నత్తనడకన ఫార్మా సిటీ భూ సేకరణ
మంత్రి జూపల్లి అసంతృప్తి
టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్థాపించ తలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకూ ఎక్కువ కాలం పడుతోందని, దీనిని గాడిలో పెట్టాలని ఆదేశించారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులను జూపల్లి సోమవారం సమీక్షించారు. టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటి వరకు టీఎస్‌ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. ఫార్మాసిటీ స్థాపనకు సంబంధించిన అన్ని అంశాలపై వచ్చే మార్చిలోగా స్పష్టతకు రావాలని నిర్దేశించారు.
నిమ్జ్ భూ సేకరణకు ప్రత్యేక యూనిట్
మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపినందున భూ సేకరణ వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇప్పటి వరకు 12,500 ఎకరాలు గుర్తించగా, వచ్చే జనవరిలోగా 3,500 ఎకరాలు సేకరిస్తామని టీఎస్‌ఐఐసీ అధికారులు చెప్పారు. భూ సేకరణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీఎస్‌ఐఐసీకి ప్రభుత్వం అప్పగించిన భూముల స్థితిగతులపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఎక్కువ మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రస్తుత వీసీ, ఎండీ నర్సింహారెడ్డిపై పనిభారం ఎక్కువగా ఉన్నందున మరో రెండు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, చైనా తరహాలో పారిశ్రామిక పార్కుల్లో సౌకర్యాలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. బుగ్గపాడు ఫుడ్ పార్కు పనులను వేగవంతం చేయాలని.. భూ సేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైతే ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో భూములు గుర్తించాలని సూచించారు. జనవరిలో టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామిక పార్కులు, ఎస్‌ఈజడ్‌లను సందర్శించడంతో పాటు.. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దశల వారీగా పర్యటిస్తానని జూపల్లి వెల్లడించారు.