మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత | we will give subcidy to who were come | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత

Published Sat, Aug 8 2015 4:34 AM | Last Updated on Sat, Aug 11 2018 7:29 PM

మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత - Sakshi

మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత

  1.      ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్యశాఖల్లో ఇక చేనేత వస్త్రాలే
  2.      కార్మికులకు రాయితీలు అందిస్తాం.. ఆర్థికంగా ఎదిగేలా చేస్తాం
  3.      నిఫ్ట్ సహకారంతో చేనేత వస్త్రాలకు కొత్త హంగులు
  4.      ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జరిపేలా చర్యలు: జూపల్లి
  5.  సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చేనేత కార్మికులకు రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సాయం అడిగే పరిస్థితి నుంచి మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత రంగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. శుక్రవారమిక్కడ వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

    నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం, జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) రీజినల్ డెరైక్టర్ ఈశ్వర్‌పాటిల్, ఆప్కో డెరైక్టర్ బాబూరావు, పద్మశ్రీ అవార్డు గ్ర హీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేత ను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖల్లో వాడే యూనిఫారాలకు సైతం చేనేత వస్త్రాలనే వాడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు.

    వీటితో పాటు పరిశ్రమల్లో యూనిఫారాలు, నేవీ, ఆర్మీ తదితర దళాల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు వినియోగించేలా ప్రధానితో చర్చిస్తామన్నారు. ఆధునిక వస్త్రధారణకు తగ్గట్టుగా నిఫ్ట్ వంటి సంస్థల భాగస్వామ్యంతో చేనేత వస్త్రాలను తీర్చిదిద్దుతామని, ప్రపంచం నలుమూలలకు వస్త్రాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెజాన్ వంటి ప్రపంచస్థాయి కంపెనీల సహకారంతో ఆన్‌లైన్‌లోనూ ఈ వస్త్రాల విక్రయం జరిగేలా చూస్తామన్నారు. ఆప్కో ద్వారా చేనేత కార్మికులకు బకాయిలు చెల్లించే విధానం సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నెలలోపే డబ్బు అందేలా కొత్త పద్ధతి తెస్తామన్నారు. కార్మికుల ఆత్మహత్యలను నివారిస్తామన్నారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల నాయకులు మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. బడ్జెట్‌లో చేనేతకు రూ.200 కోట్లు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, చేనేత కార్మికుల పిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గజం అంజయ్య, గజం గోవర్ధన్‌లను మంత్రి సన్మానించారు.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement