minister jupalli krishnarao
-
వినియోగించని భూములు స్వాధీనం
ఇప్పటికే 400 పారిశ్రామిక ఎకరాలు వెనక్కి: జూపల్లి ♦ 15 సెజ్‌లకు నోటీసుల జారీ టీఎస్-ఐపాస్ దేశానికే తలమానికం ♦ ఇప్పటికే 35 వేల కోట్ల పెట్టుబడులు ♦ 1.31 లక్షల మందికి ఉపాధి దొరికిందని సభలో మంత్రి ప్రకటన సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఎస్ఈజెడ్ల ఏర్పాటుకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లక్ష్యం కోసం వినియోగించకుండా ఉంచితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని తెలంగాణ వ్యాప్తంగా 400 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో 43 ఎస్ఈజెడ్లకు గతంలో భూములు కేటాయించగా.. 28 మాత్రమే నిర్వహణలో ఉన్నాయన్నారు. మిగతావాటికి నోటీసులు జారీ చేశామని, వాటి విషయంలో త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 258 పారిశ్రామిక యూనిట్లకు 269 ఎకరాలను మాత్రమే కేటాయించిందన్నారు. టీఎస్-ఐపాస్ విధానం ద్వారా అనుమతించిన పరిశ్రమలు, వచ్చిన పెట్టుబడులు, ఉపాధి పొందినవారి వివరాలు చెప్పాలంటూ ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గంగుల కమలాకర్, గువ్వల బాలరాజు, చింతా ప్రభాకర్, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, వివేకానంద, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, రవీంద్రకుమార్ తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ సమాధానం చెప్పారు. పారిశ్రామిక రంగంలో దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలిచేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నట్టు ఆయన వెల్లడించారు. ‘విద్యుత్’ ధర్నాలు ఇప్పుడు లేవు కరెంటు కోసం ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఎక్కడా కోతలు లేకపోతుండటంతో సంతోషంగా ఉన్నారన్నారు. టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం కింద గత సంవత్సరం జనవరి నుంచి తాజా మార్చి 15 నాటికి 2,019 యూనిట్లు ఏర్పడ్డాయని, వాటి రూపంలో రూ.34,914 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,31,589 మందికి ఉపాధి కలిగిందని సభకు జూపల్లి వివరించారు. భూముల కేటాయింపులో చైనా విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెబుతున్నారని, అయితే చైనా భూ యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, ఇక్కడ ఎందుకు అమలు చేయటం లేదని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి... ప్రపంచ బ్యాంకు అందజేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 13వ స్థానంలో ఎందుకు నిలిచిందని కాంగ్రెస్ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి ప్రశ్నించారు. పద్దులపై చర్చ సందర్భంలో వివరంగా సమాధానం వస్తుందంటూ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొనడంతో మంత్రి వాటికి సమాధానం చెప్పలేదు. పాత కార్మికులకే అవకాశం పెద్దపెద్ద సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరిస్తే పాత కార్మికులకే అవకాశం ఇవ్వాలనే విధానాన్ని కూడా అవలంబిస్తున్నామని చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే 20 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వమే పూర్తి చేయించి పక్షం రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తోందని, ఒకవేళ ఆలస్యం జరిగితే అనుమతి వచ్చినట్టుగానే భావించి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా దాన్ని రూపొందించామన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న విధానం చూసి స్వయంగా మన ప్రధాని మోదీ కూడా అభినందించారని సభ దృష్టికి తెచ్చారు. రాయితీలను మొబైల్ యాప్ ద్వారా పొందే వెసులుబాటు కూడా కల్పించామన్నారు. -
నత్తనడకన ఫార్మా సిటీ భూ సేకరణ
మంత్రి జూపల్లి అసంతృప్తి టీఎస్ఐఐసీ ప్రాజెక్టులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్థాపించ తలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకూ ఎక్కువ కాలం పడుతోందని, దీనిని గాడిలో పెట్టాలని ఆదేశించారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులను జూపల్లి సోమవారం సమీక్షించారు. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటి వరకు టీఎస్ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి ఫోన్లో ఆదేశించారు. ఫార్మాసిటీ స్థాపనకు సంబంధించిన అన్ని అంశాలపై వచ్చే మార్చిలోగా స్పష్టతకు రావాలని నిర్దేశించారు. నిమ్జ్ భూ సేకరణకు ప్రత్యేక యూనిట్ మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపినందున భూ సేకరణ వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇప్పటి వరకు 12,500 ఎకరాలు గుర్తించగా, వచ్చే జనవరిలోగా 3,500 ఎకరాలు సేకరిస్తామని టీఎస్ఐఐసీ అధికారులు చెప్పారు. భూ సేకరణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అప్పగించిన భూముల స్థితిగతులపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఎక్కువ మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రస్తుత వీసీ, ఎండీ నర్సింహారెడ్డిపై పనిభారం ఎక్కువగా ఉన్నందున మరో రెండు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, చైనా తరహాలో పారిశ్రామిక పార్కుల్లో సౌకర్యాలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. బుగ్గపాడు ఫుడ్ పార్కు పనులను వేగవంతం చేయాలని.. భూ సేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైతే ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో భూములు గుర్తించాలని సూచించారు. జనవరిలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామిక పార్కులు, ఎస్‌ఈజడ్‌లను సందర్శించడంతో పాటు.. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దశల వారీగా పర్యటిస్తానని జూపల్లి వెల్లడించారు. -
ఫార్మా సిటీకి తక్షణమే మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అంశాల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సమీక్షించారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతోపాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బిడ్‌లో ఉండాల్సిన అంశాలపై ముందస్తుగా కసరత్తు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటివరకు టీఎస్ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫార్మాసిటీ పనులు ఆరు నెలలు ఆలస్యంగా సాగుతున్నందున భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి జూపల్లి ఫోన్లో ఆదేశించారు. భూ సేకరణ సమస్యలను అధిగమించేందుకు తహశీల్దార్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. -
హైదరాబాద్‌కు మరిన్ని హంగులు
ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడిపై హామీ ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నగరానికి మరిన్ని హంగులు, అదనపు మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో రెండోరోజు ఆదివారం జరిగిన తొమ్మిదో ప్రాంతీయ ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలున్నాయన్నారు. ఫార్మా, ఫిల్మ్ సిటీ, మెడికల్ డివెజైస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటూ ప్రవాస భారతీయులను మంత్రి ఆహ్వానించారు. ‘మీరు పెట్టే పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడి ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయి.’ అని హామీ ఇచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోపాటు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అత్యంత అనువైన పరిస్థితులున్నాయని మంత్రి జూపల్లి అన్నారు. వేయి మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, అమెరికాలో భారత రాయబారి అరుణ్.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత
ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్యశాఖల్లో ఇక చేనేత వస్త్రాలే కార్మికులకు రాయితీలు అందిస్తాం.. ఆర్థికంగా ఎదిగేలా చేస్తాం నిఫ్ట్ సహకారంతో చేనేత వస్త్రాలకు కొత్త హంగులు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జరిపేలా చర్యలు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చేనేత కార్మికులకు రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సాయం అడిగే పరిస్థితి నుంచి మార్కెట్‌ను శాసించే స్థాయికి చేనేత రంగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. శుక్రవారమిక్కడ వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం, జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) రీజినల్ డెరైక్టర్ ఈశ్వర్పాటిల్, ఆప్కో డెరైక్టర్ బాబూరావు, పద్మశ్రీ అవార్డు గ్ర హీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేత ను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆర్టీసీ, సింగరేణి, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖల్లో వాడే యూనిఫారాలకు సైతం చేనేత వస్త్రాలనే వాడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. వీటితో పాటు పరిశ్రమల్లో యూనిఫారాలు, నేవీ, ఆర్మీ తదితర దళాల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు వినియోగించేలా ప్రధానితో చర్చిస్తామన్నారు. ఆధునిక వస్త్రధారణకు తగ్గట్టుగా నిఫ్ట్ వంటి సంస్థల భాగస్వామ్యంతో చేనేత వస్త్రాలను తీర్చిదిద్దుతామని, ప్రపంచం నలుమూలలకు వస్త్రాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెజాన్ వంటి ప్రపంచస్థాయి కంపెనీల సహకారంతో ఆన్‌లైన్‌లోనూ ఈ వస్త్రాల విక్రయం జరిగేలా చూస్తామన్నారు. ఆప్కో ద్వారా చేనేత కార్మికులకు బకాయిలు చెల్లించే విధానం సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నెలలోపే డబ్బు అందేలా కొత్త పద్ధతి తెస్తామన్నారు. కార్మికుల ఆత్మహత్యలను నివారిస్తామన్నారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల నాయకులు మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. బడ్జెట్లో చేనేతకు రూ.200 కోట్లు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, చేనేత కార్మికుల పిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గజం అంజయ్య, గజం గోవర్ధన్‌లను మంత్రి సన్మానించారు. -
'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'
హైదరాబాద్: తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరో సవాల్ విసిరారు. తాను రేపు ఉదయం 10 గంటల నుంచి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో అందుబాటులో ఉంటానని అక్కడికి ఎవరైనా రావొచ్చని చెప్పారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ నుంచి ఎవరొచ్చినా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. అంతకుముందు ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానని, టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ చేసిన విషయం తెలిసిందే. పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
రేపు అమెరికాకు జూపల్లి బృందం
హైదరాబాద్: ఈనెల (జూన్) 15 నుంచి 18 వరకు ఫిలడిల్ ఫియాలో జరిగే బయో ఇంటర్నేషనల్ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి బృందం ఆదివారం అమెరికాకు వెళ్లనుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కూడా వెళ్తారు. ఈ బృందం అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించనుంది. తెలంగాణకు పెట్టుబడులే ధ్యేయంగా అమెరికా పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు.