహకులు ఇచ్చే మేతతో పాటు దుర్గ గుడికి వచ్చే భక్తులు కూడా మేత అందిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment